బనగానపల్లెలో రక్తతర్పణం
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:13 PM
బనగానపల్లెలో జరిగే మొహర్రం కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వందలాది మంది భక్తులు శోకతప్త హృదయాలతో దైవదూత మహ్మద్ ప్రవక్త, ఆయన కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ రక్తాన్ని చిందిస్తారు. సంతాపసూచకంగా జరిగే ఈ రక్త తర్పణం కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది మొహర్రం రోజున బనగానపల్లెకు చేరుకుంటారు.
సంప్రదాయబద్ధంగా ముగిసిన మొహర్రం
రక్తసిక్తమైన వీఽధులు
బనగానపల్లె, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): బనగానపల్లెలో జరిగే మొహర్రం కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వందలాది మంది భక్తులు శోకతప్త హృదయాలతో దైవదూత మహ్మద్ ప్రవక్త, ఆయన కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ రక్తాన్ని చిందిస్తారు. సంతాపసూచకంగా జరిగే ఈ రక్త తర్పణం కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది మొహర్రం రోజున బనగానపల్లెకు చేరుకుంటారు. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమాలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా ముగిశాయి. కర్బాలా మైదానంలో జరిగిన యుద్ధ్ద భూమిలో వీరమరణం పొందిన మహమ్మద్ ప్రవక్త మనుమలైన ఇమాం హసన్, ఇమాంహుసేన్ వారి కుటుంబ సభ్యుల మృతికి సంతాప సూచకంగా నిర్వహించిన మొహర్రం విషాద ప్రార్థనా గీతాలతో ముగిశాయి. పట్టణంలోని దొరకోటలోని పీర్ల వద్ద నవాబు వంశీయుల వారసులు మీర్ ఫజుల్ అలీఖాన్, వారి కుటుంబసభ్యులు, షియా ముస్లింలు పీర్ల వద్ద శోకతప్త హృదయాలతో ప్రార్థనలు చేశారు. దొరకోటలోని గంధం పీరు వద్ద మొదట నవాబు మీర్ ఫజుల్ అలీఖాన్ వంశీయులు ఫతేహాలు నిర్వహించిన అనంతరం మొహర్రం ఊరేగింపు ప్రారంభమైంది. పలువురు షియా ముస్లింలు దొరకోట వద్ద తలపై కత్తితో కోసుకొని అమరులైన ఇమాంహుస్సేన్ వారి కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ, నల్లదుస్తులతో ఊరేగింపులో పాల్గొన్నారు. దొరకోట పీర్ల వెంట నవాబు వంశీయులు, షియా ముస్లింలు పాల్గొన్నారు. షియా ముస్లింలు బ్లేడులు, కత్తులతో ఎదలపై కొట్టుకుంటూ పీర్ల వెంట బాధాతప్త హృదయాలతో విషాద గీతాలు పాడుకుంటూ ‘మాతం’ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో బనగానపల్లె పట్టణంలోని వీధులు రక్తసిక్తమయ్యాయి. పట్టణంలోని ప్రజలతో పాటు వివిధ గ్రామాలనుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఈ విషాద ర్యాలీ, మాతంను మిద్దెలు, మేడలపై ఎక్కి తిలకించారు. దొరకోట నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోస్టాఫీసు, ఆస్థానం రోడ్డు, సర్కిల్ స్టేషన్, పాతబస్టాండు మీదుగా జుర్రేరువాగు వరకు సాగింది. మొత్తం 40 పీర్ల చావిళ్ల నుంచి పీర్లు దొరకోట పీర్ల వెంట రాగా సాయంత్రం జుర్రేరువాగుకు చేరుకున్నాయి. అక్కడ పీర్లను శుద్ధి చేసి తిరిగి చావిళ్లకు చేర్చారు. మొహర్రం సందర్భంగా పట్టణంలోని వ్యాపార సముదాయాలను యజమానులు మూసివేశారు. సంతాప సూచకంగా సినిమా థియేటర్లను క్లోజ్ చేశారు. రాత్రి వీధిలైట్లు ఆపివేశారు. ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డోన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐలు ప్రవీణ్‌కుమార్, మంజునాథ్‌రెడ్డి, ఎస్‌ఐలు దుగ్గిరెడ్డి, కల్పనతో పాటు పోలీసు సిబ్బంది భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తం చిందించిన ముస్లింలకు 108 అంబులెన్స్ సిబ్బంది, డాక్టర్లు వైద్య సేవలందించారు.