Share News

కాలువ ఇలా.. సాగునీరు ఎలా?

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:22 AM

మండలంలోని రామభద్రునిపల్లె చెరువు కొండకాల్వలో ముళ్ల కంప, పూడికతో సాగునీరు దిగువకు పారడం లేదు. నాలుగేళ్ల నుంచి కాల్వకు నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలువ ఇలా.. సాగునీరు ఎలా?
ముళ్ల కంపతో నిండిన కొండ కాలువ

సంజామల మండలం కొండ కాలువలో ముళ్లకంపతో ముందుకు పారని నీరు

ప్రశ్నార్థకంగా 1,500 ఎకరాల ఆయకట్టు

సంజామల, జూలై 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని రామభద్రునిపల్లె చెరువు కొండకాల్వలో ముళ్ల కంప, పూడికతో సాగునీరు దిగువకు పారడం లేదు. నాలుగేళ్ల నుంచి కాల్వకు నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిధిలో రామభద్రునిపల్లె, గిద్దలూరు, మిక్కినేనిపల్లె, ఆర్‌ లింగందిన్నె, మంగపల్లె గ్రామాల పరిధిలో 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువకు నీరు విడుదల చేసేందుకు రెండు తూమలు ఉన్నాయి. అలాగే కొండకాల్వ కింద గిద్దలూరు, మిక్కినేనిపల్లెకు చెందిన దాదాపు 700ఎకరాల ఆయకట్టు ఉండగా, కాలువలో ముళ్ల కంప పూడిక పెరగడంతో నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు.

వర్షాధార పంటలే ఆధారం..

కాలువలో ముళ్ల కంపతో సాగునీరు అందే అవకాశం లేక రైతులు వర్షాధార పంటలు సాగుచేసుకుంటున్నారు. నాలుగేళ్లుగా ఇలాగే ఉందని, జలధార, జలహారితి పథకం కింద పనులు చేసి కాలువ నుంచి పూడిక తొలగించాలని కోరుతున్నారు.

కొండకాలువకు మరమ్మతులు చేయాలి

కొండకాలువ కింద నాకు మూడు ఎకరాల భూమి ఉంది. నాలుగేళ్ల నుంచి కాలువకు నీరు అందక వర్షాధారిత పంటలు సాగుచేస్తున్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు ముళ్లకంప, పూడిక తొలగించాలి. - హుస్సేనయ్య, రైతు, గిద్దలూరు.

నాలుగేళ్లుగా సాగునీరు లేదు

నాకు 8 ఎకరాలు ఉంది, కొండకాల్వకు నాలుగేళ్ల నుంచి సాగునీరు అందడం లేదు. సాగునీటి కోసం పక్క రైతులను ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి, పూడిక తొలగించాలి. - మౌలాలి, రైతు, గిద్దలూరు.

Updated Date - Jul 24 , 2026 | 12:23 AM