బర్డ్‌ఫ్లూ వణుకు
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:00 AM
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. అనంతపురం జిల్లాలో ఓ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ కారణంగా 2,500 కోళ్లు మృత్యువాత పడ్డాయి.
అప్రమత్తమైన పశుసంవర్థక శాఖ అధికారులు
చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం: జేడీ రాజశేఖర్
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. అనంతపురం జిల్లాలో ఓ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ కారణంగా 2,500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో కోళ్లు మృతి చెందడంతో ఆ రైతు ఇచ్చిన సమాచారం మేరకు పశుసంవర్థక శాఖ అధికారులు మృతి చెందిన కోళ్ల నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిఫ్యూజెసెస్ పరీక్షల నిమిత్తం పంపారు. బర్డ్‌ఫ్లూ ఉన్నట్లుగా తేలింది. ఆ జిల్లాలో అధికారులు అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టారు. పక్క జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు సమాచారం అందడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల పశుసంవర్థక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కోళ్లను రైతులు దిగుమతి చేసుకుని పౌల్ర్టీ ఫారాలను నిర్వహిస్తున్నారు.
గతంలో కర్నూలు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పౌల్ర్టీ ఫారాలను నిర్వహిస్తున్న యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితులు పునరావృతం కాకూడదనే ముందు జాగ్రత్తతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు.
ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం
అనంతపురంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన సమాచారంతో కర్నూలు జిల్లాలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. కర్ణాటక రాష్ట్రం నుంచి సప్లయ్ చేస్తున్న కోళ్లకు ఈవ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేసేందుకు ఆలూరులో సిబ్బందిని నియమించాం. ప్యాపిలి వద్ద కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఫౌల్ర్టీ రైతులు ఆందోళన చెందొద్దు. - రాజశేఖర్, జేడీ, పశుసంవర్థక శాఖ, కర్నూలు