నిందితులను అరెస్టు చేయాలి
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:17 AM
గోనెగండ్లలో భూవివాదం కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన చాకలి ఈరమ్మ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందిందని, ఆమె మృతికి కారణమైన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. గురుశేఖర్ డిమాండ్ చేశారు.
రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. గురుశేఖర్
కలెక్టరేట్ ఎదుట ఈరమ్మ మృతదేహంతో ధర్నా
కర్నూలు న్యూసిటీ/గోనెగండ్ల, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): గోనెగండ్లలో భూవివాదం కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన చాకలి ఈరమ్మ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందిందని, ఆమె మృతికి కారణమైన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. గురుశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం ఈరమ్మ మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట బంధువులు, రజక సంఘాల అధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా గురుశేఖర్ మాట్లాడుతూ ఈరమ్మ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, గోనెగండ్ల తహసీల్దారు, మండల సర్వేయర్, గ్రామ వీఆర్‌ఓ, భూమిని అక్రమంగా లాక్కున్న సంజన్న కుమారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పేదల భూములను పెత్తందారులు లాక్కుంటున్న సమస్యలపై కలెక్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని కోరారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా అధికారులు తమ ఆర్థిక స్వార్థం కోసం ఎలా ఆన్‌లైన్‌లో ఎక్కిస్తారని ఆయన ప్రశ్నించారు. భూ సమస్యలపై కలెక్టర్ ప్రత్యేకమైన శ్రద్ధతో పరిశీలించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం డీఆర్‌ఓ వెంకటనారాయణమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి జి. రామక్రిష్ణ, వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, శేషాద్రి, జయమ్మ, రాముడు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.