రోగులకు మెరుగైన సేవలు
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:04 AM
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు
మంత్రి టీజీ భరత్
శానిటేషన్ ఏజెన్సీ తీరుపై మంత్రి ఆగ్రహం
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రిలోని శానిటేషన్‌లో డిగ్రీ, వయస్సు పేరుతో ఉన్న కార్మికులను తొలగించి పోస్టుల పేరుతో కొత్త వారి నుంచి రూ. లక్ష నుంచి రూ.2 లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ పనితీరు ఇకనైనా మార్చుకోవాలని లేనిపక్షంలో విజిలెన్స్ ద్వారా విచారణ చేయిస్తానని హెచ్చరించారు. ఐటీకి సంబంధించిన మాడ్యుల్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావడంతో పాటు వీలైనంత వరకు అన్ని ప్రక్రియలను ఆటోమేషన్ చేయాలని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ.. శానిటేషన్ పనుల విషయంలో కొందరి తీరు అభ్యంతరకరంగా ఉందని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. కలెక్టర్ సిరి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ వ్యవస్థను సమర్ధవంతంగా వినియోగించుకోవాలన్నారు. కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రికి మున్సిపల్ వాటర్ సరఫరా, సివేజ్ సమస్య పరిష్కారానికి రూ.18 లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.