Share News

కర్నూలు మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:07 AM

కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్‌ ఆదివారం కేంద్ర బడ్జెట్‌-2026-27 లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

కర్నూలు మీదుగా  బుల్లెట్‌ ట్రైన్‌

కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్‌ ఆదివారం కేంద్ర బడ్జెట్‌-2026-27 లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని అన్ని వర్గాలకు సంక్షేమ.. ప్రగతి ఫలాలు అందేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్‌ కారిడార్లు ప్రకటించారు. హైదరాబాద్‌ - బెంగళూరు వయా కర్నూలు అందులో ఒకటి. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలను కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్‌ పరుగు పెట్టనుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. వేగవంతమైన రైలు రవాణా సౌకర్యం వల్ల ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ పార్కులో పరిశ్రమలు ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడం చూస్తే.. ఎమ్మిగనూరు మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు మంచి రోజులు వచ్చాయని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎమ్మిగనూరు చేనేతకు అంతర్జాతీయ బ్రాండింగ్‌ వచ్చే అవకాశాలున్నాయి. ఆదాయన పన్ను పాత స్లాబులతో సరిపుచ్చడంతో వేతన జీవులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీయే పార్టీ నాయకులు ఇది సామాన్యుల బడ్జెట్‌ని కొనియాడితే.. ప్రతిపక్షలు మాత్రం పస లేని బడ్జెట్‌ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

- కర్నూలు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ప్రజల్లో ఆనందం

కేంద్ర బడ్జెట్‌-2026-27లో ఏడు హైస్పీడ్‌ రైలు కారిడార్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అందులో ఒకటి హైదరాబాద్‌- బెంగళూరు రైలు కారిడార్‌ ఒకటి. దాదాపు 622 కిలో మీటర్ల పొడవుతో నిర్మించే ఈ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌కు రైల్వే బోర్డు ప్రాథమిక ఆమోదం తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, డోన్‌, అనంతపురం జిల్లాలో గుత్తి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో దుద్దేబండ, హిందుపురం మీదుగా హైస్పీడ్‌ రైల్వే లైన్‌, రైల్వే స్టేషన్లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 263.3 కిలోమీటర్లు, తెలంగాణలో 218.5 కిలో మీటర్లు, కర్ణాటకలో 94.80 కిలోమీటర్లు హైస్పీడ్‌ రైలు మార్గం నిర్మిస్తారు. డబుల్‌ లైన్‌, లూప్‌లైన్స్‌, సైడింగ్‌లు కలిపి మొత్తం 1,363 కిలోమీటర్లు రైలు మార్గం నిర్మాణం కోసం రైల్వే కన్సల్టెన్సీ అయిన ‘రైట్స్‌ లిమిటెడ్‌ సంస్థ’ దాదాపుగా సర్వే పూర్తి చేసింది. ఈ కారిడార్‌ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌-బెంగళూరు వయా కర్నూలు మధ్య బుల్లెట్‌ ట్రైన్లు వేగంగా దూసుకుపోనున్నాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు రెండు గంటల్లో చేరుకోవచ్చు అంటున్నారు. కర్నూలు నగరం నుంచి ఇటు హైదరాబాద్‌కు వెళ్లినా, అటు బెంగళూరుకు వెళ్లినా గంటలోపే గమ్యం చేరుకునే అవకాశం ఉందని, ఇది రైల్వే ప్రయాణికులు శుభవార్త అని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. వేగవంతమైన రైలు రవాణా సౌకర్యం ఏర్పడడం వల్ల ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. హైస్పీడ్‌ రైలు మార్గం ఓర్వకల్లును కలుపుతూ నిర్మాణం చేయాలని పలువురు కోరుతున్నారు

మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు మహర్దశ

చేనేత రంగం అభివృద్ధిని కాంక్షిస్తూ మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు ఐదు సూత్రాలతో ప్రత్యేక కార్యచరణను ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటించారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఎమ్మిగనూరు మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు మంచి రోజులు వచ్చినట్లే అని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. బనవాసి వద్ద ఏర్పాటు చేసే ఈ పార్కుకు పశు సంవర్ధక శాఖ పర్యవేక్షనలోని బనవాసి జెర్సీ పశు క్షేత్రానికి చెందిన సర్వే నంబర్లు 343, 344/2 పరిధిలో 77.37 ఎకరాలు భూమిని కేటాయిస్తూ గత నెల 28న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పార్కును కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ‘ప్లగ్‌ అండ్‌ పథకం’కు అనుసంధానం చేయన్నుట్లు మంత్రివర్గం పేర్కొంది. ఐదు రోజుల్లోనే నిర్మలమ్మ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌-2026-27లో మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు ప్రత్యేక కార్యక్రమంలో చేయపట్టనున్నట్లు ప్రకటిచారు. అంతేకాకుండా చేనేత, జౌళి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్‌ కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అదే జరిగితే ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు (జీఐ ట్యాగ్‌) కోసం హైదరాబాద్‌కు చెందిన రిజల్యూట్‌ బీ2బీ సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదిక పంపించింది.

