ఏసీబీ వలలో బనగానపల్లె తహసీల్దార్!
ABN , Publish Date - May 04 , 2026 | 11:32 PM
రెండు వారాల క్రితమే ప్రమోషన్ వచ్చిన ఆ తహసీల్దార్ లంచాల రుచి మరిగాడు. డీటీగా ఉన్నప్పుడు ఎంతటి అవినీతికి పాల్పడ్డాడో ఏమో కానీ.. తహసీల్దార్‌గా ప్రమోషన్ వచ్చిన వెంటనే కాసులకు కక్కుర్తి పడ్డాడు.
మండల ఇన్‌చార్జి సర్వేయర్ కూడా...
రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడులు
బనగానపల్లె, మే 4 (ఆంధ్రజ్యోతి): రెండు వారాల క్రితమే ప్రమోషన్ వచ్చిన ఆ తహసీల్దార్ లంచాల రుచి మరిగాడు. డీటీగా ఉన్నప్పుడు ఎంతటి అవినీతికి పాల్పడ్డాడో ఏమో కానీ.. తహసీల్దార్‌గా ప్రమోషన్ వచ్చిన వెంటనే కాసులకు కక్కుర్తి పడ్డాడు. మండలానికే ఆదర్శంగా ఉండాల్సిన ఆ అధికారి ఇప్పుడు లంచం తీసుకుని కటకటాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా... ఆళ్లగడ్డలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న రాజీవ్ రెడ్డి రెండు వారాల క్రితం బనగానపల్లె తహసీల్దార్‌గా పదోన్నతిపై వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన ప్రజాసమస్యలను గాలికొదిలేసి లంచాలకు మరిగాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఓ రైతు నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్‌తో పాటు ఇన్‌చార్జి సర్వేయర్ హుస్సేన్ బాషాను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన మేరకు వివరాలు.. అవుకు మండలం కోనాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డికి బనగానపల్లెలో సర్వేనంబరు 121-సీ, 121-బీ సర్వేనంబర్లులో 3 ఎకరాల పొలం ఉంది. చాలా కాలంగా ఈ పొలం చుక్కల భూమిగా నమోదైంది. చుక్కలు భూములుగా లేకుండా మార్చేందుకు 2023 సంవత్సరంలోనే సర్వేయర్ హుస్సేన్ బాషా రూ.1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు చెల్లించలేక రైతు నారాయణరెడ్డి పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం నూతనంగా వచ్చిన తహసీల్దార్ రాజీవ్‌రెడ్డి, మండల ఇంచార్జి సర్వేయర్‌తో చుక్కల భూములనుంచి మామూలు పట్టా భూములుగా మార్చుకునేందుకు రైతు నారాయణరెడ్డి నుంచి రూ.80వేలు లంచం ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే రైతు నారాయణరెడ్డి అంత నగదు ఇచ్చేందుకు విముఖత చూపి రెండు రోజుల క్రితం కర్నూలులోని ఏసీబీ డీఎస్పీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సోమవారం రూ.50వేలు నారాయణరెడ్డి చేతికి నగదు ఇచ్చి సర్వేయర్‌కు, తహసీల్దారుకు ఇచ్చేలా ప్లాన్ చేశారు. సోమవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో బనగానపల్లె పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద మండల సర్వేయర్ షేక్ హుస్సేన్‌బాషాకు రైతు నారాయణరెడ్డి రూ.50వేలు నగదు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు మండల సర్వేయర్ హుసేన్‌బాషను అదుపులో తీసుకుని తహసీల్దారు రాజీవ్‌రెడ్డితో ‘డబ్బుతో వస్తున్నా..’ అని ఫోన్‌లో మాట్లాడించారు. సర్వేయర్ నగదును తీసుకు వచ్చి తహసీల్దారు రాజీవ్‌రెడ్డికి అప్పగించారు. దీంతో ఇద్దరికీ ఇందులో భాగముందని ఏసీబీ అధికారులు గుర్తించారు. సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆ ఇద్దరినీ ఏసీబీ అధికారులు కర్నూలుకు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సోమన్న వెల్లడించారు.