కేఈ రుద్రఫణికి నిరాశ?
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:40 AM
కృష్ణగిరి జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కుమారుడు కేఈ రుద్రఫణి అభ్యర్థనను అప్పిలేట్ అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తిరస్కరించినట్లు సమాచారం.
నామినేషన్ తిరస్కరణ సబబే
అప్పీల్‌ను కొట్టివేసిన కలెక్టర్
మళ్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం
కర్నూలు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణగిరి జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కుమారుడు కేఈ రుద్రఫణి అభ్యర్థనను అప్పిలేట్ అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఆయన అభ్యర్థిత్వంపై మళ్లీ టెన్షన్ మొదలైంది. అప్పిలేట్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ నిర్ణయంపై టీడీపీ అభ్యర్థి కేఈ రుద్రఫణి మరోసారి మంగళవారం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. నేటి సాయంత్రంలోగా న్యాయస్థానం నుంచి సానుకూలమైన ఆదేశాలు వస్తే ఆయన జడ్పీటీసీ ఎన్నికల్లో ఉంటారు. లేదంటే తుది జాబితాలో ఆయన పేరు ఉండదు. వాస్తవంగా కేఈ రుద్రఫణి ఓటు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. జిల్లా పరిషత్ ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లాలో ఏ మండలంలోనైనా సరే గ్రామీణ ప్రాంతంలో ఉండాలి. అర్బన్ పరిధిలో ఓటు ఉన్నవాళ్లు గ్రామీణ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ విషయం ముందే తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి కేఈ రుద్రఫణి కర్నూలు అర్బన్ పరిధిలోని తన ఓటును తొలగించి పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని స్వగ్రామైన కృష్ణగిరి మండలం కంబాలపాడులో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబరు 9న దరఖాస్తు చేసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆయన అభ్యర్థనను ఆమోదించి అదే నెల 16న పత్తికొండ నియోజకవర్గంలోకి ఓటును మార్చింది. దీంతో కృష్ణగిరి జడ్పీటీసీ స్థానానికి కేఈ రుద్రఫణి నామినేషన్ వేశారు. 2026 జనవరి 1 నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొంది. ఆ జాబితాలో ఆయన పేరు కృష్ణగిరి మండలం కంబాలపాడులో లేదు. దీంతో ఆర్‌వో, సీఈవో సుధాకర్‌రెడ్డి నామినేషన్‌ను తిరస్కరించారు. ఆర్‌వో నిర్ణయంపై అప్పిలేట్ అధికారి అయిన కలెక్టరు డాక్టర్ ఏ.సిరికి అప్పీల్ చేశారు. అయితే అంతకుముందే కేఈ రుద్రఫణి తన నామినేషన్‌ను ఆమోదించేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. శనివారమే వాదనలు ముగిసినా, ఆదివారం సెలవు కావడంతో న్యాయస్థానం తీర్పు కాపీలు సోమవారం అందాయి. పిటిషనర్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్‌వో, అప్పిలేట్ అధికారికి హైకోర్టు సూచించినట్లు సమాచారం. అదే క్రమంలో పిటిషనర్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కేఈ రుద్రఫణి నామినేషన్‌ను తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలు (రూల్స్) మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.