వేతన జీవులకు నిరాశ

కేంద్ర బడ్జెట్‌ అనగానే ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు, పన్ను చెల్లింపుల్లో రాయతీలు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తారు. అయితే.. ఈ బడ్జెట్‌లో కొత్తగా పన్ను మినహాయింపులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించకపోవడంతో వేతన జీవులకు నిరాశ ఎదురైంది. అయితే.. ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2 ఫైలింగ్‌కు జూలై 31 వరకు గడువు ఇవ్వడం కొంత ఊరట కలగిలించింది.రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు తగ్గునున్నాయని తెలిసి సామాన్యుల్లో బం గారం ఆశలు చిగురిస్తున్నాయి. ప్రజలు నిత్యం వాడే పలురకాల వస్తువుల ధరలు తగ్గునుండడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ప్రగతి - సంక్షేమ బడ్జెట్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌-2026-27 ప్రగతి-సంక్షేమాలను సమపాళ్లలో తీసుకువెళ్లేలా ఉంది. సామాన్య ప్రజలు, రైతులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన గొప్ప బడ్జెట్‌ ఇది. హైదరాబాద్‌-బెంగళూరు వయా కర్నూలు, డోన్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ వల్ల కరువు ప్రాంతం ప్రగతి బుల్లెట్‌ ట్రైన్‌లా దూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు ప్రత్యేక కార్యక్రమం ప్రకటించడంతో మన జిల్లాలో ఎమ్మిగనూరు టెక్స్‌టైల్‌ పార్కు వేగంగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయి. మహిళలు, యువత, రైతులు సాధికారిత బడ్జెట్‌ ఇది. ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధికి ఈ బడ్జెట్‌ ఊతం ఇచ్చేలా ఉంది.

గుడిసె కృష్ణమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, కర్నూలు

దేశాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన

దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూపకల్పన చేశారు. సంస్కరణలకు పెద్దపీఠ వేశారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా పలు పథకాలు తీసుకొచ్చారు. ఉపాధి కల్పన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. హైస్పీడ్‌ రైలు కారిడార్‌ వల్ల కరువుతో తల్లడిల్లే మన ప్రాంతం అభివృద్ధికి బలమైన పునాది వేసినట్లు అయ్యింది.

అక్కమతోట రామకృష్ణ, బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు

సామాన్యులకు నిరాశ

కార్పొరేట్‌ శక్తులు, సంపన్నుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది. సామాన్యులు, రైతులు, కార్మికవర్గాలకు తీవ్ర నిరాశపరిచింది. ముఖ్యంగా వెనుకబడి రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీ తారామన్‌ మొండిచేయి చూపించారు. నూతన పరిశ్రమలు, యువత ఉపాధి కల్పనకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు లేవు. వ్యవసాయ రంగానికి ఐదు శాతం కూడా నిధులు ఇవ్వకపోవడం రైతుల పట్ల ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏపాటితో తెలుస్తోంది.

బి.గిడ్డయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు

అంకెల గారడీ బడ్జెట్‌

నిర్దిష్టమైన అభివృద్ధికి నిధులు కేటాయింపులు లేని అంకెల గారడి బడ్జెట్‌ ఇది. రాష్ట్ర విడిపోయి 12 ఏళ్లు అయినా విభజన హామీలు అమలుకు బడ్జెట్‌లో నిధులు ఇవ్వలేదు. రాయలసీమ అభివృద్ధి, రాజధాని, సాగునీటి ప్రాజెక్టులన పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రాబోయే కాలంలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్‌లో ప్రత్యేక ఫోకస్‌ పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

గౌస్‌ దేశాయి, సీపీఎం జిల్లా కార్యదర్శి, కర్నూలు

యూజీ, పీజీ సీట్లపై స్పష్టత లేదు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ ప్రకటించిన బడ్జెట్‌ చేస్తే నిరు త్సాకరంగా ఉంది. జిల్లాలో విద్య, వైద్య రంగాల్లో కీలకమైన ట్రిపుల్‌ ఐటీడీఎం, స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. యూజీ, వైద్య పీజీ సీట్లు పెరుగుదల, నిధులు కేటాయింపుల్లో స్పష్టత లేదు. ఖేల్‌ ఇండియా పథకంలో కర్నూలు జిల్లాకు వనరుల కేటాయింపు చూపలేదు. కర్నూలు స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి అవసరమైన నిధుల ఊసే లేదు.

- మన్సూర్‌ రహమాన్‌, ప్రొఫెసర్‌, ఆర్థికవేత్త, మానవశక్తి పరిశోధన కేంద్రం, కర్నూలు

Updated Date - Feb 02 , 2026 | 12:07 AM