పోలీస్ స్టేషన్‌లోపోలీసులపై దాడి!?
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:17 AM
ఓ కేసు విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపై దాడి జరిగింది. ఇది ఎక్కడో జరిగింది కాదు. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే పోలీసులను గోళ్లతో రక్కి, దాడికి పాల్పడ్డారు.
ప్రేమజంట వివాహంపై గొడవ
అడ్డుకునే క్రమంలో పోలీసులపైనా...
కేసు నమోదుకు ఏఎస్పీ ఆదేశం?
నంద్యాల, క్రైం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఓ కేసు విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపై దాడి జరిగింది. ఇది ఎక్కడో జరిగింది కాదు. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే పోలీసులను గోళ్లతో రక్కి, దాడికి పాల్పడ్డారు. తమకు ఏమాత్రం ఇష్టంలేని వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతో వధువు తల్లి, బంధువులు కన్న కూతురుపై దాడికి పాల్పడ్డారు. ఆవేశాన్ని ఆపుకోలేక సర్దిచెప్పి విడిపించేందుకు వెళ్లిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఓ ఏఎ్‌సఐపై కూడా దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన నంద్యాల పట్టణంలోని తాలూకా పోలీసు స్టేషన్‌లో గురువారం చోటు చేసుకుంది. నంద్యాల పట్టణానికి చెందిన షేక్‌భాను, ఖలీల్ అహ్మద్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇంట్లో చెబితే పెళ్లికి అంగీకరించని..ఎవరికీ చెప్పకుండా ఇంటిలోనుంచి వెళ్లిపోయి ప్రభుత్వ ఖాజీ సమక్షంలో వివాహం చేసుకున్నారు. తమ కూతురు షేక్ భాను క నిపించడం లేదంటూ ఇటీవల పోలీసులకు ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీసులు మిస్పింగ్ కేసు కూడా నమోదు చేశారు. అయితే పెళ్లి చేసుకున్న ప్రేమ జంట కలిసి తాము మేజర్లమని, ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని తెలిపేందుకు తాలూకా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఈ విషయంపై మాట్లాడేందుకు వధువు షేక్ భాను తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్‌కు గుంపులుగా చేరుకున్నారు. కన్న కూతురు చూసిన తల్లి, బంధువులు ఆవేశంలో సహనం కోల్పోయి పోలీసుల ఎదుటే భానుపై దాడికి దిగారు. సర్దిచెప్పి విడిపించేందుకు వెళ్లిన మహిళా కానిస్టేబుళ్లు, ఏఎ్‌సఐపై కూడా దాడికి దిగారు. దీంతో కొద్దిసేపు స్టేషన్ ప్రాంగణమంతా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎట్టకేలకు స్థానికులు, స్టేషన్‌లో విధుల్లో ఉన్న మరికొందరు కలిసి విడిపించడంతో గొడవ సద్దుమణిగింది. ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై రక్కడంతో గాయాలయ్యాయి. కాగా ఘటనపై సంబంధిత స్టేషన్ అధికారి స్పందించకపోవడంతో మహిళా కానిస్టేబుళ్లు నేరుగా అడిషనల్ ఎస్పీ ఎం.జావళికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఏఎస్పీ ఆదేశాల మేరకు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడినట్లుగా పది మందిపై కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా నంద్యాల ప్రధాన రోడ్డుపై పోలీసు స్టేషన్ ఉండటంతోపాటు ఒకే కాంపౌండ్‌లో పలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి. నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, కస్టమర్లతో రద్దీ ప్రాంతం కావడంతో పట్టపగలు పోలీసు స్టేషన్‌లో కేకలు వేస్తూ వధువుతోపాటు పోలీసులపై కూడా దాడికి పాల్పడటం చూసిన స్థానికులు నివ్వెరపోయారు. ఏమి జరుగుతుందో అర్థంకాక పలువురు స్థానికులు కూడా స్టేషన్‌లోకి వెళ్లి సర్దిచెప్పి విడిపించడంతో గొడవ సద్దుమణిగింది. గురువారం జరిగిన ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.