స్కందమాతగా భ్రామరి
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:05 AM
దేవి శరన్నవరాత్రులు శ్రీశైలంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు గురువారం అమ్మవారు స్కందమాతగా దర్శనం ఇచ్చారు.
శేష వాహనంపై శ్రీగిరీశుడు
ఘనంగా శరన్నవరాత్రోత్సవాలు
వైభవంగా స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం
శ్రీశైలం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దేవి శరన్నవరాత్రులు శ్రీశైలంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు గురువారం అమ్మవారు స్కందమాతగా దర్శనం ఇచ్చారు. స్వామి, అమ్మవారు శేష వాహనసేవలో ఊరేగారు. ఉదయం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రాత:కాలపూజలు, విశేష కుంకుమార్చనలు, హోమాలు, జపాలను నిర్వహించారు. చండీహోమం, రుద్రహోమం, నవావరణార్చనలు జరిపించారు.
ఉత్సవమూర్తికి విశేష పూజలు
ఆలయ ప్రాకారంలోని సింహమండపం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సమూర్తికి సహస్ర నామాలతో, విశేష పూజలు నిర్వహించారు. నవదుర్గల్లో ఐదో స్వరూపమైన స్కందమాత చతుర్బుజాలతో ఒకచేత్తో స్కందుడ్ని పట్టుకొని, మిగిలిన చేతుల్లో పద్మాలు, అభయ ముద్ర ధరించి దర్శనం ఇచ్చింది.
శేషవాహన సేవలో మల్లన్న
ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు శేషవాహన సేవలో పూజలందుకున్నారు. అక్కమహాదేవి అలంకార మండపంలో శేషవాహనంపై ఆలయ రాజగోపురం నుంచి, గంగాధర మండపం, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగారు.
నేడు కాత్యాయని అలంకారం, హంసవాహనంపై ఆది దంపతులు
ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు కాత్యాయని స్వరూపంలో దర్శనమిస్తారు. స్వామి, అమ్మవారు హంస వాహనంపై ఊరేగుతారు.