ఘనంగా భోగి సంబరాలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:18 PM
మండలంలోని ప్రజలు భోగి సంబరాలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు.
అవుకు, జనవరి 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రజలు భోగి సంబరాలను బుధవారం వైభవంగా జరుపుకున్నారు. సంక్రాంతి వేడుక ల్లో భాగంగా మొదటి రోజు తెల్లవారుజామునే ప్రజలు ఇళ్లముందు భోగి మంటలు వేశారు. మహిళలు ఇళ్లముందు రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఉంచారు. పిల్లలు గాలి పటాలు ఎగురవేశారు. చిన్నారులను కూర్చోబెట్టి భోగి పళ్లు పోశారు.
ప్యాపిలి: మండలంలోని ప్యాపిలి, ఏనుగమర్రి, చంద్రపల్లి, రాచెర్ల, నేరుడుచెర్ల, పీ.ఆర్.పల్లి, నల్లమేకలపల్లి గ్రామాల్లో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయమే ఇళ్ల ముందు రంగు వల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. భోగి మంటలు వేశారు.
చాగలమర్రి: మండలంలో పలు గ్రామాల్లోని ప్రజలు భోగి వేడుక లను ఘనంగా జరుపుకున్నారు. బుధవారం కన్యకాపరమేశ్వరి, మల్లెం వీధితోపాటు పలు వీధుల్లో భోగి మంటలు వేసి నృత్యాలు చేశారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు.
కొలిమిగుండ్ల: మండలంలోని తిమ్మనాయినిపేట గ్రామంలో ఆకాంక్ష ఫౌండేషన విద్యార్థులు భోగి మంటలు వేశారు. అలాగే మండలంలోని గ్రామాల్లో మహిళలు ఇళ్లముందు రంగు రంగుల ముగ్గు లు వేసి గొబ్బె మ్మలు ఉంచారు. చిన్నారులకు భోగిపళ్లు పోసి పెద్దలు ఆశీర్వదిం చారు.
బనగానపల్లె: నందవరం చౌడేశ్వరి మాత ఆలయంలో సంక్రాంతి సంబరాలు ఆలయ చైర్మన పీవీ నాగార్జున రెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు రేగుపండ్లతో పిల్లలకు స్నానం చేయించి భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైకిల్ స్లో పందెంలో మొదటి బహుమతి రూ.1500, రెండో బహుమతి రూ.1000, మూడో బహుమతి రూ.500లను అందజేశారు. లెమన స్ఫూన పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి రూ 1500, రెండో బహుమతి రూ 1000 మూడో బహుమతి రూ.500లను అందజేశారు. తాడాట పోటీల్లో ప్రథమ బహుమతి రూ.1500, రెండో బహుమతి రూ. 1000, మూడో బహుమతి రూ 500 అందజేశారు.
దొర్నిపాడు: మండలంలోని ఆయా గ్రామాల్లో భోగి సందర్భంగా మహిళలు ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఉంచి అనంతరం భోగి మంటలు వేశారు. మహిళలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.