‘సర్’కు సవాళ్లు!
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:46 PM
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ప్రారంభమై ఇరవై రోజులు గడిచినా బాలారిష్టాలు తప్పడం లేదు.
ప్రారంభమై 20 రోజులైనా తప్పని బాలారిష్టాలు
ఓటర్లకు అందని ఎన్యుమరేషన్ ఫారాలు
సచివాలయాలకు తీసుకెళ్లమని బీఎల్‌వోలు ఆర్డర్
వేధిస్తున్న సర్వర్
ఎన్యుమరేషన్ ఫారాలు నింపేందుకు అవస్థలు
డిజిటలైజేషన్ చేసింది 30 శాతమే
మిగిలిన గడువు పది రోజులే
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ప్రారంభమై ఇరవై రోజులు గడిచినా బాలారిష్టాలు తప్పడం లేదు. బీఎల్‌వోలకు సాంకేతికతపై సరైన అవగాహన లేకపోవడం, ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్) భర్తీ చేయడంతో ఓటర్లకు అవగాహన లేకపోవడం.. 2002 నాటి ఓటరు వివరాలను తెలుసుకోవడంలో ఇబ్బందులు, డిజిటలైజేషన్ సెల్‌ఫోన్లలో చేయాల్సి రావడంతో నెట్‌వర్క్, మందగించిన సర్వర్ సమస్యలు.. వెరసి సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటికీ పలువురు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదు. జిల్లాలో శనివారం నాటికి డిజిటలైజేషన్ 44.02 శాతానికి మించలేదు. మిగిలిన సమయంలో పది రోజులే.. గడువులోగా వంద శాతం డిజిటలైజేషన్ సాధ్యమేనా..? ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)’ ప్రక్రియ ప్రారంభించే నాటికి జిల్లాలో 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో 2,443 పోలింగ్ స్టేషన్లు (బూత్)లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేసన్‌కు ఒక బీఎల్‌వోను నియమించారు. అంటే.. జిల్లాలో 2,443 మంది బీఎల్‌వోలుగా సచివాలయంలో పని చేసే వీఆర్‌వో. విలేజ్ సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లను తీసుకున్నారు. కొరత ఉన్న గ్రామాల్లో రెవిన్యూ ఉద్యోగు లకు అప్పగించారు. బీఎల్‌వోలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సర్ ప్రక్రియ సక్సెస్ చేసేందుకు మండలం, పట్టణాల్లో ఈఆర్‌ఓ, ఏఈఆర్‌వో లను నియమించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు జూన్ 15న ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నెల 14వ తేది నాటికి వంద శాతం పూర్తి చేయాలి. ఇప్పటికే 20 రోజులు గడిచిపోయినా ఇబ్బందులు తప్పడం లేదు. పలు వార్డులు, గ్రామాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు కూడా అందలేదని తెలుస్తోంది.
మిగిలిన గడువు పది రోజులే
జిల్లాలో 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో బోగస్, మరణించిన ఓటర్లు, వలస వెళ్లిన వాళ్లు ఎందరున్నారు..? ఒకే వ్యక్తికి రెండు అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నవాళ్లు ఎందరు ఉన్నారు..? గుర్తించడం. వారందరనీ జాబితాను నుంచి తొలగించి అర్హులైన ఓటర్ల జాబితాను తయారు చేయడమే ‘సర్’ ప్రధాన లక్ష్యం. కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ వివిధ కారణాలు వల్ల ముందుకు మూడడుగులు.. వెనక్కి ఆరడుగులు...! అన్నట్లు మారింది. శనివారం నాటికి జిల్లాలో 20,57,008 మంది ఓటర్లకు (98.60 శాతం) ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ, అందులో 9,18,388 ఫారాలు (44.02 శాతం) సర్ నిబంధనల మేరకు భర్తీ డిజిటలైజేషన్ చేసినట్లు రికార్డుల్లో చూపించారు. ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీలో రికార్డులకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. పై అధికారుల ఒత్తిళ్తు తట్టుకోలేక ఈఆర్‌వో, ఏఈఆర్‌వో, బీఎల్‌వోలు ఒక్కటై వంద శాతం ఫారాలు పంపిణీ చేసినట్లు చూపుతున్నారు. కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో పలు వార్డుల్లో విచారిస్తే చాలా మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని, బీఎల్‌వోలే మా ఇంటికి రాలేదని అంటున్నారు. కర్నూలు నగరంలో ఉద్యోగులైన భార్య భర్తలకు ఎన్యూమరేషన్ ఫామ్‌లు అందకపోతే సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆదోనిలో ఓ పోలింగ్ స్టేషన్‌కు చెందిన బీఎల్‌వో సచివాలయానికి వచ్చి ఫారాలు తీసుకువెళ్లి, భర్తీ చేసి తీసుకురావాలని అంటున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫామ్‌లు భర్తీ చేయడం తెలియక రాజకీయ పార్టీకి చెందిన బీఎల్‌ఏలు ఫారాలపై ఓటరు ఫోన్ నంబరు, సంతకం మాత్రం చేయించి తీసుకెళ్తున్నారు. 2002 నాటి ఓటరు వివరాలు, ప్రస్తుత వివరాలు రాయడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే, ఫారాలు ఎలా పూరించాలో మాకు తెలియదు.. మిగతా వివరాలు బీఎల్‌వోనే చూసుకుంటుందని పేర్కొనడం కొసమెరుపు. మెజార్టీ గ్రామాలు, పట్టణ వార్డుల్లో ఇదే పరిస్థితి ఉంది. మిగిలన పది రోజుల్లో వంద శాతం డిజిటలైజేషన్ చేయడం సాధ్యమా..? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.
