Share News

బంకులు.. బారులు..!

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:14 PM

పెట్రోల్‌, డీజిల్‌ సెగ జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

బంకులు.. బారులు..!
గుత్తి పెట్రోల్‌ బంకు దగ్గర రద్దీ

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత

ఎటు చూసినా నో స్టాక్‌ బోర్డులు

పెట్రోల్‌ బంకుల వద్ద వాహనాల రద్దీ

ఆందోళన చెందుతున్న వాహనదారులు

యథేచ్ఛగా ‘బ్లాక్‌’ దందా

చేతులెత్తేసిన జిల్లా అధికారులు

పెట్రోల్‌, డీజిల్‌ సెగ జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంధనం కొరత అంటూ వస్తున్న వార్తలతో వాహనదారులు పెట్రోల్‌ బంకులకు పరుగులు తీస్తున్నారు. ఓ వైపు జిల్లాలో ఎక్కడా పెట్రోల్‌ కొరత లేదని అధికారులు ప్రకటనలు గుప్పిస్తు న్నారు. మరో వైపు ఎక్కడకు వెళ్లినా పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. అధికారులు ఏసీ గదుల్లో కూర్చొని చేసే ప్రకటనలకు, ప్రజలు ఎండల్లో పెట్రోల్‌ కోసం పడే పాట్లకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం పెట్రోల్‌ కోసం గంటల తరబడి మండు టెండల్లో క్యూలో ఆపసోపాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. సమస్యను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాల్సిన సంబంధిత అధికారులు కనీసం క్షేత్రస్థాయిలో కూడా పర్యటన చేయక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు బారులుతీరి కనిపిస్తున్నారు. శుక్రవారం కర్నూలు నగరంలో ఏ బంకు వద్ద చూసిన వందలాది వాహనాలు కనిపిం చాయి. బాటిళ్లను చేతపట్టుకుని క్యూలో ప్రజలు నిల్చున్నారు. బ్లాక్‌ మార్కెట్‌కు ఇంధనం యథేచ్ఛగా తరలిపోతున్నా సివిల్‌ సప్లైస్‌ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. పెట్రోల్‌ లేదంటూ కొరతను సాకుగా చూపుతూ కొందరు పెట్రోల్‌ బంకుల యజమానులు బ్లాక్‌ మార్కెట్‌కు పెట్రోల్‌ను క్యాన్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

కర్నూలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం, చమురు, సహజ వాయువుల కొరత వార్తల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాహనదారులు సైతం అవసరం ఉన్నా, లేకపోయినా డీజిల్‌, పెట్రోల్‌ ట్యాంక్‌ నిండా నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఏరోజుకు ఆ రోజు ఇంధనం నింపుకునే వాహన డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు, సామాన్య ప్రజలు కూడా ఎంతో కొంత అదనంగా ట్యాంకు నింపుకోవాలని చూస్తున్నారు. ఈ కారణంతో పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలు అమాంతంగా పెరిగిపోయాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఐవోసీ 51, బీపీసీఎల్‌ 32, హెచ్‌పీసీఎల్‌ 62, నయారా 21 పెట్రోల్‌, డీజిల్‌ బంకులు ఉన్నాయి. దాదాపు అన్నింటా శుక్రవారం ఉదయం నుంచే నోస్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రతి పెట్రోల్‌ బంకుల వద్ద టూ, త్రీ ఫోర్‌ వీలర్స్‌ పెట్రోల్‌ డీజిల్‌ కోసం వాహనదారులు ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారు. కొందరు వాహనదారులు ఇంధనం అయిపోతుందని ముందస్తుగా చిన్న చిన్న ట్యాంకులలో పెట్రోల్‌, డీజిల్‌ను నింపుకుంటున్నారు. స్టాక్‌ ఉన్న చోట గంటల తరబడి వాహనదారులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్‌, డీజిల్‌ ఉన్నా కూడా పెట్రోల్‌ బంకుల యజమానులు కృత్రిమ కొరతను సృష్టించడంతో సమస్య తారస్థాయికి చేరుకుంది. ప్రతి పెట్రోల్‌ బంకు యాజమాన్యాలు ముందస్తులో భాగంగా సరిపడే పెట్రోల్‌, డీజిల్‌ కోసం గతంలో క్రెడిట్‌ సౌకర్యాన్ని ఆయిల్‌ కంపెనీలు రద్దు చేసి అడ్వాన్స్‌ పేమెంట్‌ పద్ధతిని అమలు చేస్తున్నాయి. అలా ముందస్తు నగదును చెల్లించకపోవడంతో ఇంధనం కొరత ఏర్పడినట్లు సమాచారం. పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాలు ఆయిల్‌ కంపెనీలకు నగదు చెల్లించకపోవడంతో ఇంధనం కొరత ఏర్పడిందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో అయితే జిల్లా స్థాయి అధికారులు చేతులెత్తేశారు. కనీసం డీఎస్‌ఓ క్షేత్రస్థాయిలో కూడా పర్యటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే అదనుగా ‘బ్లాక్‌’ దందా..!

