కాలువలు ఇలా.. సాగు ఎలా?
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:29 AM
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పంటల సాగుకు ప్రధాన నీటి వనరు తెలుగు గంగ కాలువ. అయితే కాలువల నిర్వహణ లేకపోవడంతో ముళ్లకంప, పూడికతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. అధికారులు స్పందించి, పూడిక తీసి, లైనింగ్ పనులు చేయాలని రైతులు కోరుతున్నారు.
దెబ్బతిన్న తెలుగు గంగ కాలువ
పూడికతో పారని సాగునీరు
చాగలమర్రి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తెలుగు గంగ కాలువ ఈ ప్రాంతంలో సాగయ్యే పంటలకు జీవనాధారం. దాదాపు 10వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా అధికారులు నిర్వహణను మరచిపోవడంతో పిల్లకాలువలు దెబ్బతిని పొలాలకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. పూడిక, ముళ్ల కంపపెరిగి అధ్వానంగా తయారయ్యాయి. టీడీపీ ప్రభుత్వం జలధార కింద పనులు చేయకపోవంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనలకే పరిమితం..
ప్రతి ఏడాది పంట కాలువల్లో పూడిక తీయాలనే లక్ష్యం ప్రతిపాదనలతోనే ఆగిపోతోంది. గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 20 ఏళ్ల నుంచి పంట కాలువల లైనింగ్ పనులకు మోక్షం లభించలేదు.
అసంపూర్తిగా పనులు
టీజీపీ ప్రధాన కాలువ 85 నుంచి 96 కి.మీ వరకు లైనింగ్ అధ్వానంగా మారింది. గత ఏడాది భారీ వర్షాల ప్రభావంతో ప్రధాన కాలువ దెబ్బతింది. మండలంలోని పెద్దవంగలి, చింతలచెరువు, డి.వనిపెంట, ముత్యాలపాడు, కొలుములపేట, చిన్నవంగలి, పెద్దబోదనం తదితర గ్రామాల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. 2004లో సాగు, తాగునీరు అందించేందుకు 35, 36, 37 బ్లాక్‌లలో పనులు చేపట్టారు. అప్పటి కాంట్రాక్టర్లు కొంతరకు చేపట్టి మధ్యలోనే నిలిపి వేశారు.
సాగునీటి ప్రవాహానికి ఆటంకం..
వీబీఆర్ నుంచి టీజీపీ ప్రధాన కాలువకు ప్రతి ఏడాది నీరు విడుదల చేసినా ఆ నీరు చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదని రైతులు వాపోతున్నారు. ఉప కాలువలకు లైనింగ్ పనులు చేయకపోవడంతో పిచ్చి మొక్కలతో నిండిపోవడంతోపాటు, చిన్నవంగలి, చింతలచెరువు గ్రామ సమీపంలో కొందరు కాలువలను ఆక్రమించుకొని పొలాలు వేయడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.
రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపాం
టీజీపీ ప్రధాన కాలువ లైనింగ్ మరమ్మతులకు రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. 85 నుంచి 96 కి.మీ పరిధిలో భారీ వర్షాలకు లైనింగ్ దెబ్బతినింది. నిధులు మం జూరైతే పనులు చేస్తాం. - వెంకటరమణ, టీజీపీ డీఈ, చాగలమర్రి