బడుల్లో సందడి
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:26 PM
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్(పీటీఎం)లో ఎటుచూసినా సందడి నెలకొంది.
విద్యార్థులు, తల్లిదండ్రులతో
కళకళలాడిన స్కూళ్లు, కాలేజీలు
జిల్లా వ్యాప్తంగా ఘనంగా మెగా పీటీఎం
ప్రత్యేక వంటలతో ‘మధ్యాహ్న భోజనం’
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్(పీటీఎం)లో ఎటుచూసినా సందడి నెలకొంది. ఉదయం నుంచే ప్రభుత్వ, ఎయిడెడ్, జూనియర్ కళాశాలలకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పెద్దఎత్తున తరలిరావడంతో విద్యాసంస్థలు కళకళలాడాయి. తరగతి గదులు, ప్రాంగణాలు సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు బంద్ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు చేపట్టారు. ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
విద్యా సంక్షేమ పథకాలపై అవగాహన
ప్రభుత్వం పాఠశాలలకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలతో పాటు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థుల చదువు, హాజరు శాతం, ప్రవర్తన, పరీక్షల ఫలితాలపై తల్లిదండ్రులకు సమగ్రంగా వివరిం చారు. ప్రోగ్రెస్, హెల్త్‌కార్డులను అందజేస్తూ విద్యార్థుల బలబాలాలు, బలహీనతలను వివరించి ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలను నిర్వహించారు.
ప్రత్యేక వంటకాలు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా శుక్రవారం అందిస్తున్న మెనూతో పాటు అనేక పాఠశాలల్లో దాతల సహకారంతో ప్రత్యేక వంటలతో గుమ గుమలాడించారు. తెల్లఅన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డుకూర, స్థానికంగా లభ్యమయ్యే కూరగాయలతో వెజిటబుల్ కూర. మిల్లెట్స్ చిక్కి మెనూలో ఉండగా అనేక పాఠశాలలో వాటితో పాటు పాయసం, చికెన్ కర్రీ వడ్డించారు.
విద్యలో విప్లవాత్మక మార్పులు
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, జూలై 24 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యలో విప్లవాత్మక మైన మార్పులు వచ్చాయని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బనగానపల్లె పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం (పేరెంట్ టీచర్స్ మీట్)ను నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి మంత్రి బీసీ ముఖ్యఅతిథిగా హాజర య్యారు. విద్యార్థులు తయారు చేసిన నమూ నాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామ న్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపి చిన్నారులకు మంత్రి నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు. విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
గోస్పాడు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తోందని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. శుక్రవారం మెగా పెరేంట్స్ డే సందర్భంగా దీబగుంట్ల జడ్పీహెచ్‌ఎస్ స్కూల్‌లో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని మౌలిక వసతులను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తుందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్ధ్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలని అన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే నినాదంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేసుకోవాలని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ విద్యారంగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా బలమైన పునాదులు వేయిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించాయని అన్నారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి : కలెక్టర్
నందికొట్కూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం నందికొ ట్కూరులోని జడ్పీ హైస్కూల్ ప్లస్ బాలికల పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌కు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయులు భాగస్వా మ్యం అత్యంత కీలకమన్నారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. సమాజంలో బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి బాలికను కనీసం డిగ్రీ పూర్తయ్యే వరకు చదివించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ రాజకుమారి విజ్ఞప్తిచేశారు.కలెక్టర్ రాజకుమారి ప్లేట్ తీసుకొని విద్యార్థులతో కలిసి లైన్‌లో నిలబడి అన్నం వడ్డించుకున్నారు.