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు పెట్రోల్‌ బంకుల యజమానులు సిండికేట్‌ అయినట్లు తెలుస్తోంది. పెట్రోల్‌ ట్యాంక్‌ వచ్చీ రాగానే పెట్రోల్‌ స్టాక్‌ అయిపోయిందంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. కానీ కొందరు ఆటోల్లో వచ్చి క్యాన్లలో నింపుకుని పోతున్నారు. ఒక్కో క్యాన్‌ 50 నుంచి 100 లీటర్ల సామర్థ్యం ఉంటుంది. ఇలా దాదాపు 10 క్యాన్ల దాకా ఒక్కో ఆటోలో తరలించుకుపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వీటిని బంకుల్లో కాకుండా వీధుల్లో, గ్రామాల్లో లూజ్‌ విక్రయాలు చేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 110 ఉండగా అదనంగా రూ.50 నుంచి రూ.100 పైగా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఇక వాహనదారులు చేసేది లేక రెట్టింపు సొమ్ము చెల్లించి బ్లాక్‌లోనే పెట్రోల్‌ను కొనుగోలు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు శుక్రవారం రోజు ఎక్కడా పర్యటించకపోవడం, బ్లాక్‌ మార్కెట్‌ నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

పెట్రోల్‌ బంకు వద్ద ఘర్షణ

ఒకరికి తీవ్ర గాయాలు

నంద్యాల రూరల్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌ బంకుల వద్ద రద్దీ ఘర్షణలకు దారి తీస్తోంది. అసలే పెట్రోలు కొరత ఆపై ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వాహనదారులు సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో బంకుల వద్ద గొడవలు చోటు చేసుకుంటున్నాయి. పాణ్యం మండలంలోని వరుణ్‌ ఫ్యూయల్‌ స్టేషన్‌ వద్ద శుక్రవారం జరిగిన ఘర్షణలో తెలుగు మధు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం రాత్రి పాణ్యం పెట్రోల్‌ బంకు వద్దకు పాణ్యం పట్టణానికి చెందిన తెలుగు మధు తన ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లాడు. అదే సమయంలో కొండజూటూరుకు చెందిన సద్దల సూర్యనారాయణ రెడ్డి కుమారుడు సుజిత్‌ అలియాస్‌ బిట్టు పెట్రోలు కోసం తన వాహనాన్ని క్యూలో కాకుండా ముందుకు తీసుకెళ్లాడు. క్యూలో రావాలంటూ తెలుగు మధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నేనెవరో తెలుసా? సూర్యనారాయణ రెడ్డి కొడుకుని..’ అంటూ సుజిత్‌ ప్రతిగా స్పందించాడు. దీంతో మాటామాటా పెరిగి మధు, సుజిత్‌ గొడవ పడ్డారు. సుజిత్‌ తన స్నేహితులైన ఎరుకల గణేష్‌, ఎరుకల సురేంద్ర, అక్బర్‌లను పిలిపించి మధుపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మధు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయన్ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పాణ్యం ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ రెడ్డి తెలిపారు.

పెట్రోల్‌ బంకులను సీజ్‌ చేస్తాం

జిల్లాలో సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ ఉంది. కొందరు పెట్రోల్‌, డీజిల్‌ యాజమాన్యాలు ఇంధనం కొరతను సృష్టిస్తున్నాయి. ప్రతి పెట్రోల్‌ బంకులను తనిఖీ చేయడం జరుగుతుంది. పెట్రోల్‌ బంకుల్లో మౌలిక సదుపాయాలు ఉండాలి. స్టాక్‌ పెట్టుకుని నోస్టాక్‌ బోర్డు పెడితే పెట్రోల్‌ బంకులను సీజ్‌ చేయడం జరుగుతుంది.

-నూరుల్‌ ఖమర్‌, జాయింట్‌ కలెక్టర్‌

పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌కు కొరత లేదు. పెట్రోల్‌ బంకుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌లను చిన్న చిన్న ట్యాంకులలో నింపుకుని బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మితే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత పెట్రోల్‌ బంకులు కూడా సీజ్‌ చేయడం జరుగుతుంది.

రాజా రఘువీర్‌, డీఎ్‌సవో, కర్నూలు

ఇవాళ ఆటో బంద్‌ చేశా..

మాది పాణ్యం మండలం గోరుకల్లు గ్రామం. నేను ఆటో నడిపి జీవనం గడుపుతున్నాను. రెండు రోజులుగా డీజిల్‌ దొరకడం లేదు. చేసేదేమీ లేక ఆటోను ఇంటి వద్దే ఉంచాను. ఆటో నడిపితేనే సంసారం గడుస్తుంది. ఇలాగే కొరత ఉంటే బతకడానికి కూడా కష్టం అవుతుంది. సమస్యను కలెక్టర్‌ స్థాయి అధికారులు గుర్తించి పరిష్కరించాలి.

- నాగేంద్ర, ఆటోడ్రైవర్‌, పాణ్యం

ఆరు బంకులు తిరిగా..

మాది బండిఆత్మకూరు మండలంలోని ఎ.కోడూరు గ్రామం. నేను మా అన్న పెళ్లి పనుల నిమిత్తం నంద్యాలకు వచ్చాను. నా బైక్‌లో పెట్రోల్‌ అయిపోయింది. బైక్‌ తోసుకుంటూ ఆరు బంకులు తిరిగా. పెట్రోల్‌ అడిగినా ఎక్కడా లేదన్నారు. తెలిసిన వారి ఇంటి వద్ద బైక్‌ను ఉంచి బస్సుకు వెళ్తున్నా. అధికారులేమో కొరత లేదంటున్నారు. బంకుల్లోనేమో పెట్రోలు లేదంటున్నారు. ఏమీ అర్థం కావడం లేదు.

- సాయి, బండి ఆత్మకూరు.

డీజిల్‌ దొరకడం లేదు

డీజిల్‌ కోసం ఇబ్బందులు పడుతున్నాం. పెట్రోలు బంకు వద్ద లారీని క్యూలో పెట్టా. పెట్రోల్‌తో పాటు డీజిల్‌ కూడా రావడం లేదు. వచ్చిన స్టాక్‌ వచ్చినట్టు అయిపోతోంది. లారీకి డీజిల్‌ నింపుకుంటేనే పనులకు వెళ్లగలం.

- కరీంషా, లారీ డ్రైవరు, రుద్రవరం

Updated Date - Apr 24 , 2026 | 11:14 PM