సీఎంతో ముఖాముఖిలో సమస్యలు తీరేనా?
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:19 PM
సీఎంతో ముఖాముఖిలో సమస్యలు తీరేనా?
రేపు సాగునీటి సంఘాల నాయకులతో సమావేశం
రూ. 7కోట్ల పనులు జరిగినా విడుదల కాని బిల్లులు
అధ్వానంగా ఉన్న ఎల్లెల్సీ కాలువ మరమ్మతు కోసం రైతుల ఎదురుచూపు
కాలువల అభివృద్ధ్దికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసింది. ఆదోని డివిజన్‌లో ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నియోజక వర్గాలలో ఎల్లెల్సీ, గాజులదిన్నె ప్రాజెక్టు, రాంపురం చానల్ కింద సాగునీటి సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎల్లెల్సీ కింద 58 సాగునీటి సంఘాలు, గాజులదిన్నె ప్రాజెక్టు కింద 12 సాగునీటి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులతో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. సాగునీటి సంఘాల నాయకులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా సాగునీటి సంఘాలలో నెలకొన్న సమస్యలు తీరుతాయని రైతులు ఆశిస్తున్నారు.
గోనెగండ్ల/ఎమ్మిగనూరు,ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నీటి సంఘాలకు ఎన్నికలు జరిపి కాలువల మరత్తుల కోసం నియోజకవర్గానికి రూ. 2 కోట్ల మేర నిధులను విడుదల చేసింది. కొన్ని చోట్ల పనులు జరిగి నెలలు గడుస్తున్నా నిధులు విడుదల కాలేదని కాంట్రాక్టర్‌లు వాపోతున్నారు. ఎమ్మిగనూరు డివిజన్ పరిధిలో ఎల్లెల్సీ కింద 31 పనులను గుర్తించారు. అందులో 19 పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే గాజులదిన్నె ప్రాజెక్టు కింద రూ. 2 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. బిల్లులు చెల్లింపు గురించి 5వ తేది సీఎంతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు సాగునీటి సంఘాల నాయకులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇవి నామినేట్ పనులు కావడంతో నియోజకవర్గాల నాయకులు తమ అనుచరులకు ఇచ్చుకున్నారు.
గతంలో చేసిన పనులకు కూడా బిల్లులేక..
గతంలో ఎస్‌డీఎంఎఫ్ కింద కొన్ని పనులు చేశారు. అలాగే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద కాలువల గుంతలు పూడ్చడం, కాంక్రీట్ పనులు, షట్టర్ ఏర్పాటు వంటి 9 పనులు దాదాపు రూ. 1.80 కోట్లతో చేశారు. పనులు పూర్తయినా నిధులు విడుదల కాలేదని పనులు చేసి కాంట్రాక్టర్‌లు వాపోతున్నారు.
ఎమ్మిగనూరు డివిజన్‌లో ఎల్లెల్సీ కాలువ ఆఽధ్వానం
ఎమ్మిగనూరు డివిజన్‌లో ఎల్లెల్సీ కాలువ అధ్వానంగా తయారైంది. ఎమ్మిగనూరు నుంచి గుడికల్లు చెరువు నుంచి కడిమెట్ల వరకు అటు తరువాత బాపురం దగ్గర నుంచి గోనెగండ్ల కోడుమూరు వరకు ఎల్లెల్సీ కాలువ గట్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీనికి తోడు కాలువ గట్ల పైన పిచ్చిమొక్కలు మొలవడంతో, కొందరు అక్రమ సాగుదారులు పైపులు వేసుకునేందుకు కాలువ గట్లలను పగల గొట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏడాది నిధులు విడుదల అవుతున్నాయే తప్ప పనులు మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతున్నాయని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.
సీఎంతో ముఖాముఖిలోనైనా ఎల్లెల్సీ, జీడీపీ పరిస్థితి మారేనా
ఈ నెల 5న విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సాగునీటి సంఘాల అధ్యక్ష, ఉపాఽధ్యక్షుల ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం తోనైనా పాత నిధులు విడుదలై, కొత్త పనులు జరిగి ఎల్లెల్సీ, జీడీపీ కాలువల పరిస్థితి మారుతుందా? అని రైతులు ఎదురు చూస్తున్నారు.