హైకోర్టు బెంచ్ కోసం బైక్ ర్యాలీ
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:20 PM
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ప్రజా సం ఘాలు, ఆయా రాజకీయ పార్టీలు సంయుక్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ ఏవోకు వినతిపత్రం అందజేత
కర్నూలు లీగల్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ప్రజా సం ఘాలు, ఆయా రాజకీయ పార్టీలు సంయుక్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కొండారెడ్డి బురుజు, రాజ్‌విహార్ మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. కలెక్టరేట్ ఎదురుగా పలువురు ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు ప్రసంగించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.చంద్రుడు మాట్లాడుతూ కర్నూలులో రాజధానిని కోల్పోయి వివక్షతకు గురవుతుందని, ఇకపై ఆ వివక్షతను తొలగించడానికి శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాది జయరాజు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్దికి పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా ఉద్యమిస్తామన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవోకు తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ర్యాలీలో ఐలూ (ఏఐఎల్‌యూ) నాయకులు వెంకటస్వామి, లక్ష్మణ్, ఐఏఎల్ నాయకులు బీఎస్ రవికాంత్ ప్రసాద్, పి.దస్తగిరి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మీదేవి, బీటీఎఫ్ నాయకులు యేసురత్నం, పీవోపీ నాయకులు బి.శ్రీనివాసరావు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.