బ్యాంక్యూలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:31 PM
జిల్లాలోని వివిధ బ్యాంకుల వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. గత నెలలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాలకు జమ చేసింది.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ
డబ్బులు డ్రా చేసుకుంటున్న అన్నదాతలు
కర్నూలు అగ్రికల్చర్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ బ్యాంకుల వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. గత నెలలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాలకు జమ చేసింది. ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు మొత్తం రూ.7వేలు నగదు రైతు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కోఆపరేటివ్ బ్యాంకు వద్ద శుక్రవారం డబ్బుల కోసం రైతులు ఉదయాన్నే బ్యాంకుల వద్దకు వచ్చి క్యూలో నిలబడ్డారు. కృష్ణానగర్ కోఆపరేటివ్ బ్యాంకులో రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి రైతులకు సాధ్యమైనంత తొందరగా డబ్బులు ఇచ్చి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కర్నూలు నియోజకవర్గంలో 295 మంది రైతులకు రూ.18లక్షలు బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. కోడుమూరు నియోజకవర్గంలో 35,052 మంది రైతులకు రూ.23కోట్లు జమ అయ్యాయి. ఎమ్మిగనూరు నియోజక వర్గంలో 38,318 మంది రైతులకు రూ.26కోట్లు, ఆదోనిలో 18,722 మంది రైతులకు రూ.12.32 కోట్లు, మంత్రాలయంలో 41,992 మంది రైతులకు రూ.27కోట్లు, పత్తికొండలో 54,774మంది రైతులకు రూ.37.177 కోట్లు, ఆలూరు నియోజకవర్గంలో 63,317మంది రైతులకు రూ.42కోట్లు, పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు సంబంధించి 20,287 మంది రైతులకు రూ.13.36కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు చేరాయి. తమ బ్యాంకు ఖాతాలకు డబ్బులు చేరినట్లు మేసే జ్‌లు చూసు కున్న అన్నదాతలు వెంటనే పనులన్నీ పక్కనపెట్టి డబ్బులు డ్రా చేసుకు నేందుకు బ్యాంకుల వైపు పరుగులు పెడుతున్నారు.
ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
రైతులు ‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్’ డబ్బులు డ్రా చేసు కునేందుకు భారీగా వస్తున్నారు. వారికి ఇబ్బందులు లేకుండా డబ్బులు డ్రా చేయించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. రైతులు ఓపికతో ఉంటూ డబ్బులు తీసుకోవచ్చు. డబ్బులు డ్రా చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
రమాదేవి, మేనేజర్, సహకార బ్యాంక్ కృష్ణానగర్ బ్రాంచ్, కర్నూలు