మండలాలకు బ్యాలెట్ పేపర్లు
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:24 AM
ఈ నెల 5న జరగనున్న ఎంపిటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌కు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను మండలాలకు చేరవేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
5న పరిషత్ ఎన్నికల పోలింగ్
కర్నూలు న్యూసిటీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఈ నెల 5న జరగనున్న ఎంపిటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌కు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను మండలాలకు చేరవేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కర్నూలు, నంద్యాల జడ్పీ సీఈవోలు ఆర్.సుధాకర్‌రెడ్డి, శివశంకర్, ఏఆర్వోలు అశ్వినికుమార్, పరిపాలన అధికారి మురళీమోహన్‌రెడ్డి పర్యవేక్షణలో స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో ముద్రిస్తున్న బ్యాలెట్ పేపర్లను ఆదివారం ఉదయం నుంచి ఆయా మండలాలకు పంపించే పనిలో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. ఆయా మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఏవోలు ఇక్కడకు పిలిపించి వారి ఆధ్వర్యంలో బ్యాలెట్ పేపర్లను పంపుతున్నారు. కర్నూలు జిల్లాలో ఎన్నికలు జరిగే మండలాలకు రాత్రిలోగా పం పేందుకు, నంద్యాల జిల్లాకు ఈ నెల 2వ తేదీ సాయంత్రలోగా పంపే చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో మొత్తం 432 ఎంపీటీసీ స్థానాలకు 74 స్థానాలు ఏకగీవ్రం కాగా, 358 స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. నంద్యాల జిల్లాలో మొత్తం 377 ఎంపీటీసీ స్థానాలకు 152 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి, మిగిలిన 225 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. బనగానపల్లె మండలంలోని క్రిష్ణగిరి ఎంపీటీసీ స్థానానికి దాఖలైన నామినేషన్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి. అక్కడ ఎన్నిక నిచిలిపోయింది. ఈనేపథ్యంలోనే నంద్యాల జిల్లాలో 224 ఎంపిటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కర్నూలు జిల్లాలోని 26 జడ్పీ టీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నంద్యాల జిల్లాలో 28 జడ్పీటీసీలకుగాను 8 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 20 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.