Share News

వైఎస్సార్‌ విగ్రహానికి నల్ల రంగు

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:13 AM

ఆళ్లగడ్డలోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నల్ల రంగు పూసిన ఘటన కలకలం రేపింది.

వైఎస్సార్‌ విగ్రహానికి నల్ల రంగు
విలేకర్ల సమావేశంలో నిందితుడిని చూపుతున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

కలకలం రేపిన ఘటన.. నిందితుడి వైసీపీ కార్యకర్త

ఆస్తి వివాదంలో న్యాయం జరగలేదనే నిరసనతోనే ఘటన

టీషర్ట్‌, పెయింట్‌ డబ్బా, సుత్తి, సెల్‌ఫోన్‌ స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల క్రైం/ఆళ్లగడ్డ ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డలోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నల్ల రంగు పూసిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్‌ విగ్రహానికి నలుపు రంగు పూసింది వైసీపీ కార్యకర్తే కావడం విశేషం. ఈ ఘటనలో నిందితుడు, వైసీపీ కార్యకర్తను ఆళ్లగడ్డ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆస్తి వివాదంలో న్యాయం జరగలేదనే ఆవేదనతోనే నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ఈ ఘటన వివరాలను సోమవారం రాత్రి నంద్యాల ఎస్పీ సునీల్‌ షెరాన్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఆళ్లగడ్డ మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన సిద్దంరెడ్డి రమణా రెడ్డి(49) మొదటి నుంచి వైసీపీలో చురుకుగా ఉన్నాడు. వైసీపీ ముఖ్య నాయకులతో కలసి తిరిగేవాడు. రమణా రెడ్డి తన ఆస్తి విషయంలో సన్నిహితులు, బంధువులతో లావాదేవీలున్నాయి. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు తనకు రూ.16 కోట్లు మోసం చేశారని ఆరోపిస్తూ గతంలో పలువురు రాజకీయ నాయకులను కలిశాడు. 2022-23 సంవత్సరాల్లో తాడేపల్లిలో సజ్జల రామకృష్ణా రెడ్డిని, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డిని కలసి న్యాయం చేయాలని అభ్యర్థించాడు. ఈ క్రమంలో తమ పార్టీవాళ్లే తనకు న్యాయం చేయలేదని అసహనానికి గురయ్యాడు. దీంతో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి నల్లరంగు పూసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. రమణారెడ్డి ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆన్‌లైన్‌లో బ్లాక్‌ పెయింట్‌ డబ్బా, బ్రష్‌ను బుక్‌ చేశాడు. అదేవిధంగా ‘నాకు రూ.16 కోట్లు మోసం చేశారు..’ అంటూ టీషర్ట్‌పై ప్రింటింగ్‌ చేయించాడు. ఆ టీషర్ట్‌పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మోసం చేశాడని ఆరోపిస్తున్న వైసీపీ నాయకుడు మల్లికార్జున రెడ్డి ఫొటోలను ప్రింట్‌ చేయించాడు. టీషర్ట్‌ను వైఎస్సార్‌ విగ్రహానికి చుట్టి మొత్తంగా నల్లరంగు పూశాడు. అక్కడినుంచి ఆర్టీసీ బస్సులో నంద్యాలకు చేరుకున్నాడు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు నిందితుడు రమణారెడ్డి నంద్యాల ద్వారకా లాడ్జీలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడంతో..

విగ్రహానికి నలుపు రంగు పూయడానికి ఉపయోగించిన పెయింట్‌ను నిందితుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. అతని సెల్‌ఫోన్‌లోని అమెజాన్‌ యాప్‌ను పరిశీలించగా ఈనెల 15న పెయింట్‌ ఆర్డర్‌ చేసి, 16న డెలివరీ తీసుకున్న వివరాలు ఉన్నాయి. నిందితుడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా ఒక కొత్త సుత్తి, సీల్‌ ఓపెన్‌ చేయని సుమారు అర లీటర్‌ నలుపు రంగు పెయింట్‌ డబ్బా, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, మల్లికార్జునరెడ్డి ఫొటోలతో ఉన్న టీషర్ట్‌ లభించాయని తెలిపారు. వీటితో పాటు నిందితుడి సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 324(4), 196(1)(బి), 352తో పాటు పీడీపీపీ యాక్ట్‌ సెక్షన్‌ -3 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడిపై గతంలో కూడా ఆళ్లగడ్డ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బైండోవర్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడు చేసిన ఆస్తి మోసం ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అంశాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఒక వ్యక్తి చేసిన ఆరోపణలను ఆధారాలు లేకుండా మొత్తం రాజకీయ పార్టీకి, ఇతర వ్యక్తులకు ఆపాదించరాదన్నారు.

శాంతిభద్రతలకు సహకరించాలి

కేసులో లభించిన ఆధారాలు, వాంగ్ములాలు పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా శాంతి భద్రతలకు సహకరించాలని, రాజకీయ విభేదాలు, వ్యక్తిగత సమస్యలను చట్టబద్దమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా ఈ ఘటన రాజకీయ వర్గంలో దుమారం రేపుతోంది.

Updated Date - Aug 18 , 2026 | 12:13 AM