Share News

బై బై గణేశా..!

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:19 PM

‘బోలో గణేశ్‌ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా..’

బై బై గణేశా..!

గంగమ్మ చెంతకు గణనాథులు

యువత నృత్య విన్యాసాలు

ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు

నగరంలో సుమారు 2 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం

కనుల పండువగా ఏకదంతుడి నిమజ్జనోత్సవం

ముగిసిన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు

‘బోలో గణేశ్‌ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా..’ అన్న నినాదాలతో కర్నూలు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తొమ్మిది రోజుల పాటు భక్తులతో విశేష పూజలు అందుకున్న పార్వతీ తనయుడిని మంగళవారం భక్తి శ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు. ఉదయం వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనాన్ని ప్రారంభించారు. బాణసంచా కాలుస్తూ, రంగులు చల్లుకుంటూ, డీజీల మోత, డప్పు వాయిద్యాల మధ్య ఆనందోత్సాహాలతో ఉత్సవ ఊరేగింపు కొనసాగించారు. నిమజ్జనోత్సవంలో యువత, పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. నగరంలోని నలువైపుల నుంచి గణనాథులు వినాయక ఘాట్‌కు చేరగా గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో ఏకదంతుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. తెల్లవారే వరకు నిమజ్జన వేడుకలు కొనసాగాయి.

కర్నూలు కల్చరల్‌, న్యూసిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు మంగళవారం రాత్రి వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజులుగా వివిధ ప్రాంతాల్లోని మంటపాల్లో ప్రతిష్టించిన గణనాథులను ఆయా మంటపాల నిర్వాహకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి మంగళవారం మధ్యాహ్నం నుంచి ఊరేగింపు ప్రారంభించి, గంగమ్మ ఒడికి భక్తిశ్రద్ధలతో సాగనంపారు. నిమజ్జనోత్సవంలో యువత, పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈసారి కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌, నన్నూరు టోల్‌ ప్లాజ్‌ వద్ద హంద్రీనీవా కాల్వ, ఉలిందకొండ హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ వద్ద అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ఉత్సవ మంటపాల నిర్వాహకులు వినాయక ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లోకి ఎక్కించి, వారికి అందుబాటులోని ఘాట్లకు తరలి వచ్చారు. యువత, పిల్లలు వివిధ వేషధారణలు ధరించి భక్తులను ఆకట్టుకున్నారు. బాణసంచా కాలుస్తూ, రంగులు చల్లుకుంటూ, డీజీ సౌండ్‌ సిస్టమ్‌లు, డప్పు వాయిద్యాల మధ్య ఆనందోత్సాహాలతో ఉత్సవ ఊరేగింపును ప్రారంభించారు. గణేశ్‌ ప్రతిమలు బయల్దేరిన వాహనాల ముందు నృత్యాలు చేస్తూ, ‘గణపతి బొప్పా మోరియా’ అనే నినాదాలు చేశారు. గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా నాలుగు ప్రాంతాల నుంచీ ర్యాలీలు మొదలయ్యాయి.

మొదటి ఊరేగింపు..

మొదటి ఊరేగింపు పాతనగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ వినాయకుడి ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఊరేగింపు వన్‌టౌన్‌, పూలబజార్‌, గడియారం ఆస్పత్రి, పెద్దమార్కెట్‌, కొండారెడ్డి బురుజు, రాజ్‌విహార్‌ మీదుగా కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌ వరకు కొనసాగింది. రెండో ఊరేగింపు నంద్యాల చెక్‌పోస్టు నుంచి ప్రారంభమై గాయత్రి ఎస్టేట్‌ మీదుగా వినాయక ఘాట్‌కు చేరుకుంది. బళ్లారి చౌరస్తా నుంచి కొత్తబస్టాండు, మౌర్యఇన్‌, రాజ్‌విహార్‌ మీదుగా మూడో ఊరేగింపు కొనసాగింది. కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌ నుంచి క్రిష్ణనగర్‌, గుత్తి పెట్రోల్‌ బంకు, గాయత్రి ఎస్టేట్‌ మీదుగా నాలుగో ఊరేగింపు ఘాట్‌కు చేరింది. రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ ఏడాది మూడు ఘాట్‌ల వద్ద మహిళా భక్తులు, విద్యార్థులు కూడా విగ్రహాల వాహనాలతోపాటు తరలివచ్చారు. నగరంలో సుమారు 2వేలకు పైగా గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చారు.

ప్రజలంతా సుఖ సంతోషాలతో..

మంత్రి టీజీ భరత్‌

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి టీజీ భరత్‌ అకాంక్షించారు. రాంబొట్ల దేవాలయం వద్ద గణేశ్‌ విగ్రహం నిమజ్జన ఊరేగింపు కార్యక్రమానికి పూజలు చేసి మంత్రి టీజీ భరత్‌ ప్రారం భించి మాట్లాడారు. గణేశ్‌ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు.

విఘ్నేశ్వరుడిని పూజించడం సంప్రదాయం

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఏశుభాకార్యాన్ని ప్రారంభించినా తొలుత విఘ్నేశ్వరుడిని పూజించడం మన సంప్రదాయం అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గణపతి ఆరాధనతో చేపట్టే ప్రతి కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం అవుతుందన్నారు.

మంచిని ప్రోత్సహించాలి : కలెక్టర్‌ ఏ. సిరి

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రజలందరూ చెడును వదిలి మంచిని ప్రోత్సహించాలని కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు. ఎటువంటి స్వార్ణ భావనలకు తావులేకుండ ప్రతి ఒక్కరూ సంతోషంగా, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.

ఆయురారోగ్యాలతో జీవించాలి: ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ప్రజలు, వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. గణనాథుల ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

రూ.4 లక్షలకు లడ్డూ

పాతనగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద నిర్వాహకులు పాడిన లడ్డూ వేలం పాటలో అత్యఽధిక ధర రూ.4లక్షలకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దక్కించుకున్నారు. ఆమె ఢిల్లీలో ఉన్న కారణంగా ఆమె తరపున వేలం పాటలో మంత్రి టీజీ భరత్‌ పాల్గొన్నారు. గత ఏడాది కూడా స్వామివారి లడ్డూను బైరెడ్డి శబరి వేలం పాడి దక్కించుకున్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:19 PM