Share News

చంద్రబాబుతోనే సీమ ప్రాజెక్టులు

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:29 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేసింది నేనే..! అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి రాజకీయాలను నిప్పుగా మారింది.

చంద్రబాబుతోనే సీమ ప్రాజెక్టులు
గత టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం

గత ఐదేళ్లలో జగన్‌ నిర్లక్ష్యం

కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులకు మళ్లీ జీవం

శ్రీశైలం డ్యాం శాశ్వత మరమ్మతులకు శ్రీకారం.. రూ.280 కోట్లు మంజూరు

రూ.3 వేల కోట్లతో హంద్రీనీవా కాలువ విస్తరణ

గోరుకల్లు జలాశయం మరమ్మతులకు రూ.53 కోట్లు

గత టీడీపీ ప్రభుత్వంలో ముచ్చుమర్రి లిఫ్ట్‌, అవుకు టెన్నల్‌ పూర్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేసింది నేనే..! అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి రాజకీయాలను నిప్పుగా మారింది. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెర లేచింది. సీమ ప్రాజెక్టుల విషయంలో సాక్షి పత్రిక అసత్య కథనాలు వండివార్చుతోందని అధికార కూటమి నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. ధన దాహం, ధనార్జన కోసమే జగన్‌ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేట్టారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు.

కర్నూలు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం.. నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే రాయలసీమ పల్లెసీమలకు జీవనాడి. ఏటేటా వేల టీఎంసీలు కృష్ణా వరద జలాలు శ్రీశైలం డ్యాం దాటుకొని కడలి పాలవుతున్నా.. ఆ నీటిని ఒడిసి పట్టి కరువుసీమకు మళ్లిస్తే కరువు.. వలసలు ఉండవని, ఈ ప్రాంతం పచ్చని పంటలతో సస్యశ్యామలం అవుతుందని మొట్టమొదట తలచిన వ్యక్తి నందమూరి తారకరామారావు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక 1983 మే 23న తెలుగుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించేందుకు పునాది రాయి వేశారు. అంతేకాదు.. హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన వ్యక్తి కూడా ఎన్టీఆరే. సీమ ప్రాజెక్టుల విషయంలో మొదటి నుంచి టీడీపీ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుతోంది. అదే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ సీమ ప్రాజెక్టులు పూర్తి చేయడంలోనూ కాకుండా ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్య ఇస్తూ వచ్చారు. గాలేరు-నగరి ప్రాజెక్టులో కీలకమైన అవుకు టన్నెల్‌ ఫాల్ట్‌జోన్‌ కారణంగా ఎన్నో ఏళ్లుగా పనులు ఆగిపోతే.. ప్రత్యేక చొరవ తీసుకొని బైపాస్‌ టన్నెల్‌ నిర్మించి కడప జిల్లాకు తొలిసారిగా కృష్ణా జలాలు మళ్లించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు.

జగన్‌ హయాంలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

జగన్‌ సారథ్యంలో 2019 మేలో వైసీపీ ప్రభుత్వం కొలుదీరింది. 2019-2024 వరకు ఐదేళ్లు రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణలో అప్పటి జగన్‌ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఇంజనీర్లు అంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట కొత్త ప్రాజెక్టు చేపట్టి..ఉన్న ప్రాజెక్టులను విస్మరించారని సీమ సాగునీటి నిపుణుల అవేదన. ఆ ప్రాజెక్టైనా పూర్తి చేశారా..? అంటే అదీ లేదు. 24 శాతం కూడా పనులు పూర్తి కాకుండానే తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి వేదికగా నిలిచింది. ఎన్జీటీ స్టేతో నాలుగేళ్ల క్రితమే పనులు ఆపేశారు. సీమ లిఫ్టు పేరిట ఉన్న ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. శ్రీశైలం డ్యాం నిర్వహణకు ఓ అండ్‌ ఎం నిధులు ఇవ్వకపోవడంతో గేట్లకు గ్రీస్‌ కూడా వేయలేని పరిస్థితి ఉండేది. సుంకేసుల బ్యారేజీ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు.. వంటి ఏ ప్రాజెక్టుకు కూడా జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో ఓ అండ్‌ ఎం నిధులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఇంజనీర్లే అంటున్నారు. కనీసం హంద్రీనీవా కాలువకు నీళ్లు ఎత్తిపోస్తే కరెంట్‌ బిల్లులు కూడా పెండింగులో పెట్టారు అంటున్నారు. స్వంత జిల్లా కడపకు కృష్ణా జలాలు మళ్లించడంలో కీలకమైన జలాశయం గోరుకల్లు. ఆ జలాశయం బ్యాలెన్స్‌ పనులకు నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ లేక రాతి పరుపు కుంగిపోయింది. ఆ పాపం గత జగన్‌ ప్రభుత్వానిదే ఇంజనీర్లు అంటున్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువను పది వేల క్యూసెక్కుల సామస్థ్యానికి విస్తరిస్తామని రూ.6,182.19 కోట్లతో 2023లో టెండర్లు పిలిచారే తప్ప ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. జగన్‌ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఐదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, ఇప్పుడు జగన్‌ హయాంలోనే సీమ సుభిక్షం అంటూ సాక్షి పత్రికలో ఆసత్య కథనాలు వండి వారుస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

