ఉల్లిసాగులో అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:03 AM
గత సంవత్సరం ఉల్లి రైతులు ముందస్తు వర్షాల కారణంగా అధిక విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేసి భారీగా నష్టపోయారని, ఈసారి అటువంటి నష్టాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజా కృష్ణారెడ్డి రైతు లకు విజ్ఞప్తి చేశారు.
ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజా కృష్ణారెడ్డి
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): గత సంవత్సరం ఉల్లి రైతులు ముందస్తు వర్షాల కారణంగా అధిక విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేసి భారీగా నష్టపోయారని, ఈసారి అటువంటి నష్టాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజా కృష్ణారెడ్డి రైతు లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కర్నూలు జిల్లాలోని కోడు మూరు, పాణ్యం, కల్లూరు, సి.బెళగల్ తదితర మండలాల్లో రైతు లు సాగు చేసిన ఉల్లి నారును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఉల్లి పంట సాగులో చేపట్టాల్సిన చర్యలపై సూచ నలను అందించారు. గత సంవత్సరం దాదాపు 60వేల ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేసినట్లు తెలిపారు. ఈసారి నష్టాలు రాకుండా ఉద్యాన శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించి మంచి లాభాలను పొందాలని సూచించారు. వర్షం నీరు నిల్వ చేయడం వల్ల ఉల్లిగడ్డలు కుళ్లిపోయి పంట నష్టానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని రైతులకు వివరించారు. పంట చేతికొచ్చిన తర్వాత ఒకేసారి అందరూ అధిక మొత్తంలో ఏ మాత్రం ఆరబెట్టకుండా ఉల్లిగడ్డలను తీసుకురావద్దని, దీని వల్ల ధర తగ్గి తీవ్రంగా నష్టం వచ్చే ప్రమాదముందన్నారు. ఉల్లితో పాటు అంతర్ పంటగా కంది, మిరప, పసుపు, మొక్కజొన్న, పప్పుదినుసులను సాగు చేయాలని, దీని వలన ఒక పంట నష్టపోయినా ఇతర పంటల వల్ల లాభం వచ్చే అవకాశం ఉంటుందని రైతులు గుర్తించాలన్నారు.