అరకొరగా కంది కొనుగోలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:51 PM
తుగ్గలి మండలం రాంపల్లె గ్రామానికి చెందిన మహిళా లక్ష్మీదేవి తనకున్న ఎకరన్నర పొలంలో కంది పంటను సాగు చేసింది. 3 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చింది.
భారీగా కందులు కొంటామని మార్క్‌ఫెడ్ అధికారుల హామీ
క్వింటానికి రూ.8వేలు మద్దతు ధర ఇస్తామని గొప్పలు
ఇప్పటికి అరకొరగానే కొనుగోళ్లు
తేమ పేరుతో తిరస్కరణ
బయటి వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్న రైతులు
తుగ్గలి మండలం రాంపల్లె గ్రామానికి చెందిన మహిళా లక్ష్మీదేవి తనకున్న ఎకరన్నర పొలంలో కంది పంటను సాగు చేసింది. 3 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చింది. శనివారం రాంపల్లె నుంచి అష్టకష్టాలు పడి కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకువచ్చింది. ఉదయం 5 గంటల నుంచి చలిలో వ్యాపారుల కోసం మార్కెట్ యార్డులో వణుకుతూ ఎదురు చూసింది. తీరా వ్యాపారులు వచ్చి తేమ శాతం ఎక్కువగా ఉందని, క్వింటానికి రూ.6,500 కంటే ఎక్కువ ఇవ్వలేమని వెళ్లిపోయారు. పంట సాగు కోసం రూ.25వేలకు పైగానే ఖర్చు చేశానని, వ్యాపారులు చెప్పిన ధరతో పోలిస్తే ఇంకా అప్పు మిగులుతుందని కన్నీరు మున్నీరైంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు తదితర మార్కెట్ యార్డులో కందులను అమ్మకానికి తెస్తున్న వందలాది రైతులందరిదీ ఇదే పరిస్థితి..
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఈ నెల మొదటి తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో కందుల కొనుగోలు ప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రక టించారు. కర్నూలు జిల్లాలో 14,400 మెట్రిక్ టన్నులు, నంద్యాల జిల్లాలో 25,800 మెట్రిక్ టన్నులు కందులను రైతుల నుంచి కొనుగోలు చేస్తామని, క్వింటానికి రూ.8వేలు మద్దతు ధర అందిస్తామని చెప్పడంతో రైతులు ఆనందించారు. అయితే.. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొన లేదు. దీంతో కుటుంబ ఖర్చులు, అప్పులిచ్చిన వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక రైతులు కర్నూలు, ఆదోని, ఎమ్మిగ నూరుతో పాటు నంద్యాల జిల్లాలోని డోన్, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లోని వ్యాపారులకు క్వింటం రూ.6వేల నుంచి రూ.6,500కే అమ్ముకుంటున్నారు. రైతుల అవసరా లను ఆసరా చేసుకొని వ్యాపారులు క్వింటానికి 5 కిలోల కందులను తరుగు పేరుతో వెనకేసుకుంటున్నారు. మార్క్ ఫెడ్ అధికారులు డీసీఎంఎస్ పరిధిలో ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన 17 కొనుగోలు కేంద్రాల నుంచి కందులను రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా.. పది రోజులైనా ఇప్పటికీ కేవలం కర్నూలు జిల్లాలో హాలహర్వి, నంద్యాల జిల్లాలో డోన్, ప్యాపిలి, బేతంచెర్ల కేంద్రాల్లో రైతుల నుంచి అరకొరగా కొనుగోలు మొదలెట్టారు. మిగిలిన 14 కేంద్రాల్లో అదిగో ఇదిగో అంటున్న సమాధానమే రైతులకు వినిపి స్తుంది. ప్రతిరోజూ రైతులు డీసీఎంఎస్ కేంద్రాలకు వెళ్ల డం, అక్కడ వాయిదాలు చెప్పుతుండటంతో రైతులు పొలం పనులు మానేసి వారి చుట్టూ తిరగలేక పడుతు న్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
సంచులు లేక కొనుగోలు కేంద్రాలు ఖాళీ