ఫారం ఎలా నింపాలో తెలియక తికమక:
సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారం (ఈఎఫ్) నింపడం ఎంతో ముఖ్యం. మెజార్టీ ఓటర్లు ఈ ఫారం ఎలా నింపాలో తెలియక తికమక పడుతున్నారు. వారిలో విద్యావంతులు కూడా ఉన్నారు. బీఎల్‌వోలు ఇచ్చే ఫామ్ కింది భాగంలో ఓటరు సంబంధించిన వివరాలు ఉంటాయి. పై భాగంలో రెండు పట్టికలు ఉంటాయి. పైభాగంలో ఎడమవైపు పట్టికలో 2002లో మీకు ఓటు హక్కు ఉంటే నింపాలి. ఒకవేళ 2002లో ఓటు హక్కు లేకపోతే పక్కనే ఉన్నన పట్టికలో ఆ సమయంలో ఓటు హక్కు కలిగిన మీ తల్లి తండ్రి/తాత, నాయనమ్మ లేదా బంధువుల పేర్లు రాయాలి. వారి పేరు, ఓటరు కార్డు నంబరు, వారితో మీకున్న బంఽధుత్వం, రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్యను రాయాల్సి ఉంటుంది. ఆ ఫారంతో పాటు ధృవీకరణ కోసం ఆధార్, పాన్‌కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం, డి-పట్టా, పట్టాదారు పాస్తకం, 10వ తరగతి మార్కుల జాబితా.. ఇలా ప్రభుత్వం జారీ చేసిన 12 రకాల ధృవీకరణ పత్రాల్లో ఒకటి జిరాక్స్ కాపీలో జత చేయాలి.
వేధిస్తున్న ప్రధాన సమస్యలు:
పోలింగ్ స్టేషన్ ఒక కాలనీలో ఉంటే, ఓటర్లు మరో కాలనీలో నివాసం ఉంటున్నారు. దీంతో వారి అడ్రస్‌లు కనుక్కొని ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడానికి బీఎల్‌వోలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లో అధికంగా ఉంది.
ఒకే ఇంట్లో ఓటు హక్కు కలిగిన నాలుగైదుగురు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో పేర్లు ఉంటాయి.
నిరుపేదలు, నిరక్షరాస్యులు అధికంగా నివాసముండే పట్టణ స్లమ్ ఏరియాలు, గ్రామాల్లో అవగాహన లోపం వల్ల ఎన్యుమరేషన్ ఫారాలు పూరించడానికి, ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపుకార్డు ఎదో ఒక జిరాక్స్, ప్రస్తుత ఫోటో ఇవ్వడానికి బీఎల్‌వోలకు సహకరించడం లేదు.
2002 నాటి ఓటర్ల వివరాలు దొరక్క విద్యావంతులు కూడా అయోమయానికి గురవుతున్నారు.
పూర్తించిన ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు సెల్‌ఫోన్లలో డిజిటలైజేషన్ చేయాలి. నెట్వర్క్, చార్జింగ్ సమస్యతో పాటు డిజిటలైజేషన్ చేసే సమయంలో ఎవరి నుంచైనా కాల్ వస్తే, మళ్లీ మొదటి నుంచి డిజిటలైజేషన్ చేయాల్సి వస్తుంది.
సర్ ప్రక్రియలో బీఎల్‌వోలకు సహకరించేలా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్‌ఏలకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే.. బీఎల్‌ఏలు మెజార్టీగా సహకరించడం లేదని తెలుస్తుంది.
మిగిలిన సమయం పది రోజులే. దీంతో డిజిటలైజేషన్ చేయాలని బీఎల్‌వోలపై జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్‌వోలు ఒత్తిడి చేయడం, గడవు సమీపిస్తుండం, రాష్ట్రంలో అందరు కూడా డిజిటలైజేషన్ చేస్తుండడంతో సర్వర్ మందగించడం (స్లో) వల్ల జాప్యం జరుగుతుంది.
శనివారం (4వ తేది) నాటికి జిల్లాలో నియోజకవర్గాల వారిగా ఓటర్లు, ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ, డిజిటలైజేషన్ వివరాలు
నియోజకవర్గం ఓటర్లు ఎన్యూమరేషన్ శాతం డిజిటలైజేషన్/ శాతం
సంఖ్య/ పేరు ఫారాలు పంపిణీ ఆన్‌లైన్ చేసింది
137-కర్నూలు 2,74,622 2,69,927 98.29 1,01,199 36.85
138-పాణ్యం 3,35,015 3,30,059 98.52 1,32,715 39.61
142-పత్తికొండ 2,26,970 2,24,460 98.89 1,10,072 48.50
143-కోడుమూరు 2,51,496 2,51,489 100 1,23,354 49.05
144-ఎమ్మిగనూరు 2,53,206 2,45,625 97.01 1,20,659 47.65
145-మంత్రాలయం 2,12,841 2,08,968 98.18 95,635 44.93
146-ఆదోని 2,67,980 2,66,253 99.36 96,527 36.02
147-ఆలూరు 2,63,989 2,60,227 98.57 1,38,227 52.36
మొత్తం 20,86,119 20,57,008 98.60 9,18,388 44.02