ప్రమాదకరంగా వంతెనలు
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:37 PM
జిల్లాలో రహదారి వంతెనలు ప్రమాదకరంగా మారుతున్నాయి.
జిల్లాలో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జీలు
ఎప్పుడు కూలుతాయో తెలియని దైన్య స్థితి
బ్రిడ్జీలు దాటాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిందే
జిల్లాలో రహదారి వంతెనలు ప్రమాదకరంగా మారుతున్నాయి. కాళ్ల కింద వంతెన ఎప్పుడు కూలుతుందో..? అనే భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. పాలకుల ఉదాసీనత.. సకాలంలో నిధులివ్వకపోవడం వల్లే అనేక వంతెనలు అధ్వానంగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు వంతెనలు దాటడానికి భయపడుతున్నారు. ప్రమాదాలు పొంచి ఉన్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు..? ప్రజల ప్రాణాలంటే అంత చులకనా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో అత్యంత ప్రమాదకరంగా ఆరు, ప్రమాదకరంగా 9 వంతెనలను రహదారులు, భవనాలు శాఖ ఇంజనీర్లు గుర్తించారు. వాటి శాశ్వత మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం రూ.21.27 కోట్లు నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో అధ్వానంగా మారిన రహదారి వంతెనలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో 3,400.028 కిలో మీటర్ల రహదారులు ఉన్నాయి. అందులో తారు (బీటీ) రోడ్లు 3,043.322 కి.మీ.లు, సీసీ రోడ్లు 273.608 కి.మీలు, కంకర రోడ్లు 11.056 కి.మీలు, మట్టి రోడ్లు 71.142 కి.మీ.లు ఉన్నాయి. ఆయా రహదారుల్లో 150కి పైగా భారీ, మధ్యతరహా వంతెనలు ఉన్నాయి. ఇవి కాదని పలు గ్రామాల్లో వంకలు, వాగులను దాటేందుకు చిన్నతరహా వంతెనలు, స్లాబ్ కల్వర్టులు ఉన్నాయి. వీటి నిర్వహణ, మరమ్మతుల్లో రోడ్లు భవనాలు శాఖ ఘోర వైఫల్యం చెందిందనే ఆరోపణలు మూటగట్టుకుంది. గత కొన్నేళ్లుగా కీలకకమైన రహదారి వంతెనల మరమ్మతులకు ప్రభుత్వాలు నిధులు ఇవ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది. గత వైసీపీ హయాంలో ఐదేళ్లు పైసా నిధులు కూడా ఇవ్వకపోవడం శాపంగా మారింది. మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో కీలకమైన రహదారి బ్రిడ్జీలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వంతెనలు కూలిపోవడంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. కోడుమూరు మండలం గోరంట్ల వద్ద హంద్రీ నదిపై నిర్మాణం చేపట్టిన వంతెన నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగా ఆగిపోయింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో అధ్వానంగా మారిన రహదారి వంతెనలు తక్షణ మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఆ వంతెనలు అత్యంత ప్రమాదకరం
రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో దాదాపుగా 150కి పైగా భారీ, మధ్యతరహా వంతెనలు ఉన్నాయి. వాటిలో ఆరు అత్యంత ప్రమాదకరంగా, మరో తొమ్మిది వంతెనలు ప్రమాదకరం (పాక్షికంగా)గా ఉన్నట్లు గుర్తించారు. వాటి శాశ్వత మరమ్మతుల కోసం రూ.21.27 కోట్లతో ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఏళ్లు గడస్తున్నా నిధులు మాత్రం మంజూరు చేయడం లేదు. అత్యంత ప్రమాదకరంగా మారిన వంతెనలపై తాత్కాలికంగా ఎర్రమట్టి వేసి ప్రమాదాల మధ్య ప్రయాణం సాగిస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న వంతెనలు పునర్నిర్మించాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వంతెనల మరమ్మతుల గురించి పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గుంతలు రోడ్లు మరమ్మతులు, రహదారి ప్యాచ్ వర్క్‌లు చేసింది. శిథిలమైన వంతెనల మరమ్మతులు, పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
దెబ్బతిన్న టీబీపీ ఎల్లెల్సీ కాలువ బ్రిడ్జీలు
హాలహర్వి మండలం చింతకుంట నుంచి కర్నూలు మండలం ఉల్చాల వరకు, అక్కడి నుంచి కల్లూరు వరకు కేబీసీ కాలువ ప్రవహిస్తుంది. ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో పలు గ్రామాల ప్రజలు ఎల్లెల్సీ కాలువ దాటడానికి దాదాపు 35కి పైగా కాలువపై వంతెనలు నిర్మించారు. వీటిని 1957-59 మధ్యలో నిర్మించారు. హాలహర్వి, హొళగుంద, మదిరె, ఆనవాళ్లు, బదినేహాల్, కామవారం, పెద్దతుంబళం, పెద్దకడుబూరు, మల్కాపురం, కోటేకల్లు, గుడేకల్లు గ్రామాల సమీపంలో ఉన్న ఎల్లెల్సీ కాలువ వంతెనలు ప్రమాదకరంగా మారాయి. సిమెంట్ కాంక్రీట్ ఊడిపోయి ఇనుప కడ్డీలు తేలాయి. తాత్కాలిక మరమ్మతులతో సరిపుచ్చుతున్నారే తప్ప శాశ్వత మరమ్మతులు చేపట్టడం లేదు.
