చీకట్లు మిగిల్చిన దీపావళి
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:55 PM
వెలుగుల పండుగ దీపావళి వారి ఇంట చీకట్లను మిగిల్చింది. రోడ్డు ప్రమాదం రూపంలో విధి ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఆదోని-1 మండల పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వలస మహిళా కూలీ మహేశ్వరి (28) దుర్మరణం చెందగా మరో పది మంది గాయపడ్డారు.
ఆదోనిలో ఆటోను ఢీకొన్న కారు
మహిళా వలస కూలీ దుర్మరణం
భర్త పరిస్థితి విషమం
9 మందికి గాయాలు
ఆదోని రూరల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): వెలుగుల పండుగ దీపావళి వారి ఇంట చీకట్లను మిగిల్చింది. రోడ్డు ప్రమాదం రూపంలో విధి ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఆదోని-1 మండల పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వలస మహిళా కూలీ మహేశ్వరి (28) దుర్మరణం చెందగా మరో పది మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... ఆదోని-1 మండల పరిధిలోని కపటి గ్రామానికి చెందిన దాదాపు 18 మంది వలస కూలీలు దసరా పండుగ సమయంలో బ్రతుకుదెరువు కోసం కర్ణాటక రాష్ట్రం సైదాపూర్‌కు వెళ్లారు. అక్కడ పత్తి పనిచేస్తూ జీవనం సాగించారు. దీపావళి పండుగ చేసుకునేందుకు వారంతా ఆదివారం కపటి గ్రామానికి బయల్దేరారు. ఉదయం 10 గంటల సమయంలో ఆదోని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. గ్రామానికి చెందిన రెండు ఆటోలను పిలిపించుకుని ఒక ఆటోలో పది మంది బయల్దేరగా.. మరో ఆటోలో ఎనిమిది మంది వెళ్లారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రం ఉడిపి పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం ఐదుగురు కుటుంబ సభ్యులతో కలసి కేఏ 20 ఎంజీ 9754 కారులో మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆదోని-ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు ఆంజనేయస్వామి విగ్రహం వద్దకు రాగానే పదిమందితో వెళ్తున్న ఆటో, కారు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త ఈరన్న, హనుమన్న, మహేశ్వరి, లక్ష్మీ, తాయమ్మ, దేవి, డ్రైవర్ ఆంజనేయులుతో పాటు చిన్నారులు స్పందన, నందు, దర్శన్ తీవ్రంగా గాయపడ్డారు. తాలుక సీఐ నల్లప్ప, ఎస్‌ఐ రామాంజనేయులు సిబ్బందితో అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఈరన్న పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.