నాడు టీడీపీ.. నేడు కూటమి ప్రభుత్వంలో..

నిర్వహణకు నిధులు: రాష్ట్ర విభజన తరువాత సీఎం చంద్రబాబు సారథ్యంలోని నాడు టీడీపీ ప్రభుత్వం, నేడు కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని కూటమి నాయకులు ఆధారాలతో స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఆపరేషన్‌ అండ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) కింద రూ.37 కోట్లు, ఎస్‌డీఎంఎఫ్‌ కింద రూ.3 కోట్లు నిధులు మంజూరు చేశారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, సుంకేసలు బ్యారేజీ.. వంటి కీలక ప్రాజెక్టులకు గేట్ల మరమ్మతులు, గ్రీస్‌.. వంటి పనులు చేపట్టారు.

సీమ జీవనాడి ముచ్చుమర్రి: శ్రీశైలం జలాశయం 798 అడుగుల లెవల్‌లో కూడా కృష్ణా జలాలు ఎత్తిపోసి రాయలసీమ జిల్లాకు మళ్లించాలని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఆగిపోయింది. 2014లో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం 2015 మార్చిలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులకు అంకుర్పాణ చేశారు. కేవలం రెండేళ్లలో అప్రోచ్‌ కెనాల్‌, లింక్‌ కెనాల్‌, పంప్‌ హౌస్‌, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పనులు పూర్తి 2017 సెప్టెంబరు 8న చంద్రబాబు ప్రారంభించారు. దీనికి దాదాపు రూ.150-200 కోట్లు ఖర్చు చేశారు. శ్రీశైలం లెవల్‌ 835 అడుగులు దిగువక తగ్గపోతే.. కేసీ కాలువకు నాలుగు పంపుల ద్వారా వెయ్యి క్యూసెక్కులు, 12 పంపుల ద్వారా హంద్రీనీవా కాలువకు 3,950 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు.

అవుకు టన్నెల్‌ పూర్తి: కర్నూలు, కడప, చిత్తూరు సహా నెల్లూరు జిల్లాలో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 5 లక్షల జనాభాకు తాగునీరు అందించాలనే లక్ష్యంగా గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టారు. 38 టీఎంసీల కృష్ణా వరద జలాలు తీసుకునేందుకు వీలుగా డిజైన్‌ చేశారు. ప్రాజెక్టులో అవుకు డీ-1, డీ-2 ట్విన్‌ టన్నెల్స్‌ ఎంతో కీలకం. ఫాల్ట్‌ జోన్‌ కారణంగా ఎన్నో ఏళ్లుగా పనులు ఆపేశారు. 2014లో సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక ప్రత్యేక నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించారు. పది వేల క్యూసెక్కుల సామర్థ్యంలో బైపాస్‌ టన్నెల్‌ నిర్మాణం పూర్తి చేసి 2018 సెప్టంబరు 21న కడప జిల్లా గండికోట జలాశయానికి, అక్కడి నుంచి జగన్‌ ప్రాతినిత్యం వహించే పులివెందులకు తొలిసారిగా కృష్ణా జలాలు అందించారు.

