శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్ర పూజలు
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:02 PM
శ్రీశైల క్షేత్రంలో ఆరుద్ర నక్షత్ర పర్వదిన ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
స్వర్ణరథంపై ఆది దంపతుల విహారం
శ్రీశైలం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో ఆరుద్ర నక్షత్ర పర్వదిన ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకంతోపాటు విశేష పూజలు అర్చకవేదపండితులచే నిర్వహించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్‌నాయుడు తెలిపారు. అనంతరం గంగాధర మండపం వద్దకు పల్లకిలో స్వామి, అమ్మవారికి పూజలు నిర్వహించారు. స్వర్ణ రథంపై ఆది దంపతులు విహరించారు. గంగాధర మండపం నుంచి నంది ఆలయం వరకు జరిగిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.