టీడీపీ అధికార ప్రతినిధిగా బీవీ
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:59 PM
టీడీపీ అధికార ప్రతినిధిగా బీవీ
జోనల్ కో-ఆర్డినేటర్‌గా బీటీ
రాష్ట్ర ఉపాఽధ్యక్షులుగా డాక్టర్ సంజీవ్ కుమార్, ఆకెపోగు ప్రభాకర్
కార్య నిర్వహణ కార్యదర్శులుగా తుగ్గలి నాగేంద్ర, పి. తిక్కారెడ్డి, దేవేంద్రప్ప
కార్యదర్శులుగా జేమ్స్, పద్మలతారెడ్డి, వెంకటరాముడు ప్రమాణ స్వీకారం
కర్నూలు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీ రాష్ట్ర కమిటీలో కీలక పదవీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఎమ్మెల్సీ బీటీ నాయుడు జోనల్ కోఆర్డినేటరుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీటీ నాయుడు గతంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలను, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వర్తించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా నూతన కమిటీ కీలక బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సంజీవ్‌కుమార్, ఆకెపోగు ప్రభాకర్
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, కోడుమూరు మాజీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్ ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ముందు వైసీపీకి, ఎంపీ పదవికి సంజీవ్ కుమార్ రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అధినేత చంద్రబాబు పార్టీలో సముచిత స్థానం కల్పించారు. గత ఎన్నికల్లో కోడుమూరు(ఎస్సీ)ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆకెపోగు ప్రభాకర్‌కు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణల్లో భాగంగా చివరి క్షణంలో మంత్రాలయం టికెట్ త్యాగం చేసిన టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పి. తిక్కారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, ఏపీ కురవ/ కురబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అలాగే.. మాజీ కార్పొరేటర్ కె. పద్మలతారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ థరూర్ జేమ్స్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవళ్ల వెంకటరాముడు రాష్ట్ర కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా నాయకుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి టీడీపీ జిల్లా అఽధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, గౌరుచరిత, నియోజకవర్గం ఇన్‌చార్జీలు మాజీ ఎమ్మెల్యే కె. మీనాక్షినాయుడు, మాధవరం రాఘవేంద్రరెడ్డి, వైకుంఠంజ్యోతి తదితరులు హాజరయ్యారు. పార్టీ పదవి బాధ్యతులు చేపట్టిన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌లను జిల్లా నాయకులు కలిశారు.