Share News

చెత్తకుప్పలో బ్యాలెట్‌ పేపర్లు

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:37 PM

ఎమ్మిగనూరు జూనియర్‌ కళాశాలలోని కౌంటింగ్‌ హాల్‌ వెనుక గోడ దగ్గర చెత్త కుప్పలో గోనెగండ్ల జడ్పీటీసీకి సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లు లభ్యం కావడం జిల్లాలో సంచలనం రేపింది.

 చెత్తకుప్పలో బ్యాలెట్‌ పేపర్లు
చెత్తకుప్పలో దొరికిన బ్యాలెట్‌ పేపర్లును చూపుతున్న వైసీపీ నాయకులు

గోనెగండ్ల జడ్పీటీసీ ఎన్నికల్లో ఘటన

విచారణకు అధికారులతో సమావేశమైన ఆర్డీవో అరుణా దేవి

గోనెగండ్ల, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు జూనియర్‌ కళాశాలలోని కౌంటింగ్‌ హాల్‌ వెనుక గోడ దగ్గర చెత్త కుప్పలో గోనెగండ్ల జడ్పీటీసీకి సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లు లభ్యం కావడం జిల్లాలో సంచలనం రేపింది. ఈ విషయంపై ఆదోని ఆర్డీవో అరుణాదేవి సోమవారం రాత్రి విచారణ నిమిత్తం గోనెగండ్ల ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని అధికారులతో సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్‌ రెడ్డి, ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌చార్జి రాజీవ్‌రెడ్డి సోమవారం ఈ విషయంపై కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. చెత్త కుప్పలో లభ్యమైన 50 ఎన్నికల బ్యాలెట్‌ పేపరును కలెక్టర్‌కు అందజేసినట్లు తెలిసింది. అలాగే బ్యాలెట్‌ పేపర్లు మిస్సింగ్‌పై సుమోటో కేసు నమోదు అయినట్లు కూడా సమాచారం. జిల్లాలో జరిగిన ఈ సంఘటనతో అధికారులు ఆందోళనకు గురువుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఎన్నికల రోజు ఎన్ని ఓట్లు పోలు అయ్యాయి? ఎన్ని ఓట్లను లెక్కించారు? అనే విషయంలో అధికారులు కుస్తీ పడుతున్నట్లు సమాచారం. ఓట్లను లెక్కించిన తరువాత సబ్‌ ట్రెజరీలో భద్రపరించేందుకు బ్యాలెట్‌ పేపర్లును ప్యాక్‌ చేస్తుండగా 50 ఓట్ల కట్ట ఒకటి కింద పడిపోయినట్లు అధికారులు చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాలెట్‌ పేపర్లు ప్యాక్‌ చేసే సమయంలో కింద పడిపోయాయా? లేక మరో విధంగా తప్పిదం జరిగిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేయడమే గాక హైకోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. గోనెగండ్ల జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఎన్నికల అఽధికారులు మరోసారి చేపట్టాలని ఎమ్మిగనూరు నియోజక వర్గ ఇన్‌చార్జి రాజీవ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 23 , 2026 | 11:37 PM