గోరుకల్లుకు రూ.53 కోట్లు: గాలేరు-నగరి ప్రాజెక్టులో అత్యంత కీలకలమైన జలాశయం గోరకల్లు. అసంపూర్తి (బ్యాలెన్స్‌) పనుల కోసం నిధులు ఇవ్వాలంటూ ఎస్సార్బీసీ ఇంజనీర్లు గత జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లు పాటు ప్రతిపాదనలు పంపింతే ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఇంజనీర్లు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా రాతిపరుపు కుంగిపోయింది. మరమ్మతులకు కూడా నిధులు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక బ్యాలెన్స్‌ పనులకు రూ.53 కోట్లు మంజూరు చేశారు. అదే క్రమంలో ఓ అండ్‌ ఎం నిధులతో కుంగి పోయిన రాతి పరుపు మరమ్మతులు చేపట్టారు.

హంద్రీనీవా విస్తరణ: కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగు, 35 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టారు. శ్రీశైలం జలాశయం ఎగువన 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి కరువు నేలకు మళ్లించాలని లక్ష్యం. 12 పంపుల ద్వారా 3,850 క్యూసెక్కులు తీసుకోవాల్సి ఉంటే.. 2 వేల క్యూసెక్కులు కూడా తీసుకోలేని పరిస్థితి. 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.1,300 కోట్లతో విస్తరణ పనులు చేపడితే.. 2019లో వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఆపేసింది. 2023లో రూ.6,182.19 కోట్లతో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినా ఒక్క పైసా ఖర్చు చేయలేదు. గంపెడు మట్టి తీయ లేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూ.3 వేలు కోట్లు ఖర్చు చేసి రికార్డు స్థాయిలో కాలువ విస్తరణ పనులు పూర్తి చేశారు. తొలిసారిగా 12 పంపులు ఆన్‌ చేసి 3 వేల క్యూసెక్కులకు పైగా నీటిని మళ్లించారు.

శ్రీశైలం మరమ్మతులకు శ్రీకారం: రాయలసీమ జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు గత ఐదేళ్లు జగన్‌ ప్రభుత్వంలో ఒక్కపైసా కూడా నిధులు ఇవ్వలేదని ఇంజనీర్లే పేర్కొంటున్నారు. గేట్లకు గ్రీస్‌ కూడా వేయలేని పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం రాగానే ఓ అండ్‌ ఎం నిధులు రూ.4 కోట్లు ఇచ్చింది. ఆ నిధులతో గేట్ల నిర్వహణ పనులు చేపట్టారు. శ్రీశైలం డ్యాం శాశ్వత మరమ్మతులు, ప్రొటెక్టివ్‌ స్టీల్‌ సిలిండర్ల ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం రూ.203.95 కోట్లు మంజూరు చేసింది. రూ.5.9 కోట్లతో డ్యాం ఇరువైపుల కొండ రాళ్లు జారిపడకుండా షాట్‌క్రీటింగ్‌ పనులు చేస్తున్నారు. 2009లో వరదలకు కొట్టుకుపోయిన అప్రొచ్‌ రోడ్డు (డ్యాం నిర్వహణ, మరమ్మతుల్లో అత్యంత కీలకమైన రోడ్డు) నిర్మాణం కోసం రూ.25.50 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు.

సీమ ప్రాజెక్టులు పూర్తి

రాయలసీమ ప్రాజెక్టులను జగన్‌ నిర్లక్ష్యం.. నిర్వీర్యం చేస్తే, ఆ ప్రాజెక్టును పూర్తి చేసి కరువు నేలకు కృష్ణా జలాలు మళ్లించిన అపర భగీరథుడు సీఎం చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్‌ ధనార్జన కోసం చేపట్టారు. అసాధ్యమైన ప్రాజెక్టును చేపట్టి తన చేతకానితనాన్ని కూటమి ప్రభుత్వంపై నెడుతున్నాడు. రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణను ఐదేళ్లు గాలికొదిలేశారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది.

గుడిసె కృష్ణమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు

Updated Date - Jan 08 , 2026 | 11:29 PM