చంద్రఘంట అలంకారంలో భ్రామరి
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:55 PM
అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠ స్వరూపిణి భ్రమారాంబదేవి అమ్మవారు దేవి శరన్నవ రాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చారు.
రావణ భుజస్కందాలపై ఆదిదంపతులు
వైభవంగా సాగిన గ్రామోత్సవం
నేడు కూష్మాండ దుర్గ అలంకారం
శ్రీశైలం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠ స్వరూపిణి భ్రమారాంబదేవి అమ్మవారు దేవి శరన్నవ రాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమా ర్చనలు, శ్రీచ క్రార్చన, సహస్ర చండీపారాయణ సహిత శత చండీ మహా రుద్రయాగం, చండీ రుద్రహోమాలు, జపపారాయణలు, చతుర్వేద పారాయణలు, నవగ్రహ జపాలు, చండీ సప్తశతి పారాయణ, మహా విద్య పారాయణ, బ్రామరీ బాలాజపనుష్టానాలు, సూర్య నమస్కారాలను అర్చక వేదపండితులు జరిపించారు. సాయంత్రం విశేష పూజలు, జపాలు, పారాయణలు, హోమాలను నిర్వహించారు. కుమారి పూజల్లో 2 నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను అమ్మవారిగా భావిస్తూ పూజలు నిర్వహించడం ఆలయ సంప్రదాయం.
తలపై అర్ధచంద్రున్ని ధరించి..
చంద్రఘంట దేవి పది చేతుల్లో పద్మం, బాణం, ధనస్సు, అభయహస్తం, జపమాల, త్రిశూలం, గద, ఖడ్గం, పంచ ముద్ర, కమండలం ధరించి ప్రశాంత వదనంతో సాత్విక స్వరూపిణిగాఉంటుంది. భక్తులకు శాంతస్వరూపిణిగా దర్శనమిస్తున్న ఈదేవి యుద్ధ్దోన్ముఖరాలై ఉండటం ప్రత్యేకం. తలపై అర్ధచంద్రున్ని ధరించి ఉండటంతో ఈ అమ్మవారికి చంద్రఘంట దేవీగా పిలుస్తారు. ఈఅమ్మవారిని పూజించడంతో కష్టాలు తొలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది.
రావణ వాహనంపై శ్రీశైలేశుడు
అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పుష్పాలంకరణ చేసిన వేదికపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను రావణ వాహనంపై ఆశీనులను చేసి పూజా క్రతువులను అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం రావణనుని భుజస్కందాలపై విహరిస్తూ చంద్రఘంట సహిత శ్రీశైలేశుడు ఆలయ ప్రధాన వీధి నుంచి నంది ఆలయం మీదుగా క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో పలు రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ కళాకారుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గ్రామోత్సవంలో చైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యుడు చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, కాశీనాథ్, ఆకుల శ్రీనివాసులు, పీఆర్‌వో శ్రీనివాసరావు, ఏఈవో సాములు, హర్యానాయక్, ఉమేష్ పట్వారి, సీ ఎస్‌వో శ్రీనివాసరావు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామోత్సవం అనంతరం అమ్మవారికి ఆస్థాన సేవ, మంత్రపుష్పం, సువాసిని పూజలు, కాలరాత్రి పూజలు జరిపించారు.
నేడు కైలాస వాహనంపై..
దసరా మహోత్సవాల్లో నాల్గవ రోజైన బుధవారం భ్రమరాంబదేవి కూష్మాండ దుర్గా అలంకారంలో దర్శనమివ్వనుంది. స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనంపై ప్రత్యేక పూజలందుకుని భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.