కీలక అంశాలకు కేబినేట్ ఆమోదం
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:37 AM
సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన 1383వ(46వ) కేబినేట్ సమావేశంలో జిల్లాలోని పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.
టీడీపీ జిల్లా కార్యాలయంతో పాటు
పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
క్వారీల లీజులో వడ్డెర్లకు అవకాశం
నిరుద్యోగులకు ఉపాధి అవకాశం
నంద్యాల, మార్చి26(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన 1383వ(46వ) కేబినేట్ సమావేశంలో జిల్లాలోని పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ప్రధానంగా జిల్లా టీడీపీ కార్యాలయానికి స్థల కేటాయింపుతో పాటు పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. దీంతో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేబినేట్ ఆమోదంతో టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా గతంలో జిల్లా కేంద్రంలో ఆశించిన స్థాయిలో టీడీపీ కార్యాలయం లేకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉండేది. త్వరలో జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో టీడీపీ కార్యాలయం ఏర్పాటు కానున్నది. ఇదే క్రమంలో జిల్లాలోని వడ్డ్డెర్లకు క్వారీల లీజుకు ఆమోదం తెలిపారు.
టీడీపీ శ్రేణులకు ఊరట...
నంద్యాల పట్టణ శివారులోని నూనెపల్లె గ్రామంలోని సర్వే నెంబర్ 386-1లో 0.50 సెంట్లు, సర్వే నెంబరు 387-1ఏలో 1.50 సెంట్లు చొప్పున మొత్తంగా 2.00 ఎకరాలను జిల్లా టీడీపీ కార్యాలయ భవన నిర్మాణం కోసం 33 ఏళ్లు లీజు ప్రాతిపదికన జిల్లా టీడీపీ అధ్యక్షులుకు కేటాయించారు. అదే విధంగా ప్రతి ఎకరాకు ఏడాదికి రూ. 1000 చొప్పున అద్దె(లీజు) రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలని అదేశించింది. ఇదిలా ఉండగా.. సదరు టీడీపీ కార్యా లయం ఏర్పాటు కోసం ఇటీవల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో పాటు నంద్యాల మార్కెట్‌యార్డు చైర్మన్ హరిబాబు పలుమార్లు సీఎంతో పాటు మంత్రి లోకేష్‌ను కలిసి వినతులు అందజేశారు.
పలు ప్రాజెక్టులకు...
జిల్లాలోని బేతంచెర్ల మండలం గుతుపల్లి, ఆర్.ఎస్ రంగాపురం, కొలుముళ్లపల్లి, ముద్దవరం, బేతంచెర్ల గ్రామాల్లోని సర్వే నెంబర్లు 225-సి, 342లోని 27.83 ఎకరాలతో పాటు డోన్ మండలం మల్కాపురం, కొచ్చెరువు, డోన్, ఎస్. వలసాల గ్రామాల పరిధిలోని సర్వే నెంబర్లు 389,949 తదితర సర్వే నెంబర్ల పరిధిలోని 33.91 ఎకరాల ప్రభుత్వ భూమిని పవన విద్యుత్( విండ్‌పవర్) ప్రాజెక్టు నిర్మాణం(168.30 మెగావాట్) కోసం ఇకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ అనే సంస్థకు లీజు రూపంలో కేటాయిస్తూ నెడ్‌క్యాప్‌కు అప్పగించారు. సదరు లీజు 30 ఏళ్లుకు కల్పిస్తూ.. ఒక్కొక్క ఎకరాకు ఏడాదికి రూ. 31 వేలు చోప్పున లీజు చెల్లించేలా కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రతి రెండేళ్లకు లీజుపై 5శాతం పెంచాలని అదేశించింది. ఇదిలా ఉండగా..ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆయా స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కలగనుంది.
పీఎన్‌జీకి సబ్సిడీ వర్తింపు..
దీపం-2 కింద ఎల్‌పీజీ కనెక్షన్ కింద లబ్ధిదారులకు అందించే సబ్సిడీని ఇళ్లలో న్యాచురల్ గ్యాస్(పీఎన్‌జీ) వినియోగించే వినియోగదారులకు కూడా సదరు సబ్సిడీని వర్తించే కేబినేట్ ఆమోదం తెలిపింది. తద్వారా ఆయా వర్గాలకు కొంత ఊరట కలిగినట్లైంది. అదేవిధంగా మున్సిపాలి టీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి పేరుకపోయిన ఆస్తి పన్నులో 50శాతం రాయితీ అంశంపై కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జిల్లాలోని వడ్డెర సంఘాలకు 15శాతం క్వారీలను లీజుకు అవకాశం కల్పించడంతో పాటు సీనరేజీలో 50శాతం రాయితీ సదుపాయం కూడా కల్పించారు. ఆయితే సదరు లీజులను ఇతరులకు విక్రయించరాదని షరతు విధించారు.