ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:32 PM
ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్నిశాఖలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్లో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉగాదిని పురస్కరించుకొని శ్రీశైలానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా వస్తారన్నారు. మార్చి 2 నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. భక్తులకు తాగునీరు అందించేందుకు రోజుకు 4నుంచి 5లక్షల నీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచాలన్నారు. నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలన్నారు. మార్చి 8నుంచి ప్రధాన ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలు, పాదయాత్ర మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి వైద్యులను అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. రోజుకు 8 వేల నుంచి 10 వేల మందికి స్లాట్ విధానంలో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శన సమయాల వివరాలు సూచిక బోర్డులపై ప్రదర్శించాలన్నారు. భక్తుల రద్దీని బట్టి 6వ తేదీ నుంచి వలంటీర్లనను నియమించే అంశంపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు.జేసీ కార్తీక్, ఆత్మకూరు అటవీ శాఖ డీడీ విఘ్నేష్ అపూర్వ, దేవస్థాన ఈవో శ్రీనివాసులు, డీఆర్వో రామునాయక్ పాల్గొన్నారు.