కారు అద్దాలు పగలగొట్టి రూ.5 లక్షలు అపహరణ
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:21 AM
బ్యాంకు రుణం తీరుద్దామని తెచ్చుకున్న నగదును దుండగులు క్షణాల్లో కాజేశారు. కారు అద్దాలు పగలగొట్టి రూ.5 లక్షల నగదును అపహరించిన ఘటన ఆదోని పట్టణంలో సోమవారం కలకలం రేపింది. వివరాలివీ.. ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన రైతు రమేశ్, తన కుమారుడు రఘుతో కలిసి సోమవారం ఆదోని పట్టణానికి వచ్చారు
ఆదోనిలో పట్టపగలే ఘటన
ఆదోని, జనవరి 5(ఆంధ్రజ్యోతి): బ్యాంకు రుణం తీరుద్దామని తెచ్చుకున్న నగదును దుండగులు క్షణాల్లో కాజేశారు. కారు అద్దాలు పగలగొట్టి రూ.5 లక్షల నగదును అపహరించిన ఘటన ఆదోని పట్టణంలో సోమవారం కలకలం రేపింది. వివరాలివీ.. ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన రైతు రమేశ్, తన కుమారుడు రఘుతో కలిసి సోమవారం ఆదోని పట్టణానికి వచ్చారు. పంట పెట్టుబడి కోసం గతంలో తీసుకున్న బ్యాంకు రుణాన్ని చెల్లించేందుకు గడువు చివరి రోజు కావడంతో పెద్ద మొత్తంలో నగదు సర్దుబాటు చేసుకున్నారు. తమ బంధువు చంద్రప్ప వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకునేందుకు రమేశ్ ఒప్పందం చేసుకున్నారు. చంద్రప్ప సూచన మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా వద్దకు చేరుకోగా, ఆయన బ్యాంకు నుంచి రూ.5 లక్షలు డ్రా చేసి రమేశ్‌కు ఇచ్చారు. అయితే లోన్ కట్టేందుకు మరో రూ.50 వేలు తక్కువ పడడంతో అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తిని రమేశ్ సంప్రదించారు. వెంకటేశ్ తన వద్ద ఉన్న డబ్బును మారుతి వైన్స్ వద్ద ఇస్తానని చెప్పడంతో రమేష్ తన వద్ద ఉన్న రూ.5 లక్షల నగదును కారులో ఉంచి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మారుతి వైన్స్ షాపు వద్దకు వెళ్లారు. రమేశ్, రఘు ఇద్దరూ కలిసి కారు దిగి వెళ్లిన కొద్దిసేపటికే మాటు వేసిన దుండగులు కారు ఎడమ వైపు అద్దాన్ని పగలగొట్టారు. సీటు ముందు డిక్కీలో ఉంచిన రూ.5 లక్షల నగదును అపహరించి పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బాధితుడు బ్యాంకు నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎవరైనా వెంబడించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులకు కాని, రద్దీ ప్రాంతాలకు కాని నగదుతో వెళ్లేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని త్రీటౌన్ సీఐ రామలింగమయ్య సూచించారు. బాధితులు రమేశ్, రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.