Share News

దైవదర్శనం చేసుకొని వెళ్తూ..

ABN , Publish Date - May 15 , 2026 | 11:41 PM

ఆ కుటుంబమంతా వివాహ వేడుకలు ముగించుకున్నారు. నూతన వధూవరులు సంతోషంగా ఉన్నారు. అంతా సవ్యంగా సాగడంతో రాఘవేంద్రస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. స్వామి దర్శనార్థం కుటుంబీకులంతా కలిసి ఆటోలో బయలుదేరారు. గురువారం మంత్రాలయానికి చేరుకొని దర్శనాలు పూర్తయ్యాక రాత్రి అక్కడే బస చేిసి మరుసటి రోజు ఉదయం మరోసారి స్వామి సన్నిధికి వెళ్లారు. రాఘవేంద్రాయ.. మమ్ము చల్లగా చూడు స్వామి అని మొక్కుకున్నారు. ఆటోలోనే తిరుగు ప్రయాణమయ్యారు. కొద్ది దూరం వెళ్లగానే ఓ కుక్క అడ్డు వచ్చింది. ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది. వరుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

దైవదర్శనం చేసుకొని వెళ్తూ..

రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం

మరో పది మందికి గాయాలు

ఘటనాస్థలిని పరిశీలించిన డీఎస్పీ

బోల్తా పడ్డ ఆటో ఇదే, ఇన్‌సెట్‌లో మద్దిలేటి(ఫైల్‌)

నందవరం, మే 15(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం స్వామిని దర్శించుకొని వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవ వరుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నందవరం మండలంలోని ముగతి గ్రామ సమీపంలోని 167వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపారు. వివరాలు.. దేవనకొండ మండలం కప్పట్రాళ్లకు చెందిన మద్దిలేటి రంగడు(21)కి మండల కేంద్రమైన గోనెగండ్లకు చెందిన శ్రావణితో ఈనెల 3వ తేదీన వివాహం జరిగింది. వేడుకలన్నీ సవ్యంగా సాగటంతో ఆకుటుంబ సభ్యులు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. వరుడి అన్నవదినలు రమేష్‌, ఆదిలక్ష్మి, వీరి పిల్లలు భరత్‌, జయలక్ష్మి, మరో సమీప బంధువు పద్మావతి, ఈమె కుమార్తె, కొడుకు శృతి, విష్ణు, మరో బంధువు సుధతోపాటు పెళ్లి కూతురు తండ్రి చావడి వీరేష్‌ మంత్రాలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఆటోలో మొత్తం 11మంది..

గురువారం కప్పట్రాళ్ల నుంచి ఆటోలో మొత్తం 11మంది కుటుంబ సభ్యులు బయలుదేరారు. ఇందులో ఏడుగురు పెద్దలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. సాయంత్రానికి మంత్రాలయానికి చేరుకున్నారు. రాఘవేంద్ర స్వామి దర్శించుకొని రాత్రికి అక్కడే బసచేశారు. శుక్రవారం తెల్లవారుజామున మరోసారి స్వామివారి సన్నిధికి చేరుకొని పూజలు చేశారు. స్వామీ మమ్మల్ని చల్లగా చూడు అంటూ వేడుకు న్నారు. తిరుగుప్రయాణానికి సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో వారు గమ్యస్థానాలకే చేరుకునేవారు. మంత్రాలయం నుంచి 14 కిలోమీటర్లు ప్రయాణించారు.

కుక్కలు అడ్డు రాగా..

నందవరం మండలం ముగతి గ్రామ సమీపంలో 167వ జాతీయ రహదారిపై వారి ఆటో ప్రయాణిస్తోంది. ఇంతలోనే ఒక్కసారిగా కుక్కలు ఆటోకు అడ్డుగా వచ్చాయి. డ్రైవర్‌ హఠాత్తుగా బ్రేక్‌ వేశాడు. ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అక్కడంతా హాహా కారాలు మొదలయ్యాయి. ఆటోలో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. వరు డు బోయ మద్దిలేటి తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. వధువు శ్రావణితో పాటు మిగతా వారికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వా స్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని డీఎస్పీ భార్గవి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - May 15 , 2026 | 11:41 PM