Share News

శైలపుత్రిగా భ్రామరి

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:17 AM

శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాల శోభతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దేవి శరన్నవరాత్రులలో తొలిరోజు భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ప్రధానాలయంలోని యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

 శైలపుత్రిగా భ్రామరి

పది రోజులపాటు దేవి నవరాత్రుల ప్రత్యేక పూజలు

ప్రధానాలయంలో శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం

భృంగి వాహనంపై గ్రామోత్సవంలో దేవదేవులు

భక్తులను ఆకట్టుకున్న సంప్రదాయ కళా రూపాలు

శ్రీశైలం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాల శోభతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దేవి శరన్నవరాత్రులలో తొలిరోజు భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ప్రధానాలయంలోని యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఆదివారం ఉదయం పసుపు కుంకుమలు, ఫల పుష్పాలతో ప్రధాన గోపురం నుంచి సంప్రదాయానుసారం ఆలయ ప్రవేశం చేశారు. అమ్మవారి ఆలయ మండపంలో ప్రత్యేక పూజలు చేసుకుని స్వామిఅమ్మవార్ల ఉభయ యాగశాలల్లో ఆగమశాస్త్రం ప్రకారం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ మహాసంకల్పాన్ని పఠించి గణపతిపూజ చేశారు. అనంతరం కంకణపూజ కంకణధారణ, రుత్విగరణం, పుణ్యాహవాచనం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, హోమం, మండపారాధన, చండీ కళశస్థాపన, శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు, శివసంకల్పం, రుద్ర కళశస్థాపన, సహస్ర చండీపారాయణ సహిత శత చండీ మహా రుద్రయాగం, చండీ రుద్ర హోమాలు, జప పారాయణలు, చతుర్వేద పారాయణలు, నవగ్రహ జపాలు, చండీ సప్తశతి పారాయణ, మహావిద్య పారాయణ, సూర్య నమస్కారాలను అర్చక వేదపండితులు జరిపించారు. సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపనలో భాగంగా విశేష హోమాలను నిర్వహించారు.

భృంగి వాహనంపై దేవదేవులు

దసరా మహోత్సవాలలో భాగంగా తొలిరోజు సాయంత్ర అక్కమాహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పుష్పాలంకరణ చేసిన వేదికపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను భృంగి వాహనంపై ఆశీనుల చేసి షోడశోపచార పూజా క్రతువులను అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం భృంగి వాహనాధీశులైన దేవదేవులను ఆలయ ప్రధాన వీధి నుంచి నంది ఆలయం మీదుగా క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కేరళ చండీ మేళం, కొమ్ముకోయ నృత్యం, థయ్యం, విళక్కు, స్వాగత నృత్యం, కోలాటం, రాజభటుల జానపద పగటి వేశాలు, అశ్వ ప్రదర్శన, డమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి వంటి పలు రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ కళాకారుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గ్రామోత్సవంలో ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, కాశినాథ్‌, ఆకుల శ్రీనివాసులు, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈవో సాములు, హర్యానాయక్‌, ఉమేష్‌ పట్వారి, సిఎ్‌సవో శ్రీనివాసరావు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

శైలపుత్రిగా భ్రమరాంబదేవి...

దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలలో తొలిరోజు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానాలయ ప్రాకారంలో అమ్మవారి సింహ మండపం ఎదురుగా ప్రత్యేక వేదికపై శైలపుత్రి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శైలపుత్రి అమ్మవారు ద్విభుజాలు కలిగి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పద్మాన్ని ధరించి ఉంటారు.

నేడు బ్రహ్మచారిణి అలంకారం... మయూర వాహన సేవ

దసరా మహోత్సవాలలో రెండవ రోజైన సోమవారం భ్రమరాంబదేవి బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమివ్వగా స్వామిఅమ్మవార్లకు మయూర వాహనంపై ప్రత్యేక పూజలందుకుని భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

పీఠాలు మఠాలు ఆశ్రమాలలో...

క్షత్ర పరిధిలోని శ్రీదేవి వేదపాఠశాల, కంచికామకోటి శంకర మఠం, శృంగేరి శంకర మఠం, శ్రీ విద్యాపీఠం, శైవ మహాక్షేత్ర మఠం, వీరశైవ గురుకులం, యోగిని మాత ఆధ్యాత్మిక సేవాశ్రమం, మౌనస్వామి ఆశ్రమం, వాసవి నిత్యాన్నదాన సత్రంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం తదితర పీఠాలు, ఆశ్రమాలు, మఠాలలో అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

భక్తులకు సంపూర్ణమైన ఏర్పాట్లు

పది రోజులపాటు జరిగే దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్వామిఅమ్మవార్ల సంతృప్తికర దర్శనంతోపాటు అవసరమగు మౌలిక వసతులను సంపూర్ణంగా ఏర్పాటు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌నాయుడు తెలిపారు. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు జిరిపించిన తరువాత ఉభయ దేవాలయాల్లో భక్తుల దర్శనానికి అనుమతించనున్నట్లు చెప్పారు. నవరాత్ర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవుల ఆశిస్సులు పొందగలరని కోరారు.

Updated Date - Oct 12 , 2026 | 12:17 AM