సెస్ లెస్!
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:34 PM
కోడుమూరు మార్కెట్ యార్డు పరిధిలోని తుంగభద్ర చెక్‌పోస్టు. ఈ చెక్ పోస్టు నుంచే తెలంగాణకు, నంద్యాల, కర్నూల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం, శనగలు, కందులు తదితర పంట ఉత్పత్తులు రావాలి.
జీరో వ్యాపారంతో ప్రభుత్వ ఆదాయానికి గండి
మూడు యార్డుల్లో ఉత్పత్తుల క్రయ, విక్రయాలు
12 మార్కెట్ యార్డులకు చెక్‌పోస్టులే దిక్కు
చెక్ పోస్టుల డ్యూటీకి గార్డుల పైరవీలు
కోడుమూరు మార్కెట్ యార్డు పరిధిలోని తుంగభద్ర చెక్‌పోస్టు. ఈ చెక్ పోస్టు నుంచే తెలంగాణకు, నంద్యాల, కర్నూల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం, శనగలు, కందులు తదితర పంట ఉత్పత్తులు రావాలి. అయితే సెస్సు చెల్లించకుండానే చెక్‌పోస్టుల్లో డ్యూటీలు చేసే సెక్యూరిటీ గార్డులకు మామూళ్లు ఇచ్చుకుని దర్జాగా వెళ్తున్నాయి. ఇలా అనేక చోట్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న చెక్‌పోస్టులు జీరో వ్యాపారానికి కేరాఫ్ అడ్ర్‌సలుగా మారుతున్నాయి. తుంగభద్ర చెక్‌పోస్టులో జరుగుతున్న అక్రమాలపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు తెలిసి కూడా అటువైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు.
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి పంట ఉత్పత్తులు కోడుమూరు మీదుగా తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకకు తరలిపోతున్నాయి. దీంతో సెస్సు ఆదాయానికి భారీగా గండిపోతుంది. ఉమ్మడి జిల్లాలోని చెక్‌పోస్టులన్నింటీలో ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఏటా సెస్సు ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 22 చెక్‌పోస్టులు ఉన్నాయి. మార్కెట్ యార్డుల్లో రైతులు తెచ్చిన పంట ఉత్పత్తుల విక్రయాలు జరిగేవి కేవలం కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మాత్రమే. మిగిలిన 13 మార్కెట్‌యార్డులో కేవలం పశువుల సంతలు, పత్తికొండ మార్కెట్ యార్డులో టమోటాల విక్రయాలు కొద్దిగా జరుగుతుంది. దీంతో ఆయా మార్కెట్ కమిటీలకు లక్ష్యంగా నిర్దేశించిన సెస్సు ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అధికారుల అంచనా మేరకే రైతులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన పంట ఉత్పత్తుల్లో కేవలం 4వ వంతు పంట ఉత్పత్తులు మాత్రమే మార్కెట్ యార్డుల ద్వారా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన 12 మార్కెట్ యార్డులకు లక్ష్యం మేరకు ఆదాయాన్ని సెస్సు రూపంలో పొందేందుకు చెక్‌పోస్టులే కీలకం. క్రమక్రమంగా వ్యాపారులు మార్కెట్ కమిటీల సెక్రటరీలను, సిబ్బందిని అనుకూలం చేసుకుని మామూళ్లు ఇచ్చుకుంటూ తమ జీరో వ్యాపారాన్ని అంటే ఎటువంటి సెస్సు చెల్లించకుండా రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇందులో భాగంగా చెక్‌పోస్టుల్లోనే అత్యధికంగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. చెక్‌పోస్టుల్లో డ్యూటీల కోసం సెక్యూరిటీ గార్డులు ఎమ్మెల్యేలు, ఇతర అధికార పార్టీకి చెందిన నాయకుల చేత సిఫారసులు చేస్తున్నారంటే ఈ చెక్‌పోస్టుల ద్వారా ఎంత ఆదాయాన్ని అక్రమంగా జేబుల్లో వేసుకునే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో చెక్‌పోస్టు నుంచి ఆయా మార్కెట్ కమిటల సెక్రటరీలకు ప్రతి నెలా రూ.5వేల నుంచి రూ.10వేల దాకా ఈ చెక్‌పోస్టుల్లో డ్యూటీలు చేస్తున్న సెక్యూరిటీ గార్డులు ఇచ్చుకుంటున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
జేబులు నింపుతున్న చెక్‌పోస్టులు
కర్నూలు మార్కెట్ కమిటి పరిధిలో బళ్లారి ఎక్స్‌రోడ్డు మాత్రమే ఏర్పాటు చేశారు. కోడుమూరు మార్కెట్ కమిటి పరిధిలో తుంగభద్ర చెక్‌పోస్టు ఉంది. అదే విదంగా ఆదోని మార్కెట్ కమిటి పరిధిలో సిరిగుప్ప చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. నంద్యాలలో నూనెపల్లి, ట్యాంకుబండ్, అదే విదంగా ఎమ్మిగనూరులో గోనెగండ్ల చెక్‌పోస్టు, ఆళ్లగడ్డ, సిరివెళ్ల చాగలమర్రి చెక్‌పోస్టులు ఉన్నాయి. డోన్ మార్కెట్ కమిటీలో ప్యాపిలి, వెల్దుర్తి, బేతంచెర్ల చెక్‌పోస్టులు పంట ఉత్పత్తులను తరలించే వ్యాపారుల నుంచి సెస్సును వసూలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మార్కెట్ కమిటీలో నందికొట్కూరు, జూపాడుబంగ్లా, తలముడిపి చెక్‌పోస్టులు, ఆత్మకూరు మార్కెట్ కమిటి పరిధిలో వెలుగోడు, చెక్‌పోస్టులు, బనగానపల్లె మార్కెట్ కమిటి పరిధిలో నందవరం, అవుకు, కోయలకుంట్ల మార్కెట్ పరిధిలో కోయలకుంట్ల, మాయలూరు, భాగ్యనగరం, గుండుపాపల చెక్‌పోస్టులు ఉన్నాయి. ఆలూరు మార్కెట్ కమిటి పరిధిలో ఆలూరు, ఆస్పరి, పత్తికొండ మార్కెట్ కమిటి పరిధిలో పత్తికొండ, దేవనకొండ చెక్‌పోస్టులు ఉన్నాయి. ఏటా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 15 మార్కెట్ కమిటీల నుంచి దాదాపు రూ.18 కోట్ల దాకా వసూలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ లక్ష్యాలను ఇస్తూ వస్తోంది.
