టీడీపీ నేతలపై హత్యాయత్నం
ABN , Publish Date - May 11 , 2026 | 11:44 PM
కూటమి నేతల వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే ఆదోనిలో సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి.
దాడులకు పాల్పడిన బీజేపీ నాయకులు
ఇద్దరి పరిస్థితి విషమం
నిందితులతోనే కలిసి ఎమ్మెల్యే ప్రెస్‌మీట్
ఆదోని మండలం కుప్పగల్‌లో పోలీస్ పికెట్
ఆదోని రూరల్, మే 11 (ఆంధ్రజ్యోతి): కూటమి నేతల వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే ఆదోనిలో సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. కూటమి నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ఆ వర్గాల్లోని నేతలే కొట్టుకుంటున్నారు. ఇటీవల వైసీపీ నుంచి బీజేపీలోకి చేరిన నాయకులు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడి హత్య చేసేందుకు ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు ప్రదర్శించిన రౌడీయిజాన్ని ప్రస్తుతం బీజేపీలోకి చేరి అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో బీజేపీ నాయకులు టీడీపీకి చెందిన షణ్ముఖ, శేఖర్, తిక్కన్నల ఇంటిపై దాడికి పాల్పడి హత్యకు యత్నించారు. వీరిలో షణ్ముఖ, శేఖర్ పరిస్థితి విషమంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితుల కథనం మేరకు...
ఆదోని మండలం కుప్పగల్ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు షణ్ముఖ, ప్రస్తుత బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి కుటుంబానికి మధ్య రాజకీయ వైరం ఉంది. వైసీపీ హయాంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి షణ్ముఖ, వైసీపీ మద్దతుతో నాగిరెడ్డి బరిలో దిగారు. ఈ పోటీల్లో నాగిరెడ్డి సర్పంచ్‌గా గెలిచాడు. ఐదు సంవత్సరాలుగా షణ్ముఖ ఇంటికి తాగునీటి కనెక్షన్ ఇచ్చేందుకు నాగిరెడ్డి సహకరించలేదు. 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో సర్పంచ్ నాగిరెడ్డి, ఆయన అనుచరులు వైసీపీని వీడి బీజేపీలో చేరారు. సర్పంచుల పదవీ కాలం గత నెలలో ముగియడంతో నాగిరెడ్డి సర్పంచ్ పదవి కాలం పూర్తయింది. దీంతో టీడీపీ నాయకుడు షణ్ముఖ అధికారులతో మాట్లాడి వారం రోజుల క్రితం తన ఇంటికి తాగునీటి పైపులైన్ కనెక్షన్ తీసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన నాగిరెడ్డి, ఆయన కుమారుడు సూరి, మరో ఐదుగురు ఎనుమల చిన్నోడు, తిమ్మప్ప, ఎనుమల భాస్కర్, మోషన్, ఎనుమల చిన్నారెడ్డి, ముక్కన్న సోమవారం షణ్ముఖ ఇంటికి వెళ్లారు. కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ‘కొడకా ఎవరిని అడిగి కొలాయి వేయించుకున్నావ్... నా అనుమతి లేకుండానే కొళాయి వేసుకుంటావా? ఎంత ధైర్యం. మిమ్మల్ని అందర్నీ చంపేస్తా..’ అంటూ బండబూతులు తిడుతూ హంగామా సృష్టించారు. షణ్ముక తలపై రాడ్లతో బాది, కత్తులతో పొడిచారు. పక్కనే ఉన్న శేఖర్‌ను కూడా నేలపైకి తోసి ఇటుక రాళ్లతో కొట్టి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న షణ్ముఖ, శేఖర్‌లను చుట్టుపక్కల వారి సహాయంతో కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వాసు పత్రికి తరలించారు. షణ్ముఖ తల పగలడంతో 10 కుట్లు వేశారు. శేఖర్ గుండెపై తీవ్రంగా కొట్టడంతో ఆయన గుండెపోటుకు గురయ్యారు. గుర్తించిన డాక్టర్లు తక్షణమే రూ.40వేలు విలువ చేసే ఇంజక్షన్‌ను శేఖర్‌కు వేయడంతోపాటు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక షణ్ముఖ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చిక్సి పొందుతున్న వారిని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు తదితరులు పరామర్శించారు.
8మందిపై కేసు నమోదు
కుప్పగల్‌లో జరిగిన దాడులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన షణ్ముఖ, శేఖర్, తిక్కన్నలపై కత్తులు, రాడ్లు, గొడ్డళ్లతో దాడులు జరిగాయని బాధితులు ఫిర్యాదు చేసినట్లు సీఐ నల్లప్ప, పెద్దతుంబళం ఎస్‌ఐ విద్యశ్రీలు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడులకు పాల్పడిన నాగిరెడ్డి, సూరి, తిమ్మప్ప,ఎనుమల చిన్నోడు, ఎనుమల భాస్కర్, మోషన్, ఎనుమల చిన్నారెడ్డి, ముక్కన్నలపై బీఎన్‌ఎ్‌స 109 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుప్పగల్ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పార్థా.. ఇదేం తీరు!
టీడీపీ నేతలపై హత్యాయత్నం, గొడవలతో కుప్పగల్లు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నాయకులు నాగిరెడ్డి, సురేష్‌లు దాడులకు పాల్పడినట్లు బాధితుల నుంచి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నిందితుల పక్షాన నిలబడటం, వారిని వెంట పెట్టుకుని రావడం, ప్రెస్‌మీట్ నిర్వహించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. హత్యకు యత్నించిన వారితో ఎమ్మెల్యే పార్థసారథి ఆసుపత్రికి వచ్చి పరామర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడులకు పాల్పడిన నాగిరెడ్డి, సురేష్, మిగిలిన ఐదుగురితో కలసి పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే ‘బీసీలపై జరిగిన దాడులు..’ అంటూ అభివర్ణించడం ఏమిటని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.