రోడ్డెక్కిన ఆటో నగర్ బాధితులు
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:51 PM
ఆటోనగర్ బాధితులు రోడ్డెక్కారు. స్థలాల కేటాయింపుల్లో పురోగతి లేదని, సభ్యుల నుంచి సేకరించిన నిధులు దుర్వినియోగం చేశారంటూ కొంతకాలంగా వివాదం నడుస్తోంది.
తాలుకా పోలీసు స్టేషన్ ఎదుట ఉద్రిక్తత
బాధితుల పక్షాన మాజీ ఎమ్మెల్యే భూమా
స్తంభించిన ట్రాఫిక్
ఇబ్బందులు పడ్డ వాహనదారులు
నంద్యాల క్రైమ్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఆటోనగర్ బాధితులు రోడ్డెక్కారు. స్థలాల కేటాయింపుల్లో పురోగతి లేదని, సభ్యుల నుంచి సేకరించిన నిధులు దుర్వినియోగం చేశారంటూ కొంతకాలంగా వివాదం నడుస్తోంది. బాధితుల పక్షాన భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు న్యాయం కోసం మంగళవారం తాలూకా పోలీసులను ఆశ్రయించారు. ఆటోనగర్ బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని కోరిన మాజీ ఎమ్మెల్యే, అధికార పార్టీ నేత భూమా బ్రహ్మానందరెడ్డిని బయట కూర్చోమని సీఐ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు . తాలూకా పోలీసు స్టేషన్ ఎదుట భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఆటోనగర్ కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని కోరుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆయన మాట్లాడుతూ నంద్యాల సమీపంలో ‘ది నంద్యాల ఆటోనగర్ వర్కర్స్ అసోసియేషన్‘ 1994లో ఏర్పడిందని, సంఘంలో 554 మంది సభ్యులు ఉన్నట్లు భూమా తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో స్థలాలు కేటాయి స్తామని చెబుతూ పలువురు కమిటీ సభ్యులు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేసి నేటికీ స్థలాలు కేటాయించలేదని, ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండేళ్లుగా జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ముఖ ్యమంత్రికి కూడా వినతిపత్రం ఇచ్చామన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. నిధులు దుర్వినియోగం చేసిన పాత కమిటీ సభ్యులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నలుగురిపై కేసు నమోదు
దాదాపు రూ.36లక్షలకు పైగా నిధుల దుర్వినియోగం, పాత కమిటీ సభ్యుల బెదిరింపులపై ఆటోనగర్ కార్మికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి అధ్యక్షుడు జాకీర్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ హనీఫ్, కార్యదర్శి జాకీర్, ట్రెజరర్ యూసుఫ్ తదితరులు సభ్యుల పేరుతో నిధులు సేకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని తక్షణమే అరెస్టు చేసి న్యాయం చేయాలని వారు కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.