రచ్చకెక్కిన గది వ్యవహారం
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:28 AM
నంద్యాల మార్కెట్‌యార్డులో ఛాంబర్(గది)ల వ్యవహారం రచ్చకెక్కింది. పాలకమండలి సౌలభ్యం కోసమే ఛాంబర్‌ను మార్చినట్లు మార్కెట్‌యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు చెబుతున్నారు. తనకే మాత్రం తెలియకుండా గది మార్పు ఏమిటని మార్కెట్ కార్యదర్శి కల్పన పేర్కొంటున్నారు.
మార్కెట్ యార్డులో పాలకమండలి వర్సెస్ కార్యదర్శి
నంద్యాల ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): నంద్యాల మార్కెట్‌యార్డులో ఛాంబర్(గది)ల వ్యవహారం రచ్చకెక్కింది. పాలకమండలి సౌలభ్యం కోసమే ఛాంబర్‌ను మార్చినట్లు మార్కెట్‌యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు చెబుతున్నారు. తనకే మాత్రం తెలియకుండా గది మార్పు ఏమిటని మార్కెట్ కార్యదర్శి కల్పన పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం కాస్త రచ్చయింది. ఇటీవల కాలంగా సెలవుపై ఉన్న మార్కెట్ కార్యదర్శి గురువారం బాధ్యతలు చేపట్టానికి కార్యాలయానికి వచ్చారు. ఛాంబర్ మార్పు చేసి సిబ్బందిని నిలదీశారు. చైర్మన్ మార్చమని చెప్పారని సిబ్బంది తప్పుకున్నారు.
చైర్మన్ ఛాంబర్‌కు వెళ్లిన కార్యదర్శి తనకు ఛాంబర్ అక్కడే కావాలని కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే ఛాంబర్‌ను మార్చినట్లు చైర్మన్ సమాధానం చెప్పారు. పై అంతస్తులో ఉన్న ఛాంబర్ తనకు సౌలభ్యంగా లేదంటూ కార్యదర్శి మొండికేయడంతో వ్యవహారం కాస్త హీటెక్కింది. కార్యదర్శి, చైర్మన్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదంతా సీక్రెట్ కెమరాతో వీడియో తీసి కార్యదర్శియే సోషల్ మీడియాలో పెట్టించారని ఛైర్మన్ ఆరోపిస్తున్నారు. మార్కెట్ యార్డులో రచ్చ మొదలైంది. మూడు రోజులుగా పాలన వ్యవహారం అటకెక్కి వాదోపవాదాలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు. సిబ్బంది చర్చలు కొనసాగుతున్నాయి.
వైసీపీ నాయకులు కొమ్ముకాస్తున్నారు
మార్కెట్‌యార్డు కార్యదర్శి పరోక్షంగా వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తూ మార్కెట్‌యార్డు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పాలకమండలి సభ్యులు వయస్సు పైబడిన వారు ఉండడంతో చైౖర్మన్ ఛాంబర్‌ను పై అంతస్తులో నుంచి కిందకు మార్చారు. అదికూడా మార్కెట్ యార్డు ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని మార్చాం. కార్యదర్శి వ్యవహారాన్ని సీఎం, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాం. - గుంటుపల్లి హరిబాబు, మార్కెట్‌యార్డు చైర్మన్, నంద్యాల
విధులు సక్రమంగానే నిర్వహిస్తున్నా
నా విధులు నేను సక్రమంగానే నిర్వహిస్తున్నా. స్టాండింగ్ కౌన్సిల్ సూచన మేరకు సరైన విధంగా నోటీసులివ్వాలని అనుకున్నాం. మానసిక, వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లా. తాను ఎన్నో నెలల నుంచి ఉంటున్న ఛాంబర్ మహిళనైన తనకు అనువుగా ఉండడంతో అదే ఛాంబర్ కావాలని ఛైర్మ న్‌ను అడిగా. సీక్రెట్ కెమెరా, సోషల్ మీడియా విషయం తనకు తెలియదు. ఛాంబర్ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. - కల్పన, కార్యదర్శి, మార్కెటింగ్‌శాఖ, నంద్యాల