Share News

ఏసీబీ వలలో ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:28 PM

: ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రమే్‌షబాబు గురువారం ఏసీబీ వలకు చిక్కారు. కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ వలలో ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌
విచారణ చేపడుతున్న ఏసీబీ అధికారులు

వీఎల్‌టీ మంజూరుకు రూ.20వేలు లంచం డిమాండ్‌

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

కమిషనర్‌తో పాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అరెస్టు

ఆత్మకూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రమే్‌షబాబు గురువారం ఏసీబీ వలకు చిక్కారు. కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణానికి అవసరమైన ఖాళీ స్థలానికి సంబంధించిన పన్ను (వీఎల్‌టీ) మంజూరుకు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం సాయంత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు పట్టణంలోని కొత్తపేటకు చెందిన నాయబ్‌ సయ్యద్‌ సజ్జత్‌ అలీ అనే వ్యక్తి తాను నిర్మిస్తున్న ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణానికి సంబంధించి వీఎల్‌టీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీఎల్‌టీ మంజూరుకు మున్సిపల్‌ కమిషనర్‌ రూ.20వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఈ నెల 4వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో నగదు ఇచ్చే సమయంలో దాడులు చేపట్టాలని ఏసీబీ అధికారులు ముందుగానే ప్లాన్‌ వేశారు. అనుకున్న విధంగానే గురువారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయంలోనే అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న బిల్‌ కలెక్టర్‌ భాస్కర్‌ ద్వారా రూ.20వేల నగదును కమిషనర్‌ తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన నగదును ఫినాప్తలిన్‌ ద్రావణం ద్వారా నిర్ధారించి ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కాగా ఇదే వీఎల్‌టీ కోసం గతంలో మరో రూ.20వేలు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ చెప్పారు. దాడులు చేసిన ఏసీబీ బృందంలో సీఐ బత్తుల కృష్ణయ్య, ఎస్‌ఐ సుబ్బరాయుడు, సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు బిల్‌ కలెక్టర్‌ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు మున్సిపల్‌ కార్యాలయంలోనే సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 8 గంటల తర్వాత వారిద్దరినీ కర్నూలుకు తరలించారు. అక్కడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సోమన్న వెల్లడించారు. మున్సిపల్‌ కమిషనర్‌ లంచం తీసుకుంటూ పట్టుబడిన తీరు ఆత్మకూరులో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Feb 05 , 2026 | 11:28 PM