Share News

రసవత్తరంగా జూపాడుబంగ్లా రాజకీయం

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:17 PM

మండల రాజకీ యం రసవత్తరంగా మారింది. మండల అధ్యక్షురాలు సువర్ణమ్మను పదవిని నుంచి దించేందుకు పలువురు ఎంపీటీసీ సభ్యులు పావులు కదిపారు.

రసవత్తరంగా జూపాడుబంగ్లా రాజకీయం

31న ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

క్యాంపులో ఎంపీటీసీ సభ్యులు

జూపాడుబంగ్లా, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మండల రాజకీ యం రసవత్తరంగా మారింది. మండల అధ్యక్షురాలు సువర్ణమ్మను పదవిని నుంచి దించేందుకు పలువురు ఎంపీటీసీ సభ్యులు పావులు కదిపారు. ఇప్పటికే ఎంపీడీఓకు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును కూడా ఇచ్చారు. దీంతో ఈనెల 31వ తేదీన మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల అధికారి, ఆర్డీవో నాగజ్యోతి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానాన్ని ఎంపీపీ సువర్ణమ్మ ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో మొత్తం 11 స్థానాల్లో 9 స్థానాలు వైసీపీ మద్దతుదారులు గెలుపొందగా మరో రెండు స్థానాల్లో స్వంతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో తాడిపాడు ఎంపీటీసీ శంకర్‌ పదవిలో ఉండగానే మృతిచెందాడు. తర్తూరు నుంచి వైసీపీ మద్దతుతో ఎంపీ టీసీగా నెగ్గిన నాగిరెడ్డి తర్వాతి క్రమంలో సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. దీంతో దీంతో తాడిపాడు, తర్తూరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీకి మిగిలిన 8 మందిలో ఐదుగురు ఎంపీటీసీలు సుజాత, వెంకటరమణమ్మ, వెంకటమ్మ, కృపాకర్‌, కే.సుజాతలు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. వీరితో పాటు పారుమంచాల నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన నీలమ్మ కూడా టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఈ ఆరుగురు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఈనెల 31న అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీటీసీ సభ్యులకు ఎన్నికల అధికారి, ఆర్డీఓ నోటీసులు జారీ చేశారు. 11 గంటలకు జూపాడుబంగ్లా ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశమందిరంలో హాజరు కావాలని ఆమె ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ సువర్ణమ్మ, వైఎస్‌ ఎంపీపీ కృష్ణారెడ్డి, తూడిచెర్ల ఎంపీటీసీ నాగమణిలు వైసీపీ నేతలతో మంతనాలు చేస్తూ అవిశ్వాసాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. మరో వైపు టీడీపీకి అనుకూలంగా ఆరుగురు ఎంపీటీసీలు ఇప్పటికే హైదరాబాద్‌లో క్యాంపులో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 27 , 2026 | 11:17 PM