తుగ్గలి మండలం గిరిగట్ల-చెన్నంపల్లి రహదారి 0/6 కిలోమీటరు వద్ద ఉన్న వంకకు రెండు వెంట్లు, 21 మీటర్ల పొడవుతో నిర్మించిన వంతెన వరదకు కుప్పకూలింది. దానిపై మట్టివేసి తాత్కాలికంగా రాకపోకలు సాగిస్తున్నారు. శాశ్వత మరమ్మతుల కోసం రూ.1.80 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.
మద్దికెర-పత్తికొండ ప్రధాన రహదారి 10/8 కి.మీ.లు వద్ద వాగుకు 1971లో వంతెన నిర్మించారు. 2021లో వర్షాలకు కుప్పకూలింది. రూ.2.62 కోట్లు మంజూరు చేసినా పనులు చేపట్టలేదు. దానికిపై ఎర్రిమట్టి వేసి రాకపోకలు సాగిస్తున్నారు.
గుంతకల్లు-తుంగభద్ర ప్రధాన రహదారి 25/10 కి.మీ.ల వద్ద ఉన్న 1981లో తొమ్మిది వెంట్లతో వంతెన నిర్మించారు. ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని అత్యంత ప్రమాదకరంగా మారింది. వర్షాకాలంలో వంతెనపై వరద ఉప్పొంగుతుంది. రాళ్లతో నిర్మించిన ఈ వంతెన స్థానంలో హైలెవల్ బిడ్జిని పునర్మిర్మాణం చేయాల్సి ఉంది.
కౌతాళం మండలం నదిచాగి-హాల్వి రోడ్డులో 6/6 కి.మీ.ల వద్ద 1999లో నిర్మించిన వంతెన వరద ఉద్రుతికి కొట్టుకుపోయింది. భారీ వంతెన నిర్మించాల్సి ఉంది. రూ.80 లక్షలతో ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు.
హలహర్వి - గూళ్యం ప్రధాన రోడ్డులో బాపురం దగ్గర 3/4 కి.మీల వద్ద టీబీపీ ఎల్లెల్సీ కాలువపై 1981లో 4.8 మీటర్ల వెడల్పుతో నాలుగు వెంట్లతో నిర్మించిన వంతెన నిథిలావస్థకు చేరుకుంది. దీనిని పునర్నిర్మించాలని రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఆరేడు గ్రామాలకు ప్రధాన వంతెన ఇది.
కౌతాళం మండలం కుప్పగల్ - హాల్వి వయా ఉరకుంద రోడ్డు కామావరం గ్రామం చెంతనే ఎల్లెల్సీ కాలువపై 8 మీటర్ల వెడల్పుతో రెండు వెంట్స్‌తో 1982లో వంతెన నిర్మించారు. ఇది పూర్తిగా అధ్వాన్నంగా మారింది. 15-20 గ్రామాల ప్రజలు, ఉరుకుంద లక్ష్మీనరసింహాస్వామి (ఉరుకుంద ఈరన్నస్వామి) క్షేత్రానికి వెళ్లే వేలాది మంది భక్తులు ఈ వంతెన దాటి వెళ్లాల్సిందే. భారీ వెంతన నిర్మాణం కోసం రూ.1.80 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.
వీటితో పాటు పాక్షికంగా ప్రమాదరకంగా ఉన్న మరో 9 వంతెనల మరమ్మతుల కోసం రూ.7.25 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.
నిధులు లేక ఆగిపోయిన వంతెన పనులు:
కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం సమీపంలో హంద్రీనదిపై గోరంట్ల-ఎర్రగుడి మధ్య రూ.21 కోట్లతో హైలెవల్ బిడ్జి నిర్మాణం చేపట్టారు. కోడుమూరు, కృష్ణగిరి, డోన్ మండలాల్లో దాదాపు 12 గ్రామాలకు కీలకమైన వంతెన ఇది. గత వైసీపీ హయాంలో పిల్లర్లతో ఆగిపోయింది. నాడు వైసీపీ ప్రభుత్వం, నేడు కూటమి ప్రభుత్వం పట్టించుకుపోవడంతో అలంకారప్రాయంగా మారింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే చేతులెత్తేశాడు. నిఽధులు మంజూరు చేసి అసంపూర్తి పనులను పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం
జిల్లాలో అత్యంత ప్రమాదకరంగా మారిన వంతెనలు ఆరు వంతెనలు, పాక్షికంగా ప్రమాదకరమైన వంతెనలు తొమ్మిది గుర్తించాం. శాశ్వత మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం రూ.21.27 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
- మహేశ్వరరెడ్డి, ఎస్‌ఈ, రోడ్లు భవనాలు శాఖ, కర్నూలు