అరికెరలో కార్డన్ సెర్చ్
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:03 AM
దేవరగట్టు బన్నీ ఉత్సవం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
83 రింగ్ కర్రలు, గండ్ర గొడ్డలి స్వాధీనం
ఆలూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): దేవరగట్టు బన్నీ ఉత్సవం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఆదేశాల మేరకు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య పర్యవేక్షణలో మంగళవారం తెల్లవారుజామున ఆలూరు మండలం అరికెర గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పత్తికొండ సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 83 రింగులు తొడిగిన కర్రలను, ఒక గండ్ర గొడ్డలి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. బన్నీ ఉత్సవం సందర్భంగా రింగులు తొడిగిన కర్రలతో పరస్పరం కొట్టుకోవడం, గొడవలకు పాల్పడడం, ఆయుధాలు వినియోగించడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడకూడదని ఆదేశించారు. అనంతరం ఆలూరు పోలీ్‌సస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవరగట్టు బన్నీ ఉత్సవం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీసుశాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోందని తెలిపారు. సమావేశంలో ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐలు మన్మథవిజయ్, ఈశ్వరరావు ఉన్నారు.