శ్మశానం ఆక్రమణ
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:13 AM
:పట్టణంలోని హిందూ శ్మశానం ఆక్రమణకు గురైంది. మిట్టపల్లె గ్రామ సర్వే నంబరు 169లో 1.60 ఎకరాల్లో ఈ శ్మశానం ఉంది. గతంలో ఈ పొలాన్ని దాతలు విరాళంగా ఇచ్చారు. అయితే ఈ సర్వే నంబరులో హిందూ శ్మశాన స్థలం రోజు రోజురోజుకు కుచించుకుపోతోంది. పట్టణ జనాభా పెరగడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి
కనీస సౌకర్యాలు లేక అంత్యక్రియలకు అవస్థలు
వర్షాకాలంలో ప్రజల నరకయాతన
బనగానపల్లె, జూన్ 2 (ఆంధ్రజ్యోతి):పట్టణంలోని హిందూ శ్మశానం ఆక్రమణకు గురైంది. మిట్టపల్లె గ్రామ సర్వే నంబరు 169లో 1.60 ఎకరాల్లో ఈ శ్మశానం ఉంది. గతంలో ఈ పొలాన్ని దాతలు విరాళంగా ఇచ్చారు. అయితే ఈ సర్వే నంబరులో హిందూ శ్మశాన స్థలం రోజు రోజురోజుకు కుచించుకుపోతోంది. పట్టణ జనాభా పెరగడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా భావించిన కొందరు హిందూ శ్మశానాన్ని ఆక్రమించారు. శ్మశానం పక్కనే భూములు ఉన్న కొందరు వ్యక్తులు ఏకంగా సరిహద్దులు తొలగించి తమ భూమిలోకి కలిపేసుకున్నారు. బోరు కూడా వేసుకొని సాగు చేసుకుంటున్నారు.
అంతిమ యాత్రకు తప్పని అవస్థలు
ఈ ఆక్రమణల వల్ల సాధారణ ప్రజలు అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. శ్మశానాకిఇ దారి కూడా లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడవడానికి గతంలో దారి ఉండేది.. అయితే ఆ దారిని కూడా ఆక్రమించేశారు. వర్షాకాలంలో బురదలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పంట పొలాలు, ముళ్ల పొదలుమధ్య నుంచి శ్మశానికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
ఒకవైపు ఆక్రమణలు కాటేస్తుంటే ఉన్న కాస్త స్థలంలో నీటి సదుపాయం, లైటింగ్, కూర్చోవడానికి షెడ్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముళ్లకంపలు తొలగించాలని, దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శ్మశానం చుట్టూ కాంపౌండ్ నిర్మించి గ్రామ పంచాయతీ పరిధిలోకి తేవాలని కోరుతున్నారు. వైకుంఠధామాన్ని ఆధునికీకరించి మంచినీరు, దహన వాటికల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
శ్మశానాన్ని కాపాడాలని ప్రజల వినతి
హిందూ శ్మశానం ఆక్రమణపై అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని హిందూ సంఘాల నాయకులు, ప్రజలు వాపోతున్నారు. నామ్‌కే వాస్తేగా సర్వే చేసి ఆక్రమణలకు గురైందని చెప్పారే కాని రాళ్లు పాతలేదని అంటున్నారు. రెవెన్యూ అఽధికారులు పక్కాగా సర్వే సర్వే చేయాలని, ఆక్రమణ నుంచి శ్మశాన స్థలాన్ని కాపాడాలని ప్రజలు విన్నవిస్తున్నారు.