Share News

బియ్యం ధరలకు కళ్లెం

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:52 PM

ఎల్‌నినోను సాకుగా చూపుతూ.. వ్యాపారులు సన్నబియ్యం రకాల ధరలను భారీగా పెంచుకుంటూ జేబులు నింపేసుకుంటున్నారు. సామాన్యులతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా సన్నరకం బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బియ్యం ధరలకు కల్లెం వేసే దిశగా ప్రభుత్వం కీలయ నిర్ణయం తీసుకుంది.

బియ్యం ధరలకు కళ్లెం
సన్న బియ్యం నిల్వలు

కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

వివిధ రకాలపై పరిమితులు విధింపు

బియ్యం, ధాన్యం నిల్వలపై కొత్తగా నియంత్రణ

నిత్యావసరాల పెరుగుదల నేపథ్యంలో కీలక ఉత్తర్వులు

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోను సాకుగా చూపుతూ.. వ్యాపారులు సన్నబియ్యం రకాల ధరలను భారీగా పెంచుకుంటూ జేబులు నింపేసుకుంటున్నారు. సామాన్యులతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా సన్నరకం బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బియ్యం ధరలకు కల్లెం వేసే దిశగా ప్రభుత్వం కీలయ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు భారీ ఊరట కలిగిస్తూ బియ్యం ధరలపై గరిష్ఠ పరిమితులు విధించింది. రకాలను బట్టి వారి గరిష్ఠ రిటైల్‌ ధరలను నిర్ణయించింది. ఇకపై బీపీటీ 3291(సోనా), బీపీటీ5204 (సాంబ), కేఎన్‌ఎం రకాల బియ్యం కిలో రూ.66కే లభించనున్నాయి. అదే విధంగా హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాలు కిలో రూ.76, ఎంటీయూ సాధారణ రకాలు కిలో రూ.47లకే వ్యాపారులు విక్రయించాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జైశ్రీరామ్‌ రకం కిలో బియ్యం ధరను రూ.82గా నిర్ణయించింది. ఈ గరిష్ఠ ధరలకు మించి మార్కెట్‌లో బియ్యం విక్రయించకూడదని, ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ విషయంలో ఆయా శాఖలను సమన్వయం చేసి నిర్దేశించిన ధరలకే బియ్యం వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కర్నూలు కలెక్టర్‌ ఎ.సిరి పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బియ్యం ధరలను అమలు చేయాలని వ్యాపారులు ఈ విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ధాన్యంతో పాటు బియ్యం వ్యాపారంపై అధికారుల పర్యవేక్షణను కట్టుదిట్టం చేసింది. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత అధిక ధరలకు విక్రయాలతో దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు బియ్యం, ధాన్యం నిల్వలపై సరికొత్త నియంత్రణలు విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇకపై కర్నూలు జిల్లాలో బియ్యం విక్రయాలు చేస్తున్న వ్యాపారుల అక్రమాలకు ముకుతాడు పడే అవకాశం ఉంది. తాజాగా బియ్యం ధరలపై నియంత్రణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వచ్చే జనవరి 31 వరకు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇక నుంచి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బియ్యం వ్యాపారం చేసే రైస్‌ మిల్లర్లు, ప్రాసెసర్లు, ట్రేడర్లు, రిటైలర్లు, బిగ్‌చైన్‌ రిటైలర్లు ఇకపై అనామత్‌ వ్యాపారాలు చేయడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. బియ్యం వ్యాపారం చేసే వారు ఇక తప్పనిసరిగా సివిల్‌ సప్లయీస్‌ అధికారుల వద్ద రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న సంస్థలు, వ్యక్తులు ఉత్తర్వులు అమలులోకి వచ్చిన ఏడు రోజుల్లోగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు. పది క్వింటాళ్లకు మించని బియ్యం, ధాన్యం నిల్వలు రెండూ కలిపి 25 క్వింటాళ్లకు మించకుండా నిల్వలు ఉంచుకున్న చిన్న వ్యాపారులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అదే విధంగా ప్రతి వ్యాపారి తనవద్ద ఉన్న ధాన్యం, బియ్యం నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఫుడ్‌ స్టాక్‌ పోర్టల్‌లో ఏడు రోజుల్లోపు నమోదు చేయాలి. బియ్యం ఆరు రకాలుగా వివరాలు నమోదు చేయాలి. ప్రతి శుక్రవారం స్టాక్‌ను తప్పనిసరిగా అప్‌డేట్‌ చే యాలి. ధాన్యంతో పాటు బియ్యం నిల్వలకు సంబంధించి వ్యాపారులు ఇక ప్రతి రోజు రిజిస్టర్‌ నిర్వహించాలి. వ్యాపార ప్రాంగణంలో వినియోగదారులకు కనిపించేలా ధరల పట్టికను ప్రదర్శించాలి. రెవెన్యూ, సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలిస్తారు. అక్రమాలు బయట పడితే కఠిన చర్యలు వ్యాపారులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల ఇప్పటిదాకా బియ్యం ధరలను ఇష్టానురీతిలో పెంచుకుంటూ వినియోగదారుల నడ్డి విరుస్తోన్న వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Updated Date - Nov 28 , 2026 | 11:52 PM