హోరాహోరీగా బండలాగుడు పోటీలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:35 AM
నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్బంగా రైతు సంఘం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ఎద్దుల బండలాగుడు పోటీలు పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో హోరాహోరీగా సాగుతున్నాయి.
విజేతలుగా ప్రకాశం, నంద్యాల జిల్లా వృషభాలు
ఎమ్మిగనూరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్బంగా రైతు సంఘం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ఎద్దుల బండలాగుడు పోటీలు పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం నాలుగు పాలపళ్ల సైజు విభాగంలో 10 జతలు పాల్గొనగా, ఆరు పాలపళ్ల సైజు విభాగంలో 17 జతల ఎద్దులు పాల్గొన్నాయి. నాలుగు పాలపళ్ల సైజు విభాగంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకువీడు కి చెందిన బూచిగారి విజయ్ లక్ష్మి నాయడు ఎద్దులు 5713.10 అడుగుల దూరాన్ని నిర్ణీత సమయంలో లాగి ప్రథమస్థానంలో నిలిచాయి. బాపట్ల జిల్లా పొంగనూరుకు చెందిన గొట్టిపాటి రవికుమార్ యూత్, కర్నూలు జిల్లా వెంకటగిరి గ్రామానికి చెందిన శేషాంక్ శ్రేయల ఎద్దులు 5700 అడుగుల దూరాన్ని లాగి ద్వితీయ స్థానంలోను, వైఎ్‌సఆర్ కడప జిల్లా చెన్నూరుకి చెందిన బొమ్మల సాయికుమార్‌రెడ్డికి చెందిన ఎద్దులు 5518.8అడుగుల దూరాన్నిలాగి తృతీయ స్థానంలోను, కడపజిల్లా వెల్లటూరు గ్రామానికి చెందిన ఇరగంరెడ్డి చంద్రారెడ్డి ఎద్దులు 5432.3 అడుగుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలోను, నంద్యాల జిల్లా బేతంచర్లకు చెందిన మేకల భానూజి, ఆవుకు గ్రామానికి చెందిన సంగబాల ఆంధోనమ్మకు చెందిన ఎద్దులు 5288 అడుగుల దూరాన్ని లాగి ఐదో స్థానంలో నిలిచాయి.
5,100 అడుగుల దూరాన్ని లాగి..
ఆరుపాల పళ్ల సైజు విభాగం పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి 17 జతల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. ఇందులో నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరుకి చెందిన బీఆర్‌కే రెడ్డి వృషభాలు 5,100 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. అదే రైతుకు చెందిన మరో జత ఎద్దులు 4,865 అడుగుల దూరాన్ని లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా బేతంచర్లకు చెందిన మేకల భానూజీ, కర్నూలు జిల్లా వెంకటగిరి గ్రామానికి చెందిన శేషాంక్ శ్రేయకు చెందిన ఎద్దులు 4,804 అడుగుల దూరాన్ని లాగి తృతీయ స్థానంలో నిలవగా సత్యసాయి జిల్లా బుల్లెట్‌పల్లి గ్రామానికి చెందిన బిచ్చిల భాస్కర్ రెడ్డి, బిచ్చల ప్రియతం రెడ్డిల ఎద్దులు 4800 అడుగుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో నిలవగా కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన శేషాంక్ శ్రేయకు చెందిన ఎద్దులు 4700అడుగుల దూరాన్ని లాగి ఐదో స్థానంలో నిలిచాయి. ఈ పోటీలను తిలకించేందుకు ఎమ్మిగనూరుతో పాటు సమీప గ్రామాల నుంచి మహిళలు, రైతులు పెద్దఎత్తున తరలిరావటంతో వీవర్స్ కాలనీ మైదానం కళకళలాడింది. గోనెగండ్ల మండలం హెచ్ కైరవాడికి చెందిన కళాకారుడు ఉస్మాన్ తన మిమిక్రీతో జనాన్ని అలరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాస్కర్ల చంద్రశేఖర్, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య, నిర్వాహకులు గుంటుపల్లి బాస్కర్, విరుపాక్షి రెడ్డి,మహేంద్రబాబు, చంద్రశేఖర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, కడిమెట్ల చెన్నారెడ్డి పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.