నిరంకుశత్వంపై కళాకారులు గళమెత్తాలి
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:07 PM
పాలకుల నిరంకుశత్వంపై ప్రజా కళాకారులు సమరశంఖం పూరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు నిచ్చారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
మహానంది, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పాలకుల నిరంకుశత్వంపై ప్రజా కళాకారులు సమరశంఖం పూరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు నిచ్చారు. ఆదివారం మహానంది సమీ పంలోని ఒక కల్యాణమంటపంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర సమితి సమావేశాన్ని ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, సీపీ ఐ మండల కార్యదర్శి ఆర్ సామేలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన ఈశ్వరయ్య మాట్లాడుతూ 1925లో సీపీఐ ఆవిర్భవిం చినప్పటి నుంచి అణగారిన వర్గాల పక్షాన నిలబడి రాజీ లేని పోరాటం చేస్తున్నదని అన్నారు. 1930లో ఆనాటి జాతీయ కార్యదర్శి పీసీ జోషి దూరదృష్టితో కళను, కళాకారులను ప్రజా ఉద్యమంలో భాగస్వాములు చేసి ప్రజా నాట్యమండలిని ఒక సామాజిక ఆయుధంగా తీర్చిదిద్దా రన్నారు. ప్రధానమంత్రి మోదీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని మండి పడ్డారు. ఇరాన్‌పై యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయని, దీని ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మధ్య తరగతి ప్రజలు జీవనం దుర్భరంగా మారిందని అన్నారు. సమాజంలో పెరుగుతున్న అసమానతలపై, పాలకుల నియంతృత్వ విధానాలపై ప్రజా నాట్యమండలి కళాకారులు ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.