ఉమ్మడి జిల్లాలో రైతుల నుంచి మద్దతు ధరకు కందులను కొనాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ ఫెడరేషన్ సంస్థ (ఎన్‌సీసీఎఫ్) మార్క్‌ఫెడ్ అధికారులకు గత నెలలోనే ఆదేశాలు పంపింది. రెండు జిల్లాల్లో 40వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు దాదాపు 5లక్షల గోనెసంచులు అవసరం అవుతాయి. ఇవి కలకత్తా నుంచి రావాల్సి ఉంది. కొనుగోళ్లు ప్రారంభించడానికి ముందే ఆయా కేంద్రాలకు ఈ గోనెసంచులను చేరవేసేందుకు అధికారులు ఏ మాత్రం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో గోనెసంచుల కొరత ఏర్పడి సిబ్బంది రైతుల నుంచి కందులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది మిగిలిపోయిన గోనెసంచులను అరకొరగా మార్క్‌ఫెడ్ అధికారులకు ఆయా కొనుగోలు కేంద్రాలకు సప్లయ్ చేశారు. అవి రెండు రోజులకే పూర్తి కావడంతో మిగిలిన పెద్దమొత్తంలో రైతుల వద్ద ఉన్న కందులను కొనుగోలు చేసేందుకు గోనెసంచులు ఎప్పుడు ఇస్తారంటూ మార్క్‌ఫెడ్ అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. గోనెసంచులు సరిపడా వస్తేనే కందుల కొనుగోలు మొదలు చేస్తామని, లేకపోతే రైతుల నుంచి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని డీసీఎంఎస్ కేంద్రాల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. మరో వైపు మార్క్‌ఫెడ్ అధికారులు కోల్‌కత్తా నుంచి గోనెసంచులు త్వరలోనే వస్తున్నాయని, సంక్రాంతి పండుగ తర్వాత పూర్తి స్థాయిలో రైతుల నుంచి కందుల కొనుగోలు చేపడుతామని చెబుతున్నారు. రైతులు మాత్రం వీరి మాటలు నమ్మలేకపోతున్నారు.
తేమ సాకుతో ధరలో కోత పెడుతున్న వ్యాపారులు
చలి తీవ్రత వల్ల మార్కెట్ యార్డుకు రైతులు తెస్తున్న పంట ఉత్పత్తుల్లో తేమ తగ్గడం లేదు. పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు ఎండ కాయడం లేదు. రైతుల ఆర్థిక అవసరాలు చుట్టుముట్టడంతో మరోదారి లేక తేమ ఉన్నా అమ్ముకోడానికి కందులను కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు తదితర మార్కెట్ యార్డుల్లోకి తీసుకువస్తున్నారు. రైతుల అవసరాలను తమకు అవకాశంగా మరల్చుకుంటున్నారు. శుక్రవారం కర్నూలు మార్కెట్ యార్డులో రైతులు, వ్యాపారుల మధ్య పెద్ద గొడవ జరిగింది. సాధారణంగా 12 శాతం తేమ ఉంటేనే క్వింటం కందులకు రూ.7వేల నుంచి రూ.7,500 ధర అందిస్తున్న వ్యాపారులు 18 శాతానికి మించి తేమ ఉందంటూ వ్యాపారులు రైతులను నిండా ముంచేందుకు చర్యలు తీసుకుంటుండటంతో రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. క్వింటానికి రూ.6వేల నుంచి రూ.6,500 మాత్రమే అందిస్తున్నారని, ప్రభుత్వం మాత్రం గిట్టుబాటు ధర రూ.8వేలకు నిర్ణయించినా తమకు రూ.1,500 నష్టం వస్తున్నదని, వ్యాపారులతో అధికారులు చేతులు కలపడం వల్లే తమకు మద్దతు ధర అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
గోనెసంచులు తెప్పిస్తున్నాం
కంది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పండుగ తర్వాత పూర్తి స్థాయిలో రైతుల నుంచి కందులను కొంటాం. డీసీఎంఎస్ సంస్థ ఆధ్వర్యంలోని ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసే 17 కొనుగోలు కేంద్రాల ద్వారా అన్ని మండలాల్లో రైతులు తెచ్చిన కందులను కొంటాము. కోల్‌కత్తా నుంచి రైతులకు అవసరమైన గోనెసంచులను తెప్పిస్తున్నాం.
- రాజు, మార్క్‌ఫెడ్ మేనేజర్
అప్పులపాలయ్యాను
శనివారం తుగ్గలి మండలం నుంచి రాంపల్లి నుంచి ఐదుగురు రైతులతో కలిసి ఒకే వాహనంలో కందులను తీసుకువచ్చాం. నాకు నాలుగెకరాల పొలం ఉంది. ఎకరాకు 2 క్వింటాళ్ల ప్రకారం 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే చేతికందింది. దాదాపు రూ.50వేల దాకా ఖర్చు వచ్చింది. వ్యాపారులు ఇచ్చిన ధరతో పోలిస్తే ఇంకా రూ.20వేల అప్పు మిగిలింది.
- లక్ష్మమ్మ, రాంపల్లి