సమస్యల ‘ఆస్పరి’
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:55 PM
మండల కేంద్రమైన ఆస్పరిలో శనివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సర్వం సిద్ధమవుతోంది.
రేపు ‘సంజీవని’ ఆరో విడత ప్రారంభానికి వస్తున్న సీఎం
చంద్రబాబు పర్యటించే పీహెచ్‌సీలోనే సమస్యల తిష్ఠ
తాగడానికి నీరు లేదు.. బెడ్లన్నీ శిథిలం..!
నెలలు గడిచినా మరమ్మతులు నోచుకోని బోరు
దాహంతో తల్లడిల్లుతున్న మండల ప్రజలు
‘జోహరాపురం’లో నేటికీ బురద నీరే ప్రాణజలం..!
గిట్టుబాటు ధర లేని టమోటా
సమస్యలు పరిష్కరించాలని ప్రజల విన్నపం
కర్నూలు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన ఆస్పరిలో శనివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సర్వం సిద్ధమవుతోంది. ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వేదికగా ‘సంజీవని’ ప్రాజెక్టు ఆరో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వస్తున్నారు. సీఎం అడుగు పెడుతున్న ఆస్పరి గడ్డపై ఒక వైపు అధికార యంత్రాంగం రంగులు, హంగులతో హడావుడి చేస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో దశా బ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు పాలకులకు సవాల్ విసురుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఏపల్లెకు వెళ్లినా గుక్కెడు నీటి కోసం జనం తల్లడిల్లుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. 79 ఏళ్ల స్వాతం త్య్ర దేశంలో జోహరాపురం గ్రామస్థులకు వక్రేణీ బురద నీరే ప్రాణజలం. గిట్టుబాటు ధర అందక టమోటా రోడ్లపాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఎన్నో. ‘సంజీవని’ (అమృతం) పంచడానికి వస్తున్న సీఎం చంద్రబాబు సార్..! మా ప్రాంత సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు ఆశగా విన్నవిస్తున్నారు.
సీఎం సందర్శించే ఆసుపత్రి అధ్వానం
జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూరు నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన మండలం ఆస్పరి. మండలంలో 33 గ్రామాలు, 44వేలకు పైగా జనాభా ఉంది. ఏ చిన్న జబ్బు చేసినా 30-35 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆదోనిని కాని, వంద కిలోమీటర్ల దూరంలో ఉండే కర్నూలుకు కాని వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆర్‌ఎంపీను ఆశ్రయించాల్సి వస్తుంది. లేదంటే మండల కేంద్రంలో 24 గంటలు పని చేసే ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఆ పీహెచ్‌సీలో ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. ఈ ఆసుపత్రిలోనే సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంజీవని ఆరవ విడత కార్యక్రమాన్ని శనివారం ప్రారంభిస్తారు. అదే ఆస్పరి పీహెచ్‌సీ సమస్యల రోగాల బారిన పడి కొట్టుమిట్టాడుతోంది. తాగునీటి బోరు చెడిపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోలేదు. రోగులు, గర్భిణులు చుక్క నీటి కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారు. రోగుల కోసం ఉన్న ఆరు బెడ్లు కూడా పూర్తిగా శిథిలమయ్యాయి. కాన్పుల గది కనీస సౌకర్యాలు లేక అస్తవ్యస్తంగా మారింది. వైద్యులు, సిబ్బంది క్వార్టర్లు లేక రాత్రి డ్యూటీలకు వైద్యులు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కేవలం పైపైన రంగులు వేసి మభ్యపెట్టకుండా, ఆసుపత్రికి శాశ్వత నిధులు మంజూరు, మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పది రోజులకోసారి తాగునీరు.. గుంతల రోడ్లు
