Share News

చికెన్‌ అడిగితే చీదరింపులు

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:32 AM

వసతిగృహంలో వంట మనిషిదే హవా. అతడు పెట్టిందే తినాలి. అంతకు మించి అడగకూడదు. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒక ముక్క చికెన్‌ అడిగినందుకు చీదరించుకున్నాడు.

చికెన్‌ అడిగితే చీదరింపులు
ఒకే చికెన్‌ ముక్క వేస్తున్న వంట మనిషి

వంట మనిషిదే హవా

అరకొరగా భోజనం వడ్డింపు

ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు

వసతి గృహంలో కరువైన కనీస సౌకర్యాలు

ఆళ్లగడ్డ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): వసతిగృహంలో వంట మనిషిదే హవా. అతడు పెట్టిందే తినాలి. అంతకు మించి అడగకూడదు. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒక ముక్క చికెన్‌ అడిగినందుకు చీదరించుకున్నాడు. ఈఘటన మంగళవారం రాత్రి బీసీ బాలుర వసతిగృహంలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో పది, ఇంటర్‌ విద్యార్థులు ఒకే వసతి గృహంలో ఉంటున్నారు. హాస్టల్‌ను పర్యవేక్షించాల్సిన వార్డెన్‌ అందుబాటులో లేక పోవడంతో విద్యార్థులకు వంట మనిషి, వాచ్‌మన్‌లే అన్ని చూసుకునే పరిస్థితి నెలకొంది.

90 మంది విద్యార్థులు.. ఆరు కిలోల చికెన్‌

మంగళవారం రాత్రి మెనూ ప్రకారం కలర్‌ రైస్‌, చికెన్‌ కర్రీ చేశారు. ఈ వసతిగృహంలో టెన్త్‌, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు 90 మంది దాకా ఉన్నారు. ఆరు కిలోల చికెన్‌ వండినారు. కొంత మంది విద్యార్థులు ఒకే చికెన్‌ ముక్క పడటంతో ఇంకో ముక్క వేయమని అడిగాడు. వంట మనిషి చీదరించుకున్నాడు. ఇలాంటి ఘటనలు ఇక్కడ నిత్యకృత్యమని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.

కరువైన సౌకర్యాలు

వసతిగృహంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. రాత్రి సమయంలో విద్యుత్‌ లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న వార్డెన్‌ను బనగానపల్లెకు అక్కడ పనిచేస్తున్న వార్డెన్‌ను ఆళ్లగడ్డకు బదిలీ చేశారు. వార్డెన్‌ ఆళ్లగడ్డ వసతి గృహాంలో రాత్రి సమయాల్లో అందుబాటులోలేక విద్యార్థులు గోడను దూకి పక్కన ఉన్న హోటల్‌లోకి వెళ్తున్నారు. అక్కడ టీవీ చూస్తూ రాత్రాంత గడపడం కొంతమంది విద్యార్థులు డబ్బుల కోసం టీ బంకులో కప్పులు కడుగుతున్నారు. ఇప్పటి కైనా అధికారులు చర్యలు చేపట్టి విద్యార్థులు బయటికి పోకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

బయటకు వెళ్తున్నట్లు నాకు తెలియదు

ఇటీవలే బదిలీపై ఆళ్లగడ్డకు వచ్చా. స్థానికంగా ఉంటా. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజన వసతులు కల్పిస్తున్నాం. విద్యార్ధులు బయటకు వెళ్తున్నట్లు నాకు తెలియదు. అలా జరగకుండా చర్యలు తీసుకుంటా. - నాగేంద్ర, వార్డెన్‌, బీసీ బాలుర వసతిగృహం, ఆళ్లగడ్డ

Updated Date - Mar 12 , 2026 | 12:32 AM