ఈత వనం కోసం ఎన్నికల బహిష్కరణ
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:11 AM
ఈత వనంలో భాగం కోసం ఓ గ్రామానికి చెందిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు
కొత్తపల్లెలో ప్రజల నిర్ణయం
మద్దికెర, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఈత వనంలో భాగం కోసం ఓ గ్రామానికి చెందిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండల పరిధిలోని బొమ్మనపల్లి గ్రామ పంచాయతీకి మజారా గ్రామమైన కొత్తపల్లె గ్రామస్థులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. పంచాయతీకి ఆదాయం సమకూర్చే ఈతవనంలో భాగం ఇవ్వాలన్నది వారి డిమాండ్. బొమ్మనపల్లి, కొత్తపల్లి రెండు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామంలో 70 కుటుంబాలు, 400 జనాభా, 288 ఓట్లు ఉన్నాయి. ఈ రెండు పంచాయతీలు కలిపి 8 వార్డులు ఉండగా.. మజరా గ్రామమైన కొత్తపల్లికి రెండు వార్డులతో పాటు కొన్ని ఓట్లు కూడా కలిసి వస్తాయి. బొమ్మనపల్లి, కొత్తపల్లి గ్రామాలు సమీపంలోని వంక ప్రాంతంలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఈతవనం కలిగి ఉన్నాయి. ఎన్నోఏళ్లుగా ఈతకల్లు, ఈతబర్రెల వల్ల ఉపాధితో వచ్చే ఆదాయాన్ని బొమ్మనపల్లి గ్రామస్థులు గ్రామాభివృద్దికి వాడుకుంటూ వస్తున్నారు. అయితే ఈదఫా ఎన్నికల్లో ఈతవనం ద్వారా వచ్చే ఆదాయాన్ని సగభాగం ఇవ్వాలంటూ కొత్తపల్లి గ్రామస్థులు కోరగా.. బొమ్మనపల్లి గ్రామస్థులు ఒప్పుకోలేదు. దీంతో కొత్తపల్లి గ్రామస్థులు రెండు వార్డులకు కూడా పోటీ చేయలేదు. దీంతో ఆ రెండు వార్డులకు అభ్యర్థులు లేరు. ఈతవనం ద్వారా మూడేళ్లకు దాదాపు రూ.18 లక్షల మేర ఆదాయం కలిగి ఉంది. ఈ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాబట్టి తమ గ్రామాభివృద్ధికి సగం ఇవ్వాలని గ్రామపెద్దలు కోరారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో కొత్తపల్లి గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే పాల్గొంటామని నిర్ణయం తీసుకున్నారు.