పదివేలకు పైగా జనాబా కలిగిన మండల కేంద్రం ఆస్పరి సహా మెజారిటీ గ్రామాల్లో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. వారం పది రోజులకు ఒకసారి కూడా కొళాయిలకు తాగునీరు రావడం లేదు. బిందెడు నీటికి జల సమరం తప్పడం లేదని పల్లెజనం ఏకరువు పెడుతున్నారు. టీబీపీ, ఎల్లెల్సీ నీటిని నాగనాథనహల్లి ఎస్‌ఎస్ ట్యాంకులో నింపి ఆస్పరి సహా 17 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు అందించాల్సిన ఆస్పరి రక్షిత మంచినీటి పథకం నుంచి ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలియడం లేదని ప్రజలు కన్నీటి కష్టాలు ఏకరువు పెడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనికి తోడు మండలం లో ప్రధాన గ్రామాల రహదా రులన్నీ గుంతలమయమై అస్తవ్యస్తంగా మారాయి. గుంతల రోడ్లుపై ప్రయాణించే ప్రజలు ముఖ్యంగా గర్భిణులు, రోగులు, నరకయాతన అనుభవిస్తున్నారు. మండలంలో దాదాపు 12వేలకు పైగా జనాభా కలిగిన గ్రామం జోహరాపురం. బసాపురం రక్షిత మంచినీటి పథకం ద్వారా ఫిల్టర్ చేసిన తుంగభద్ర జలాలు తాగునీరుగా సరఫరా చేయాలి. నెలలో నాలుగైదు రోజులు కూడా నీళ్లు రావడం లేదని ఆ గ్రామస్థుల ఆవేదన. ఈ పల్లెలో నేటికీ స్వాతంత్య్రం రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాతల కాలం నాటి ‘వక్రేణి’ (వర్షపు నీటి నిల్వ కుంట)లోని బురద నీటినే గ్రామస్థులు నేటికి తాగునీరుగా వాడుకుంటున్నారు. రంగుమారిన, క్రిమికీటకాలతో కూడిన నీటిని వడపోసుకుని తాగడం వల్ల ప్రజలు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. ఈ గ్రామానికి రక్షిత మంచి నీటి పథకం ఎప్పుడు వస్తుందో చెప్పే నాథులే లేరు. అయితే.. హంద్రీ-నీవా కాలువ ద్వారా శుద్ది చేసిన నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం రూ.67 లక్షలు మంజూరు చేసింది. పనులు మొదలు కాలేదు.
టమోటా రోడ్డుపాలు..
ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలు టమోటా సాగుకు ప్రసిద్ధి. ఆస్పరి మండలంలో ప్రతి గ్రామంలో ప్రధాన పంటగా టమోటా సాగు చేస్తున్నారు. ఈ మండలం ఒక్కటే 15-20వేల ఎకరాల్లో టమోటా సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా ధరలు పతనవుతున్నాయి. కిలో రూపాయికి కూడా కొనుగోలు చేసే నాథుడు కరువై.. రోడ్డున పారబోసిన దృశ్యాలు ఏటేటా నిత్యకృత్యాలుగా మారాయి. గిట్టుబాటు ధర అందించాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదు. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించక.. కనీసం కోత కూలి, రవాణా ఖర్చులు కూడా రాక రైతులు అప్పులపాలవుతున్నారు. పండించిన పంటను అమ్ముకోలేక కష్టజీవులు కన్నీళ్లతో రోడ్లపైన పారబోసిన చేదు ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పత్తికొండ వద్ద టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం చేపట్టినా వినియోగంలోకి రాలేదు. టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని ఇక్కడి రైతుల దశాబ్దాల స్వప్నం.
సీఎం గారూ.. మా ‘ఆస్పరి’ కష్టాలు తీర్చండి
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసే సీఎం చంద్రబాబు గారూ..! కేవలం వేదికలపై ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా తమ క్షేత్రస్థాయి సమస్యలపై ప్రత్యేక సమీక్ష జరపానలి ఆస్పరి మండల ప్రజలు విన్నపం.
ఆస్పరి పీహెచ్‌సీనీ 25పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి.. 24 గంటలు అన్ని రకాల మెరుగైన వైద్యసేవలు అందించాలి.
జోహరాపురం గ్రామానికి హంద్రీ-నీవా కాలువ తాగునీటి సరఫరా పథకం పనులు తక్షణమే చేపట్టి పూర్తి చేయాలి.
కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు, ఆలూరు, ఆస్పరి అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిలో హంద్రీ నదిపై నిర్మించిన అలారుదిన్నె వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. నిధులు మంజూరు చేసి వంతెన పునర్నిర్మాణం చేయాలి.
మండల కేంద్రం ఆస్పరికి రోజు తాగునీటి సరఫరాకు తక్షణ చర్యలు చేపట్టాలి.
ఉల్లి తరహాలో ఏటా టమోటాకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదంటే బోనస్ ఇవ్వాలి.
కస్తూర్బాగాంధీ బాలికల రెసిడెన్సియల్ పాఠశాలలో 6వ తరగతిలో మాత్రం 60 మంది విద్యార్థినులు మాత్రమే చేర్చుకుంటున్నారు. ఈ సంఖ్యను 150 కి పెంచాలి.