బంద్ విజయవంతం
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:23 PM
అఖిలపక్ష విద్యార్ధి, యువజన సంఘాలు శుక్రవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ప్రకటించి సెలవు ఇచ్చాయి.
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు
ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద ఉద్రిక్తత
నంద్యాల క్రైం, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : అఖిలపక్ష విద్యార్ధి, యువజన సంఘాలు శుక్రవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ప్రకటించి సెలవు ఇచ్చాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగాయి. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందసు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పలువురు విద్యార్ధి, యువజన సంఘాల నాయకులను పోలీసులు తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని సమీప పోలీస్‌స్టేషన్లకు తరలించారు. బంద్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటుచేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
ఆందోళన చేపట్టేందుకు వచ్చిన..
నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆందోళన చేపట్టేందుకు వచ్చిన విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాల నాయకులు నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని..
విద్యార్ధి సంఘాల అరెస్టులను వామపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్ధి, యువజన సంఘాల నాయకులను బలవంతంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్ధి నాయకులను ఈడ్చుకుంటూ పోలీసు వాహనాల్లో ఎక్కించడం అభ్యంతరకరమన్నారు.