అక్రమాలు ఇలా
చెక్‌పోస్టుల్లో సూపర్‌వైజర్ స్థాయి అధికారితో పాటు సెక్యూరిటీ గార్డులు వ్యాపారుల నుంచి పంట ఉత్పత్తుల రవాణాకు సంబందించి ఒక శాతం సెస్సును వసూలు చేయాలి. అయితే నిబంధనలకు విరుద్దంగా సెక్యూరిటీ గార్డులు కాకుండా వారు బినామీ వ్యక్తులను ఇక్కడ వసూళ్ల కార్యక్రమానికి నియమించుకుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పాణ్యం మార్కెట్ కమిటి పరిధిలోని ఒక సూపర్‌వైజర్ తన బంధువునే సెస్సు వసూళ్లకు నియమించుకున్నట్లు తెలిసింది. అదే విదంగా కోడుమూరు మార్కెట్ కమిటి పరిధిలోని తుంగభద్ర చెక్‌పోస్టులో సెస్సు వసూలు కోసం సెక్యూరిటీ గార్డుల మద్యనే ఘర్షణలు, పెద్ద ఎత్తున ఫైరవీలు చోటు చేసుకుంటున్నాయి. ఈ చెక్‌పోస్టులో డ్యూటీల కోసం కొంత మంది సెక్యూరిటీ గార్డులు, ఎమ్మెల్యేలు వారి అనుచరుల చేత సెక్రటరీలకు సిఫారసు చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ చెక్‌పోస్టులో గత సంవత్సరం డ్యూటీ కోసం సెక్యూరిటీ గార్డులు ఘర్షణ కూడా పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మార్చిలో మహా చెక్ పేరుతో తనిఖీలు
మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఏడీఎం మొదలుకుని సెక్రటరీలు, సూపర్‌వైజర్లు మార్చి నెలలో మహాచెక్ పేరుతో చెక్‌పోస్టుల్లో ఒక రోజు తనిఖీలకు సిద్దమవుతున్నారు. నిరంతరం తనికీలు జరగాల్సిన చెక్‌పోస్టుల్లో సంవత్సరానికి కేవలం ఒక నెలలో అదీ రెండు, మూడు రోజులు మాత్రమే మహాచెక్ పేరుతో తనిఖీలు చేస్తే గండి పడే ఆదాయాన్ని ఏ విదంగా పూడ్చుకోగలుగుతారో ఆ దేవునికే తెలియాలి. ఏదో నామమాత్రంగా చెక్‌పోస్టులను తాము గాడిలో పెడుతున్నామనీ, అక్రమంగా వ్యాపారులు ఎవరూ పంట ఉత్పత్తులను దారి మళ్లించడం లేదని, పై అధికారులకు నివేదికలు పంపడానికే ఈ మహాచెక్ పేరుతో తనిఖీల ప్రక్రియను మొదలెట్టారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
మూడొంతులు పక్కదారి?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు ఖరీఫ్, రబీ సీజన్లలో 12 లక్షల హెక్టార్లలో ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలు, కూరగాయల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంట ఉత్పత్తుల్లో కేవలం నాలుగో వంతు మాత్రమే కర్నూలు, నంద్యాల, ఆదోని మార్కెట్ కమిటీల యార్డుల్లో రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు. మిగిలిన మూడు వంతుల పంట ఉత్పత్తులను వ్యాపారులు గ్రామాలకే వెళ్లి రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రాత్రి పూట పక్కదారి పట్టిస్తున్నారు. చెక్‌పోస్టుల్లో డ్యూటీ చేస్తున్న సిబ్బందికి ఒప్పందం మేరకు మామూళ్లు ఇచ్చుకుంటూ తమపై కేసులు బనాయించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. వాస్తవంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 15 మార్కెట్ కమిటీల ద్వారా ఏటా మార్చి నాటికి దాదాపు రూ.80 కోట్లకు పైగానే సెస్సు వసూలు కావాల్సి ఉంది. అయితే.. ఈ లక్ష్యాన్ని చేరేందు కోసం చెక్‌పోస్టులే కీలకంగా మారాయి.
లక్ష్యం మేరకు సెస్సు వసూలు చేస్తున్నాం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు మార్కెట్ కమిటీల నుంచి సెస్సును వసూలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వ్యాపారులు పంట ఉత్పత్తులను గ్రామాలకే వెళ్లి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నా లారీలను ఎక్కడికక్కడే నిలబెట్టి వ్యాపారుల చేత ముక్కుపిండి సెస్సును వసూలు చేస్తున్నాం. ఎక్కడా అక్రమాలు జరగడం లేదు. చెక్‌పోస్టుల నుంచి తమ సెక్రటరీలు, సిబ్బంది ఎవరూ కూడా మామూళ్లు వసూలు చేయడం లేదు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే వెంటనే విచారణ జరిపి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.
- నారాయణమూర్తి, ఏడీఎం